హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో నెరవేరనున్న కర్నూలు కల

మిషన్ రాయలసీమలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రాయలసీమ వాసుల సుదీర్ఘ కల నెరవేరనుంది.;

Update: 2025-02-03 01:30 GMT
కర్నూలు నిజంగానే జ్యుడిషియల్ సెంటర్ కాబోతోంది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఫిబ్రవరి 6న హైకోర్టు జడ్జీల బృందం కర్నూలుకు రానుంది. అంత సవ్యంగా సాగితే ఈ ఏడాది ఆఖరు నాటికే హైకోర్టు బెంచ్ కర్నూలులో పని చేయడం ప్రారంభం అవుతుందని అంచనా.
రాయలసీమకు ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒకటి కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులుపడుతున్నాయి.
వాస్తవానికి 1953లో కర్నూలును రాజధానిగా చేసినప్పుడే ఈ డిమాండ్ వచ్చింది. అయితే పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా అది గుంటూరుకు తరలిపోయింది. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో విలీనం అయినపుడు 1956లో హైదరాబాద్‌కు మారింది. 2019లో అమరావతిలో కొత్త హైకోర్టు ఏర్పడింది. కానీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడా స్థానంలో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు కానుంది.

బెంచ్ ఏర్పాటుకు 2024 నవంబర్ 21 అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనికి ముందు 2024 అక్టోబరు 28న కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలిపేందుకు కాంపిటెంట్‌ అథారిటీ (హైకోర్టు న్యాయమూర్తులు-ఫుల్‌ కోర్ట్‌) ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ), హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)కు లేఖ రాశారు. హైకోర్టు సీనియర్‌ జడ్జీలతో ఓ కమిటీని చీఫ్ జస్టిస్ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీలు ఉన్నారు.
ఈనేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) శ్రీనివాస శివరాం 2025 జనవరి 29న కర్నూలు జిల్లా కలెక్టర్‌కు రంజిత్ బాషాకు ఓ లేఖ రాశారు. అందులో కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు కావాలని కోరారు. అంతేకాకుండా 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి, న్యాయవాదులకు వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని 2025 జనవరి 30లోపు పంపాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు రిజిస్ట్రార్ రాసిన ఈ లేఖపై కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌ బాషా వెంటనే స్పందించారు. ఆ లేఖలో ప్రస్తావించిన విధంగా వసతుల కోసం.. రోడ్లు, భవనాలశాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, ఆర్డీవోలకు మరో లేఖ రాశారు. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన లేఖలో ఉన్న విధంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ/ప్రైవేట్ భవనాలను పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ ప్రక్రియ ఆఘమేఘాలపై పూర్తి అయింది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా చేయడంతో.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెర పైకి వచ్చింది. అప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం, వైసీపీ గెలవడం జరిగింది.
వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చింది. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఐదేళ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకుపడలేదు. 2025 ఎన్నికలో జగన్ పార్టీ ఓడింది. ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. భవనాలను గుర్తించిన తర్వాత బెంచ్ ఏర్పాటుపై ఏర్పాట్లు మొదలయ్యే అవకాశం ఉంది.
కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిని కర్నూలు జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. 15 హైకోర్టు న్యాయమూర్తులకు మౌలిక సదుపాయాల లభ్యత, కోర్టు కాంప్లెక్స్ గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి గురించిన ప్రాధమిక సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)కు పంపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న తగిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులను గుర్తించినట్టు సమాచారం.
దిన్నె దేవరపాడు స్థలాన్నే ఖరారు చేస్తారా?
హైకోర్టు బెంచ్ కి అనువైన స్థలాన్ని చూసేందుకు ఫిబ్రవరి 6న 15మంది న్యాయమూర్తుల బృందం కర్నూలు రానుంది. దిన్నె దేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనుంది. బెంచ్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు.
హైకోర్టు బెంచ్ తో పాటు ట్రిబ్యునల్స్ కూడా.
.
రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినా ఇప్పటికే కర్నూలులో ఉన్న లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, మరి కొన్ని ట్రిబ్యునళ్లను ప్రభుత్వం మార్చబోదు.
మిషన్ రాయలసీమలో భాగంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుంది. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మూడు రాజధానుల భావనకు దీనికి సంబంధం లేదని, జగన్ కేవలం రాజకీయ వాక్చాతుర్యం ప్రదర్శించారే తప్ప దానికి స్పష్టమైన రూపాన్ని ఇవ్వలేకపోయారని చంద్రబాబు చెప్పారు. దానికి బదులుగా తాము ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పుడు దానికి ఓ రూపం ఇస్తున్నారు. తక్కువ సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, దీని ఏర్పాటుకు ముందు జరిగిన పరిణామాలను, విభజనను, మరియు దాని అభివృద్ధిని పరిశీలించాలి.
ఇదీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్ర..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1862లో బ్రిటిష్ వారు మద్రాస్ హైకోర్టును స్థాపించారు. దక్షిణ భారతదేశంలో ఇది ప్రముఖ హైకోర్టుగా వ్యవహరించింది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర ప్రాంతం కూడా ఉండడంతో, ఆ ప్రాంతానికి సంబంధించిన న్యాయ వ్యవహారాలు కూడా మద్రాస్ హైకోర్టు పరిధిలోనే ఉండేవి. 1953లో ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత, కర్నూలులో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా అది గుంటూరులో ఏర్పాటు అయింది.
1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని నిజాం హైకోర్టును (హైదరాబాద్ హైకోర్టు), ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చారు.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో, హైదరాబాద్ హైకోర్టే రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఉమ్మడిగా పనిచేసింది.
2018లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 1న అమరావతిలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది తాత్కాలిక భవనంలో కొనసాగుతుంది. భవిష్యత్తులో శాశ్వత హైకోర్టు అమరావతిలో నిర్మాణం చేపట్టే యోచన ఉంది. ప్రస్తుతానికి అమరావతిలోని జస్టిస్ సిటీ, నూతన హైకోర్టు భవనం నిర్మాణం కొనసాగుతోంది.
హైకోర్టుకు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు, న్యాయ సంబంధిత అధికారులతో కూడిన విస్తృత న్యాయ వ్యవస్థ ఉంది.
హైకోర్టు చరిత్రలో మేలిమలుపులు...
1862 - మద్రాస్ హైకోర్టు పరిధిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం
1956 - హైదరాబాద్ హైకోర్టును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చడం
2014 - రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ హైకోర్టు ఉమ్మడిగా కొనసాగడం
2019 - అమరావతిలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు
2025- కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు దిశగా చర్యలు
Tags:    

Similar News