AP FINANCE|అప్పుల గురించి తప్ప... అభివృద్ధి పట్టని నేతలు
సీఎం చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు అప్పుల గురించి తప్ప అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు. రాజకీయ విమర్శలు శృతి మించుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కక్షపూరితంగా మారాయి. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వ ఉద్యమంగా మారింది. ఈ అరెస్ట్ లను ఆపాలని కోరుతూ ఒక వ్యక్తి కోర్టుకు వెళితే తప్పుడు పోస్టులు పెట్టే వారిని అరెస్ట్ చేస్తే తప్పేమిటని కోర్టు చెప్పింది. దీంతో ప్రభుత్వానికి అరెస్ట్ లు చేయడం మరింత సులువైంది. ప్రతి రోజూ రాజకీయంగా విమర్శలు జోరందుకుంటున్నాయి. మాజీ సీఎం అసెంబ్లీకి వెళ్లకుండా తనను అరెస్ట్ చేసుకోవాలని, సోషల్ మీడియా పేరుతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు.
బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల పాలు చేశాడన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అప్పు కేవలం రూ. 1.30 లక్షల కోట్లు మాత్రమే ఉందని, చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన తరువాత అది కాస్త 2019 నాటికి రూ. 3.13 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. విద్యుత్ డిస్కమ్ లకు చెల్లించాల్సిన బాకీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉద్యోగులకు రెండు డీఏలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, మధ్యాహ్న భోజన పథకం బకాయిలు, క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు కలిపి మొత్తం రూ. 42,183కోట్లు బకాయి పెట్టి చంద్రబాబు నిష్క్రమించారని, ఆ బకాయిలు చెల్లించడంతో పాటు పాలనను సజావుగా సాగించామన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా మరువలేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, కనీసం బడ్జెట్లో కూడా చూపించలేదన్నారు.
చంద్రబాబు కాగ్ రిపోర్టును ప్రస్తావిస్తూ విచ్చల విడిగా అప్పులు తెచ్చింది జగన్ ప్రభుత్వమేనన్నారు. 2020లో రూ. 51,687 కోట్లు, 2021లో రూ. 57,435, 2022లో రూ. 53,284 కోట్లు, 2023లో రూ. 67,985 కోట్లు, 2024లో తెచ్చిన అప్పు రూ. 75,617 కోట్లు కాగా మొత్తం ఐదేళ్లలో రూ. 3,09,986 కోట్లు అప్పులు తెచ్చారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలోనే అప్పులు బాగా పెరిగాయని చంద్రబాబు అన్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతోనే సరిపోతోంది.
గడచిన పదేళ్లలో రాష్ట్రం కనీస అభివృద్ధి జరగలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఇరువూరు ఉచిత పథకాల వైపు వెళ్ళడం వల్ల విచ్చల విడిగా ఖర్చవుతోందని, తగిన ఆదాయం సమకూర్చుకోవడంలో పాలకులు ఫెయిల్ అయ్యారంటున్నారు మేధావులు. ఎవరు అధికారం చేపట్టినా అప్పులు చేయలేనిది పాలన సాగించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. గ్రామాల్లో మంచినీరు లేదు. రోడ్లు సరిగా లేవు. డ్రైనేజీ కాలువలు లేవు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు సబ్సిడీ పథకాలు లేవనేది సత్యం. ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకురాలేక పోయారు. మద్యం, మైన్స్ దోచుకున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే సరిపోయింది. అధికార పక్షానికి కానీ, ప్రతి పక్షానికి కానీ బాధ్యత లేకుండా పోయిందనడంలో సందేహం లేదు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారని పరిస్థిఃతులు ఎప్పుడు చక్కబడతాయో చూడాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పెట్టుబడి దారులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెడితే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందినట్లుగా భావించాలి.