కేశినేని నానీ రాజకీయ భవిష్యత్?
విజయవాడ ఎంపీ కేశినేని నానీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఏపార్టీ నుంచి పోటీ చేస్తారోనని అభిమాను ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.;
Byline : The Federal
Update: 2024-01-08 11:22 GMT
పదేళ్లు ఎంపీగా పనిచేశారు. అధికారంలో ఐదేళ్లు, ప్రతిపక్షంలో ఐదేళ్లు పనిచేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు విజయవాడ ఆటోనగర్‌లో తన జీవితాన్ని ప్రారంభించిన కేశినేని నాని అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం ఉన్నట్లుండి అగాధంలో పడింది. దీనికి కార కులు ఎవరు? ఎందుకు ఇలా జరిగింది. నమ్ముకున్న పార్టీ పొమ్మంటున్నది. ఇప్పుడేం చేయాలి. ఇదీ కేశినేని నానీని తొలిచి వేస్తున్న ప్రశ్న.
ఈనెల ఐదవ తేదీ సాయంత్రం తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ మంత్రి ఆలపాటి రాజా, మచిలీపట్నం మాజీ ఎంపి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణలు కలిసి వచ్చి 7వ తేదీన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే ‘రా కదిలిరా’ టీడీపీ సభకు సంబంధించిన వ్యవహారాలు చూడవద్దని, చంద్రబాబునాయుడు గారు వేరే వారిని ఇన్‌చార్జ్‌గా పెట్టారని చెప్పారు. దీంతో ఒక్కసారిగా నానిలో అలజడి మొదలైంది. తన పార్లమెంట్ నియోజకవర్గంలో మరొకరిని ఇన్‌చార్జ్‌గా పెట్టడం ఏమిటని తనలో తాను ప్రశ్నించుకుని అధినేత చెప్పింది రామభక్త హనుమంతునిలా పాటిస్తానని వారికి చెప్పి పంపించారు. నానీకి తమ్ముడైన చిన్నీని అక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయననే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించొచ్చని వార్తలొస్తున్నాయి.
త్వరలో కేశినేని నానీ ఎంపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు నిర్ణయించారు. తనకు కనీస గౌరవం లేని చోట ఉండేకంటే దూరంగా ఉండటం మంచిదనే అభిప్రాయంలో నాని ఉన్నారు.
సుమారు ఏడాదిన్నర కాలంగా నానీని టీడీపీ వారు పక్కనబెట్టినట్లు సమాచారం. ముఖ్యమైన కార్యక్రమాలకు అధికారికంగా పిలుపు రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నందిగామలో ఏర్పాటు చేసిన సభకు కూడా నానీని పిలవలేదు. ఎంపీ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు పార్టీ ఎంపీని పిలవకుండా కార్యక్రమం నిర్వహించడంతోనే నానీకి అర్థమైంది. పార్టీలో తనకు స్థానం లేదని భావించారు. అయితే బయట పడకుండా, ఎవరితోనూ పార్టీతో ఉన్న స్పర్థలు చెప్పకుండా నెట్టుకొస్తున్నారు. తిరువూరు సభతో బహిరంగానే బయటకు చెప్పాల్సి వచ్చింది.
సరైన సమయంలో సరైన నిర్ణయం
కేశినేని నానీ మీడియాతో మాట్లాడుతూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అంటే తప్పకుండా ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోటీ చేయడం జరుగుతుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? ఏదో ఒక పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటారా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నేను పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడతానని నానీ అంటున్నాడు. పైగా మరోమాట కూడా చెప్పారు. నా అనుచరులు, సహచరులకు నా రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీ ఉంది. లేనిదల్లా మీడియా వారికేనన్నారు.
ఉద్యోగం వదిలి రాజకీయీల్లోకి..
కేశినేని నానీ కుమార్తె కేశినేని స్వేత టాటా ట్రస్ట్‌లో ఉన్నతోద్యోగిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు టాటా ట్రస్ట్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమెను తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 11 డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఎక్కువ మంది గెలవడంతో ఈమెకు మేయర్ పదవి దక్కకుండా పోయింది.
కార్పొరేటర్‌గా స్వేత రాజీనామా..
కార్పొరేటర్ పదవికి కేశినేని స్వేత రాజీనామా చేశారు. తండ్రికి గౌరవం దక్కని పార్టీలో నేను ఉండలేనని స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా ఎంపీ కేశినేని నానీ అవమానాలకు గురవుతున్నారని, సొంతపార్టీ వారే అవమానిస్తుంటే చూడలేకపోయానని మీడియాతో చెప్పారు. అందుకే తాను సోమవారం తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంది ఉద్యోగాన్ని వదిలి పెట్టాననే బాధకంటే అధినేత మమ్మల్ని ఎందుకు అవమానించారు. ఎందుకు దూరం పెట్టారనే బాధే ఎక్కువగా ఉందన్నారు.
తమను నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేసిన 65 మంది టీడీపీ వారు ముగ్గురి స్వార్థం వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని స్వేత ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేర్లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారి వల్ల నష్టపోయిన కుటుంబాలు రాజకీయంగా మాతోనే అడుగులు వేస్తున్నారని, వారికి మేము ఎప్పుడూ అండగానే ఉంటామన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం?
ఎంపీ కేశినేని నానీ వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ పరిధిలో తనపై ప్రజలకు ఉన్న నమ్మకం తప్పకుండా గెలిపిస్తుందని ఆయన భావిస్తున్నారు. వేరే పార్టీలో చేరుతున్నారా? అన్న ప్రశ్నకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెబుతున్నారు. ఫిబ్రవరిలో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది.