కొడాలి నానీకి తీవ్ర అనారోగ్యం, ఆస్పత్రికి తరలింపు
కొడాలి నాని (Kodali Nani) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన హైదరాబాద గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు;
By : The Federal
Update: 2025-03-26 05:03 GMT
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు (YSRCP) కొడాలి నాని (Kodali Nani) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన హైదరాబాద గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుగా డాక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఈ వ్యవహారమై ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని కొడాలి నానీ అనుచరుడొకరు చెప్పారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఈ సీనియర్ నాయకుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేసేవారు.
కొడాలి నాని కొంత కాలంగా రాజకీయ కార్యకలాపాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు రావడం వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది.
నానీ ఆరోగ్యంపై గతంలోనూ అనేక పుకార్లు వచ్చాయి. అమెరికాలో చికిత్స పొందుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కొడాలి నానీ ఖండిస్తూ వచ్చారు. ఆయన ప్రధాన అనుచరుడు, సహ నిర్మాత అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ఉన్న తరుణంలో ఈయన ఆస్పత్రిలో చేరారు.