కొడాలి నానికి ఏపీ హై కోర్టులో ఊరట
వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేష్‌ల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని కొడాలి నాని మీద కేసు నమోదు చేశారు.;
By : The Federal
Update: 2025-03-12 09:25 GMT
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు కొడాలి నానిపై నమోదైన కేసుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. కొడాలి నాని మీద నమోదైన కేసుల మీద 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో మాజీ మంత్రి కోడాలి నానికి కాస్త ఊరట లభించినటై్టంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేష్‌ల మీద కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో అసభ్యకరంగా దుర్బాషలాడారని, కొడాలి నాని మీద 2024 నవంబరులో విశాఖపట్నంలో కేసులు నమోదు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ కొడాలి నాని మీద ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్‌ల మీద కొడాలి నాని సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలు, దుర్బాషలు చాలా దారుణంగా ఉన్నాయని, ఓ మహిళగా కొడాలి నాని తిట్లు భరించలేక పోయానని అంటూ విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విశాఖ పోలీసులు కొడాలి నాని మీద కేసులు నమోదు చేశారు.
విశాఖపట్నంలో తన మీద నమోదైన ఈ కేసులను క్వాష్ చేయాలని కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు పిటీషన్‌ను దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హై కోర్టు 35(3)కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.