ఏపీ లిక్కర్ స్కాంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.;
By : The Federal
Update: 2025-05-16 15:08 GMT
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో మిగిలిన కీలక నిందితులపై కూడా అరెస్టుల వేట కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేసింది.
వీరిద్దరూ ఇప్పటికే మూడు రోజుల పాటు విచారణకు హాజరైన నేపథ్యంలో, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో వారిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని SIT శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది.
సిట్ బృందం వారిని మే 13వ తేదీ నుంచి విచారిస్తూ వస్తోంది. ధనుంజయరెడ్డి – A31, కృష్ణమోహన్‌రెడ్డి – A32 నిందితులుగా నమోదయ్యారు. వీరిద్దరూ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం బెయిల్ తిరస్కరించింది. ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేసింది. "విచారణ కీలక దశలో ఉంది. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తు స్తంభిస్తుంది. దర్యాప్తును సాగనివ్వాలి" అని ధర్మాసనం పేర్కొంది.
గతంలో ఏపీ హైకోర్టు కూడా వీరి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. దీనిపై వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే భారతి సిమెంట్స్ ఫుల్ టైం డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ (A33) మంగళవారం అరెస్టు అయ్యారు. మద్యం సరఫరా కంపెనీల యజమానులతో తాడేపల్లి, హైదరాబాద్‌లో జరిగిన అనేక రహస్య సమావేశాలకు ఈ ముగ్గురు కీలకంగా పాలుపంచుకున్నట్టు ఆధారాలు లభించాయి.
డిస్టిలరీల నుంచి కమీషన్ల రూపంలో వసూలైన మొత్తాన్ని డొల్ల కంపెనీలకు మళ్లించడం, ఆ ఆర్థిక లావాదేవీల సమన్వయానికి ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించినట్టు సెట్ ఆరోపించింది. ఈ కేసులో అరెస్టైన ముగ్గురూ — ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్ప — మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో తీసుకున్న కీలక ఆర్థిక నిర్ణయాలు, ముఖ్యంగా మద్యం పంపిణీ, సరఫరా విధానాలపై ఈ అరెస్టులు సీరియస్ ఆరోపణలకు ఆమోద ముద్ర వేసినట్టుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
సిట్ ఇక వారి బ్యాంకింగ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, రౌండ్ల వ్యవహారాలు ఆధారంగా తదుపరి విచారణ చేపట్టనుంది. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నా, కేసు నిడివి రాజకీయ పునరుజ్జీవనానికి దారితీయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.