మా ఆదాయం తప్ప మా అభివృద్ధి పట్టదా సీఎం గారు!
ప్రభుత్వానికి ప్రొఫెసర్ కేఎస్ చలం ఎందుకు లేఖ రాశారు...? ఆ లేఖలో ఏముంది...?
(తంగేటి నానాజీ,)
విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాలకులు పదేళ్లలో ఏం చేశారని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక, రక్షణ వేదిక ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం.. ప్రభుత్వానికి లేఖ రాశారు. 'పదేళ్లయినా పట్టించుకోరా.. విభజన చట్టాన్ని అమలు చేయరా' అంటూ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సందించారు. అంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన వెనుకబడిన జిల్లాల ప్యాకేజీని పునరుద్ధరించి అభివృద్ధిలో స్థానికులనూ భాగస్వామ్యులను చేయాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉత్తరాంధ్ర…
దశాబ్దాలు గడిచినా.. పాలకులు మారినా ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. విశాఖ నగరాన్ని అభివృద్ధి పరుస్తున్న పాలకులు ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల ఊసే ఎత్తడం లేదు. ఇదే విషయంపై ప్రొఫెసర్ కేఎస్ చలం.. ప్రభుత్వాన్ని నిలదీశారు. '2014 చట్టం ద్వార నేటి ఆంధ్ర ప్రదేశ్ విడిపడి పేదేళ్ళు కావస్తోంది. చట్టంలోని 46(3) ప్రకారం ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీని పునరుద్ధరించాలి' అంటూ ప్రొఫెసర్ డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్ర అంటే బడుగు బలహీన వర్గాలే..
‘‘ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరిజన, తీర, మైదాన ప్రాంతాలు ఉన్నాయి. విశాఖ నగరం ఈ ప్రాంత చారిత్రక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌కు మూడింట ఒక వంతు రాష్ట్ర ఆదాయాన్ని సమకూరుస్తున్నదీ విశాఖ నగరమే... కానీ ఇక్కడ వున్న దళిత, ఆదివాసీ, వెనుకబడిన జనాభా 90 శాతం ఉన్నారు. వారి జీవితాల్లో మార్పు లేదు. ఈ ప్రాంత దోపిడీ పెరగడంతో మిగతా ప్రాంతాలకు వలసలు పోతున్నారు. అందుకే ఈ క్రింది అంశాలను ప్రభుత్వం, రాజకీయ పార్టీల దృష్టికి తెస్తున్నాం’’ అన్నారు ప్రొఫెసర్ కేఎస్ చలం.
ప్రొఫెసర్ చలం లేఖలో ముఖ్యాంశాలివే...
ప్రొఫెసర్ చలం 12 ప్రధానాంశాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ రాజకీయ పార్టీలకు లేఖాస్త్రాన్ని సంధించారు. అవి..
1. అభివృద్ధి అంతా విశాఖ నగరానికి పరిమితం చేయటానికి ప్రధానంగా ఇక్కడి భూములు 1948 జమిందారి రద్దు తర్వాత ప్రభుత్వ భుములవటంతో స్థానికేతరులు ఈ వనరులు కొల్లగొట్టి, స్థానిక ప్రజలను, వారి సంస్కృతిని పక్కకు నెట్టేశారు.
2.విశాఖపట్నం అభివృద్ధికి వెచ్చించే కోట్ల రూపాయలు స్థానికులకు లబ్ధి చేకూర్చే కుంటే ఎందుకూ ఉపయోగం లేకుండా పోతున్నాయి. విశాఖ వనరులు చూసి ఎవరైనా పెట్టుబడి పెడతారు.
3. విశాఖ మొత్తం వ్యాపారమయం అయింది. గత ఏడాది 1 కోటి 72 లక్షల మంది టూరిస్టులు విశాఖలో పర్యటించారు. వారి కోసమే సౌకర్యాలు. స్థానిక ప్రజలకు సేవలందించాల్సిన కార్పొరేషన్ వనరులు వేరేగా మల్లుతున్నాయి. GVMRDA ప్రణాళిక పౌరుల అవసరాలకు కాకుండా రియల్ ఎస్టేట్‌కు ఉపయోగ పడేలా ఉంది. దీన్ని ఆపండి.
4. విశాఖ ఉక్కు తెలుగు జాతి హక్కు, ఉత్తరాంధ్ర జీవనాధారం. అది మా సెంటిమెంట్. దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి.
5. గోదావరి నది నీటిలో ఉత్తరాంధ్రకు హక్కు ఉంది. ఆ నీటిని సాగు కోసం ఉత్తరాంధ్రకు మళ్లించాలి.
6. రైల్వే జోన్ వచ్చేంత వరకు ఇక్కడ ఉన్న డివిజన్‌ను అప్‌గ్రేడ్ చేసి రిక్రూట్మెంట్‌కు అవకాశం కల్పిస్తే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి .రాజ్యాంగంలోని 371D ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి.
7. ఉత్తరాంధ్ర బంగాళ ఖాతంలో మత్స సంపద మాయమయింది. మత్సకారుల వలసలు పెరిగాయి. మెకనైజేషన్‌ను ఆపాలి.
8. విశాఖపట్నంలో పెరిగిన లక్షలాది కోట్ల సంపదతో స్థానికులు ఎంత మంది కోటీశ్వరులు అయ్యారో ప్రభుత్వం చెప్పాలి. ఇక ఎంత మాత్రం స్థానికేతరులను ఇక్కడి ప్రాజెక్టుల్లో పెట్టొద్దు ఆపండి. స్థానికులకు అవకాశాలు ఇవ్వాలి.
9. ఆర్‌కే బీచ్ మొత్తం షాపింగ్-మాల్‌లా తయారు చేశారు. దాని అందాన్ని అమ్ముకుంటున్నారు. స్థానికులకు, మత్స్యకారులకు రిజర్వేషన్ లేదు. అక్కడ పెట్టే విగ్రహాలకు స్థానిక నాయకులకు సంబంధం లేదు. అవి మమ్మల్ని వెక్కిరిసున్నట్లు ఉన్నాయి.
10. విశాఖ నగరం చుట్టూ ఉన్న ప్రకృతి తూర్పు తీరంలోనే గొప్పది. ఇక్కడ ఉండే కొండలు, ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ చారిత్రక ప్రదేశాలు చారిత్రాత్మకమయినవి. వాటిని కాపాడాలి. CRZ నిబంధనలు పాటించాలి.
11. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వలసలు ఆపాలి. అందుకు 1/70 చట్టాన్ని ఉత్తరాంధ్రలో అమలు చేయాలి.
12. అన్ని రాజకీయ పార్టీలకు మా విన్నపం. మీ మీ పార్టీలలో స్థానికులకు అవకాశం ఇవ్వండి. డబ్బు సంచులతో దిగుమతి అయ్యే వారిని ఆపండి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోడీ ప్రత్యేక ప్రకటన చేయాలి.
పార్టీల్లో ప్రకంపనలు....
ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక, ఉత్తరాంధ్ర రక్షణ వేదికలు సంయుక్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు స్థానికత అంశాన్ని లేవనెత్తడంతో పార్టీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఇంచుమించు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో మెజారిటీ అభ్యర్థులు స్థానికేతరులే కావడంతో... ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో బలంగా పని చేస్తే వారి పరిస్థితి ఏంటని ఆయా పార్టీలు మదన పడుతున్నాయి.