‘ఆ ఘనత సీఎం జగన్‌దే’.. లక్ష్మీపార్వతి

ఎన్నికల ముంగిట మరోసారి టీడీపీపై ఆరోపణలు గుప్పించారు లక్ష్మీపార్వతి. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక అమ్ముకుని లోకేష్.. మామూళ్లు తీసుకోలేదా అని ప్రశ్నించారు.

Update: 2024-05-08 14:23 GMT

‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో కూడా పేదలు ఆకలితో ఉండకూడని ఆ క్లిష్ట సమయాల్లో కూడా సంక్షేమ పథకాలను అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డే’’ అని లక్ష్మీ పార్వతి మరోసారి సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ పాలనను చూసి ప్రధాని మోదీ కూడా పొగడకుండా ఉండలేకపోయారని, ఆయన తన సొంత బీజేపీ పార్టీ సీఎంల పాలనను కూడా కొనియాడలేదని అన్నారు ఆమె. జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి రంగం అభివృద్ధిలో దూసుకుపోయాయని, రాష్ట్రానికి కొత్త హంగు వచ్చిందని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్.. అందరూ మెచ్చిన సీఎం

‘‘వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రమంతా అభివృద్ధి పథంలో నడిచింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిన ప్రాంతంలా మారింది. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. జగన్ హయాంలో ఆకలి కడుపుతో పడుకున్న పేదవాడు చాలా అరుదుగా కనిపించారు. ప్రతి పేదవాడి సంక్షేమం అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్’’ ప్రశంసలు గుప్పించారు.

లోకేష్ మామూళ్లు తీసుకోలేదా!

‘‘గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్.. ఇసుక అమ్ముకొని మామూళ్లు తీసుకోలేదా. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్పిన చంద్రబాబు దానిపైనే తొలి సంతకం కూడా చేశారు. కానీ బెల్ట్ షాపులను ఎత్తేసేరా.. పైగా పీకలదాకా తాపించి ప్రజలను నిలువునా దోచుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్.. ఇసుక విధానంలో పారదర్శకత తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అనేక రంగాల్లో గుట్టుగా సాగుతున్న అవినీతిని కూకటివేళ్లతో పెకలించారు. రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించారు’’అని జగన్‌ను లక్ష్మీపార్వతి కొనియాడారు.

టీడీపీకి ముప్పుగా లక్ష్మీపార్వతి!

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న లక్ష్మీపార్వతి.. ఎన్నికలకు వారం రోజులు కూడా సమయం లేని తరుణంలో కెమెరా ముందుకు వచ్చి టీడీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతగా ఉన్న లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు, టీడీపీపైకి సీఎం జగన్ విసిరిన బాణమే అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈసారి టీడీపీ కూటమి విజయం తథ్యమని తెలియడంతో దిక్కుతోచని స్థితిలో జగన్.. లక్ష్మీ పార్వతి సహాయం కోరారని, లేకుంటే ఎన్నికల ప్రచారాలు ప్రారంభం నుంచి ఆమె ఎందుకు కెమెరాకు దూరంగా ఉన్నారని ప్రశ్నించే వారూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయా అంటే విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలను విని, నమ్మే పరిస్థితుల్లో ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారని, ఇప్పుడు లక్ష్మీపార్వతే కాదు జగన్, చంద్రబాబు చేసే వ్యాఖ్యలను కూడా ప్రజలు పూర్తిగా నమ్మడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల ఫలితాలపై ఆమె వ్యాఖ్యల ప్రభావం దాదాపుగా ఉండదని.. ఉంటే..గింటే ఒక్క శాతం ఉండొచ్చని వారు చెప్తున్నారు. కాకపోతే చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మాత్రం లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు అస్త్రాలు ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి.. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు ఏమాత్రం ప్రభావం చూపుతాయో.

Tags:    

Similar News