VMRDA| లోకేశ్ కి 'ప్రణవి'ల్లిన విశాఖ ఎంఆర్డీయే: సీనియర్ల కుతకుత

తల పండిన వారికే కీలకమైన పోస్టులు కట్టబెట్టాలనే తీరు ఇంకానా ఇకపై చెల్లదంటోంది యువతరం. నారా లోకేశ్ కి శిష్యుడైన ప్రణవ్ గోపాల్ కి పదవి దక్కిన తీరే ఇందుకు నిదర్శనం

Update: 2024-11-20 09:29 GMT
VMRDA Chairman Pranav Gopal
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) చైర్మన్ పదవంటే ఆషామాషీ కాదు. కేబినెట్ హోదాకి మించిన పోస్టు. ఆ పోస్టు క్రేజీ అంతా ఇంతా కాదు. ఏ అధికార పార్టీ అయినా ఈ కీలక పదవిని కాస్త కుడిఎడంగా సీనియర్లకే కట్టబెడుతుంది. రాజకీయాల్లో ఉద్దండులు, తలలు పండిన వారికి కట్టబెట్టడం ఆనవాయితీ. వుడా (విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని ఆశించే వాళ్లు కూడా ఆ స్థాయిలోనే ఉండేవారు. అధికార పార్టీ పెద్దలు సైతం తలపండిన వాళ్లకే ఛాన్స్ ఇచ్చే వారు. కానీ ఇప్పుడు తరం మారుతోంది. స్వరాలూ మారుతున్నాయి. ఆనవాయితీలు, సంప్రదాయాలకు ఇప్పుడు పెద్ద పట్టింపు లేదు. సీనియారిటీతో పని లేదు. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.
వుడా చరిత్రా పెద్దదే...
విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా)కి పెద్ద చరిత్రే ఉంది. 1962లో టౌన్ ప్లానింగ్ ట్రస్టుగా ఆవిర్భవించింది. 16 ఏళ్ల తర్వాత 1978లో వుడాగా మార్చారు. దీంతో ఈ వుడా స్థాయి పెరగడంతో పాటు ప్రాధాన్యత కూడా పెరిగింది. అనంతరం 2018లో దీని పరిధిని మరింతగా విస్తరిస్తూ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీయే) గా అప్ గ్రేడ్ చేశారు. అప్పట్లో విశాఖపట్నం వుడా చైర్మన్ పోస్టు అంటే ఎమ్మెల్యేకన్నా ఎక్కువ విలువ కలిగి ఉండేది. అందుకే ఎమ్మెల్యేలు అయిన వారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ చైర్మన్ పదవిని ఇచ్చేవారు. ఇది కేబినెట్ ర్యాంకు పదవి కావడం, మంచి పరపతి, పలుకుబడి కలిగి ఉండడంతో ఈ పోస్టు కోసం కీలక వ్యక్తులు ఎగబడే వారు. దీంతో పోటీ పడేవారిలో ఆ స్థాయి ఉన్న నేతలు ఎవరున్నారో చూసి అలాంటి వారికే చైర్మన్ పదవిని కేటాయించే వారు. ఇలా వుడా చైర్మన్ పదవులను అలంకరించిన వారిలో రాజ్యసభ మాజీ సభ్యుడు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ద్రోణంరాజు సత్యనారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యేలు టి.సూర్యనారాయణరెడ్డి (సూర్రెడ్డి), డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ద్రోణంరాజు శ్రీనివాసరావు ఇంకా కొవ్వూరి గంగిరెడ్డి, మరియాదాసు (పీసీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు), పీఎస్ఎన్ రాజు (రవి) వంటి వారు ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ద్రోణంరాజు శ్రీనివాసరావు వీఎంఆర్డీయే చైర్మన్ పదవిలో ఉండగా మరణించారు. ఆ తర్వాత విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అక్కరమాని విజయనిర్మలకు, అనంతరం విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటును ఆశించి భంగపడ్డ సనపల చంద్రమౌళికి ఈ పదవి దక్కింది. అయితే చంద్రమౌళి కేవలం ఒకట్రెండు నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు.
తాజాగా ప్రణవ్ గోపాల్‌కు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కీలకమైన ఈ వీఎంఆర్డీయే చైర్మన్ పదవిపై టీడీపీ, జనసేనల్లో కీలక నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్ హోదాతో పాటు ఎంతో పరపతి కలిగిన ఈ పోస్టు కోసం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాల్జీ తీవ్రంగా ప్రయత్నించారు. ఇంకా వైసీపీ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసి, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన సీతంరాజు సుధాకర్, టీడీపీ మైనార్టీ విభాగం నేత నజీర్లు ఆశపడ్డారు. జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పీఏసీ సభ్యుడు కోన తాతారావు తదితరులు ఆశించారు. కానీ ఇటీవల నామినేటెడ్ పదవుల పందేరంలో అనూహ్యంగా పిన్న వయస్కుడైన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్కు దక్కడంతో వీరంతా అవాక్కయ్యారు. ప్రణవ్ గోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్కు నమ్మకస్తుడైన అనుచరుడు. లోకేష్ పాదయాత్రలో ఆయన వెంట ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసుల్లో అరెస్టయి రిమాండ్కు వెళ్లారు. అందువ ల్లే సీనియర్లను పక్కనబెట్టి ఆయన విధేయతను గుర్తించి వీఎంఆర్డీయే చైర్మన్ పదవిని కట్టబెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎంతో కీలకమైన, రూ.వేల కోట్ల బడ్జెట్ ఉండే వీఎంఆర్డీయే చైర్మన్ పదవిని విధేయుడికిస్తే భవిష్యత్తులో 'ఎలాంటి ఇబ్బందులు' తలెత్తబోవన్న నమ్మకంతో ప్రణవ్ గోపాల్కు ఏరికోరి ఎంపిక చేసినట్టు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీకి సేవలందించినప్పటికీ తమ ఆశలకు 'గండి' పడిందంటూ టీడీపీ నుంచి ఆశించిన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేనలోనూ కీలక పోస్టులేవీ తమకు దక్కలేదంటూ ఆ పార్టీ ఆశావహులూ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఇలా టీడీపీ. జనసేనలకు చెందిన కూటమి నేతలు లోలోన కుతకుతలాడుతున్నారు.
ఇదీ వీఎంఆర్డీయే పరిధి!
వీఎంఆర్డీయే పరిధి ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 7,328.86 చదరపు కి.మీలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం నగరపాలక సంస్థ, శ్రీకాకుళం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లు, ఆమదాలవలస, యలమంచిలి, తుని (కాకినాడ జిల్లా) మున్సిపాలిటీలు ఇందులో ఉన్నాయి. ఈ వీఎంఆర్డీయే పరిధిలో 53.4 లక్షల జనాభా ఉన్నారు.
Tags:    

Similar News