‘తల్లికి వందనం’పై క్లారిటీ.. ఈ ఏడాదికి లేనట్లే..

తల్లికి వందనం పథకంపై అసెంబ్లీలో చర్చ. తప్పకుండా అమలవుతుందన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటన.

Update: 2024-07-24 12:08 GMT

‘తల్లికి వందనం’ పథకం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లూ ఈ పథకం పిల్లలకు అందిస్తారా? లేకుంటే తల్లులకు అందిస్తారా? తల్లులకు అందించే పనైనా ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పునా ఇస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదే విధంగా ఎంత మంది ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకాన్ని అందిస్తామని ప్రచారం చేసుకున్న టీడీపీ.. తీరా అధికారం వచ్చాక ఇంట్లో ఒక్కరికీ తల్లికి వందనం అందిస్తామంటూ ప్రజలకు మోసం చేస్తోందని వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు ఈ పథకాన్ని అమలు చేసే ఉద్దేమైనా ఉందా? అని కూడా ప్రశ్నించారు. అమలు చేసే పనైతే ఎప్పుడు అమలు చేస్తామో చెప్పాలని, ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారంటూ వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. అయితే అప్పట్లోనే తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కాగా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇందులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకం అమలుపై స్పష్టతనిచ్చారు.

అందరికీ అందిస్తాం: లోకేష్

ఏపీ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో తల్లికి వందనంపై చర్చలో భాగంగా నారా లోకేష్ మాట్లాడారు.. ‘‘ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు చేరట్లేదు అనే అంశంపై సమీక్షించాలి. అదే విధంగా తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఈ పథకం అందరికీ పథకం అందిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులు అందరికీ ఈ పథకం వర్తించేలా చేస్తాం. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు క్షీణించాయి. ప్రభుత్వ బడుల్లో 72 వేల మంది విద్యార్థులు తగ్గారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తాం’’ అని చెప్పారు లోకేష్.

వాటిని నమ్మొద్దు: లోకేష్

తల్లికి వందనం పథకంపై అనేక వదంతులు వస్తున్నాయని వాటిని వేటినీ నమ్మొద్దని నారా లోకేష్ సూచించారు. ప్రతి విద్యార్థికి లబ్ది చేకూరేలా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్న పథకాలను తప్పకుండా అమలు చేస్తామని, వీటిపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరారు. తల్లికి వందనం పథకంపై ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయని, త్వరలోనే మార్గదర్వకాలు విడుదల చేస్తామని తెలిపారు. వైసీపీ హయంలో విద్యారంగం తీవ్రంగా దెబ్బతిందని, మన రాష్ట్రంలో ఉన్న విద్యావిధానాన్ని ఇతర రాష్ట్రాల విద్యావిధానంతో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలన్నింటినీ మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు.

అందుకే ఆలస్యం

అయితే గతంలో ఈ పథకం అమలుకు ఆలస్యం ఎందుకు అన్న అంశంపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు. పథకం ఆలస్యానికి బలమైన కారణాలే ఉన్నాయని చెప్పారు. ‘‘ప్రభుత్వ శాఖల్లో పథకాల అమలుకు ఆధార్ వినియోగించినట్లయితే ఆధార్ చట్టం ప్రకారం ముందుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారమే గెజిట్ విడుదల చేశాం. ఆధార్ వినియోగించాలంటే ముందుగా UDAI నుంచి అనుమతులు పొందాలి. లేకుంటే ఆధార్ సేవలకు అంతరాయం కలుగుతుంది. త్వరలోనే తల్లికి వందనం అమల్లోకి వస్తుంది. అందుకోసం కావాల్సిన అనుమతులు UDAI నుంచి తీసుకునే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది’’ అని ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈ చర్చ సందర్బంగానే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తప్పనిసరిపై కూడా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇంగ్లీషు మీడియంకు ఏమాత్రం వ్యతిరేకంగా కాదని చెప్పారు. ‘‘ఇంగ్లీషు మీడియంకు మేము వ్యతిరేకంగా కాదు. కానీ ప్రతి విద్యార్థికి తన మాతృభాష కూడా రావాలి. భవిష్యత్తులో ఎవరూ కూడా నా తరహాలో తన మాతృభాష మాట్లాడటానికి ఇబ్బంది పడకూడదు. ఇప్పటికి కూడా నేను చాలా చోట్ల తడబడుతుంటాను. ఇలాంటి పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదనేదే మా అభిప్రాయం’’ అని లోకేష్ వివరించారు.

Tags:    

Similar News