ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం మంత్రి వర్గ సమావేశం జరిగింది.;

Update: 2025-04-03 13:26 GMT

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు మంత్రులు అందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చించిన కేబినెట్‌ కీలక అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌ అందులో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌(ఏపీడీసీ)ను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) నుంచి వేరు చేసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్‌ సంబంధిత అంశాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషనే నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఆ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు స్టార్‌ హోటళ్లల్లో బార్‌ లైసెన్స్‌ల ఫీజులు వంటి పలు కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకున్నారు.

అనకాపల్లి జిల్లాలోని డీఎల్‌పురం వద్ద కేపిటివ్‌ పోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ఆమోద ముద్ర వేసింది. హోటళ్ల మీద చర్చించిన మంత్రి వర్గం స్టార్‌ హోటళ్ల ఫీజుల మీద ఓ నిర్ణయానికి వచ్చింది. త్రీ స్టార్‌ హోటళ్లు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు బార్‌ లైసెన్స్‌ల ఫీజులను కుదింపునకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ స్టార్‌ హోటళ్లల్లో బార్‌ లైసెన్స్‌ల ఫీజులను రూ. 25లక్షలకు కుదించాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. యువజన, పర్యాటక శాఖ ప్రభుత్వ ఉత్తర్వుల ర్యాటిఫికేషన్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలనే ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ మీడియా అక్రిడిటేషన్‌ నిబందనలు–2025కి ఆమోదం తెలిపింది. నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ రీటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్‌ ద్వారా పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయాలనే ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
Tags:    

Similar News