వైసీపీలోకి ముద్రగడ.. రెండున్నరేళ్ల సీఎం పదవి సంగతేంటి?
వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన ముద్రగడ పద్మనాభం. రెండున్నరేళ్ల సీఎం సంగతేంటని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు.
Update: 2024-03-10 10:04 GMT
ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కీలక నేతలు సైతం పార్టీ మారుతుండటంతో ఆంధ్ర రాజకీయాలు రోజుకో రంగు అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. తన కుమారుడు గిరితో కలిసి మార్చి 14న వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు స్వయంగా ప్రకటించారు. వైసీపీలో చేరడానికి తాను ఎటువంటి షరతులు పెట్టలేదని, అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దానికి తన వంతు న్యాయం చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే మార్చి 14న ముద్రగడ అనుచరులు తాడెపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
గతంలోనే వచ్చిన వార్తలు
గతంలోనే ముద్రగడ పార్టీ మారుతారని, వైసీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని అప్పట్లో ముద్రగడ తోసిపుచ్చారు. ఆ తర్వాత జనసేన, టీడీపీ నేతలు ఆయనతో భేటీ కావడంతో ఆయన జనసేనలో చేరొచ్చన్న వార్తలు వినిపించాయి. ఓ దశలో ముద్రగడ కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లో ముద్రగడ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అవుతారని, జనసేనలోకి ముద్రగడ రాకను పవన్ అధికారికంగా ప్రకటిస్తారని కథనాలు వచ్చాయి కానీ ఆ దిశగా అడుగులు మాత్రం ముందుకు పడలేదు. దీంతో ముద్రగడ పద్మనాభం అసంతృప్తికి గురై పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ లేఖ కూడా రాశారు.
అదును చూసి అడుగులేసిన వైసీపీ
పవన్ విషయంలో ముద్రగడ అసంతృప్తి చెందడంతో దానిని అదునుగా తీసుకున్న వైసీపీ నేతలు ఆయనతో సంప్రదింపులు ప్రారంభించారు. ఎలాగైనా ఆయనను వైసీపీలోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి.. ముద్రగడతో ఆయన ఇంటికి వెళ్లి చర్చలు చేశారు. ఆ చర్చలు ఫలించడంతో ముద్రగడ.. వైసీపీలో చేరనున్నట్లు మిథున్ రెడ్డి ప్రకటించారు. కానీ రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి ముద్రగడ పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ మాత్రం రాలేదు. అయితే గతంలో వైసీపీలో చేరనని చెప్పిన ముద్రగడ మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ కండువాను కప్పుకోనుండటం ఆంధ్రలో ఆసక్తికర పరిణామాలకు దారి తీసింది.
ముద్రగడకు జగన్ స్పెషల్ ఆఫర్స్!
వైసీపీలో చేరనున్నట్లు ముద్రగడ ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ గెలిస్తే రాష్ట్ర కేబినెట్‌లో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పిస్తానని సీఎం జగన్ భరోసా కల్పించారా? ముద్రగడకు రెండున్నరేళ్ల సీఎం పదవి ఇవ్వడానికి జగన్ ఓకే చెప్పారా? లేదంటే కాపు నేతను సీఎం చేస్తానని హామీ ఇచ్చారా? ముద్రగడకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవులను ఆఫర్ చేశారా? ముద్రగడకు నామినేటెడ్ పదవి, ఆయన కుమారుడు గిరికి పిఠాపురం టికెట్ ఇవ్వడానికి వైసీపీ సిద్దమైందా? అని టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
వెల్లువెత్తుతున్న విమర్శలు
వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించింది మొదలు ముద్రగడ, ఆయన తనయుడు గిరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముద్రగడే టార్గెట్‌గా టీడీపీ, జనసేన కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. కాపు ద్రోహులు మీరంటే మీరంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. దీంతో ఆంధ్రలో రాజకీయాలు మొత్తం కాపుల చుట్టూనే తిరుగుతోంది. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముద్రగడ తన కులాన్ని వాడుకుంటున్నారని, తన స్వలాభం కోసం తనను నమ్మి వెంట నడుస్తున్న కాపులను వెర్రోళ్లను చేస్తున్నారని ఆయా పార్టీల కార్యకర్తలు మండిపడుతున్నారు. జగన్ మంచి మంచి ఆఫర్లు చేయడంతోనే వైసీపీ గూటికి చేరడానికి ముద్రగడ అంగీకరించారని, అందుకే ఇన్నాళ్లూ ససేమిరా అని ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడానికి ముద్రగడ ఓకే చెప్పారని విమర్శిస్తున్నారు.