వైసీపీ టూ టీడీపీ టూ క్యాబినెట్, నాన్ స్టాప్

గత ఎన్నికల ముందు వరకు వైఎస్‌ఆర్‌సీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడు మంత్రి అయ్యారు.

Byline :  The Federal
Update: 2024-06-12 15:25 GMT

నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో కొలువు దీరిన మంత్రుల్లో కొలుసు పార్థసారథి ఒకరు. ఎన్నికలకు ముందు జగన్‌తో నెలకొన్న విభేదాల కారణంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీలో చేరి, టిక్కెట్‌ సంపాదించుకొని, గెలిచి, తాజాగా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు.

కొలుసు పార్థసారథి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభమైంది. తండ్రి పెద్దారెడ్డయ్య యాదవ్‌ గతంలో ఎంపీగా పని చేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారు.
2004లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాటి ఉయ్యూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో పశుసంవర్థక, పాల అభివృద్ధి, మత్స్య, పశువైద్య విశ్వవిద్యాలయ మంత్రిగా పని చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్, ఇంటర్మిడియట్‌ ఎడ్యుకేషన్‌ మంత్రిగా కూడా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో కూడా మంత్రిగా పని చేశారు.
విభజన అనంతరం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2019లో పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జగన్‌ మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఎదురు చూశారు. ఉన్న సీనియర్‌ నేతల్లో ఒకరు కావడం, జగన్‌ తండ్రి వైఎస్‌ఆర్‌ హయాంలోనే మంత్రిగా పని చేసిన అనుభవం కలిగి ఉండటం, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో జగన్‌ మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ రెండు సార్లు చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో కొలుసు పార్థసారథి జగన్‌ మొండి చేయి చూపించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో పార్థసారథి జగన్‌పై భిన్న స్వరం వినిపించడం ప్రారంభించారు. బహిరంగంగానే విమర్శిలు చేశారు. దీంతో పార్థసారథికి జగన్‌ టికెట్‌ నిరాకరించారు. ఆయనకు బదులుగా జోగి రమేష్‌కు పెనమలూరు స్థానం కేటాయించారు. దీంతో పార్థసారథి వైఎస్‌ఆర్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు నూజివీడు టిక్కెట్‌ కేటాయించారు. అక్కడ నుంచి గెలిచి చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.
Tags:    

Similar News