అమలాపురం బరిలో కోడి కత్తి శీను..
పేదవాడి కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు కోడి కత్తి శీను అంటున్నారు. అమలాపురం స్థానం నుంచి పోటీ చేస్తానన్నారు.
By : The Federal
Update: 2024-03-12 10:42 GMT
ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి
విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు (కోడి కత్తి శ్రీను) రాజకీయాల్లోకి వస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ నుంచి అమలాపురం శాసనసభ స్థానంలో పోటీ చేయనున్నారు. విజయవాడ గాంధీనగర్లోని కార్యాలయంలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోడి కత్తి శీనుకు పార్టీ కండువా వేసి, స్వాగతించారు. పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా వారం కిందట జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. పులివెందుల నియోజకవర్గం నుంచి సీఏం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై దస్తగిరి పోటీ చేయనున్నట్లు జడ శ్రవణ్ కుమార్ గతంలోనే వెల్లడించారు.
పేదల కోసమే..
"నేను పేదవాడి కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా " అని జనపల్లి శ్రీనివాసరావు (కోడి కత్తి శీను) తెలిపారు. జడ శ్రవణ్ కుమార్ తో కలిసి మాట్లాడిన కోడి కత్తి శీను రాజకీయాల్లోకి వస్తున్నది "ఏ ఒక్క కులం, మతం కోసమో కాదన్నారు. చట్టసభల్లో అడుగు పెట్టాలని, పేదల సమస్యల కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇందుకోసం అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని వెల్లడించారు. సమాజంలో సామాన్యులకు న్యాయం జరిగే వరకు తాను పోరాటం సాగిస్తానని ప్రకటించారు.
సామాన్యులకు అవకాశం..
"మా పార్టీ సామాన్యులకు అవకాశం కల్పిస్తుంది" అని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. కుట్ర, కుతంత్రాలు చేసే రాజకీయాలు మారాలన్నారు. "సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడ్డ యువకుడు జనపల్లి శ్రీనివాసరావు.. దళిత, రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నారని" ఇక్కడ శ్రవణ్ కుమార్ అన్నారు. కడప జిల్లా పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై భీమ్ పార్టీ నుంచి దస్తగిరి పోటీ చేస్తున్నారని ప్రకటించారు. డబ్బు, అధికార మదంతో వైఎస్సార్సీపీ నేతలు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే కాదు. దేశంలో సంచలనం రేకెత్తించిన రెండు కేసుల్లోని నిందితులు ఒకే రాజకీయ పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న వారిద్దరిని ప్రజలు ఎంత మేరకు ఆదరిస్తారనేది వేచి చూద్దాం.