లుకౌట్ నోటీసులు అంటే..
ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేరాలకు పాల్పడిన వారిపై హిస్టరీ షీట్, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవి తెరపైకి వచ్చాయి.
Byline : The Federal
Update: 2024-05-23 08:30 GMT
నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు జారీ చేసి వాటిల్లో లుకౌట్ నోటీసులు కూడా ఒకటి. మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఇది తెరపైకి వచ్చింది.
లుకౌట్ నోటీసులంటే
లుకౌట్ నోటీసులను లుకౌట్ సరుక్యులర్ అని కూడా అంటారు. షార్ట్ ఫామ్‌లో దీనిని ఎల్‌ఓసి అంటారు. నేరాలకు పాల్పడి, పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఇతర దేశాలకు పారిపోయే అనుమానాలు, అవకాశాలు ఉన్న సందర్భాల్లో సదరు నేరస్తుడిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో జారీ చేసే నోటీసులను లుకౌట్ నోటీసులు లేదా లుకౌట్ సర్క్యులర్ అని అంటారు. నేరం చేశాడని నిర్థారణ అయిన తర్వాత, నేరస్తుని పేరు ఎప్‌ఐఆర్‌లో నమోదు చేసి, సదరు నేరస్తుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అరెస్టు వారెంట్‌లు జారీ చేసిన తర్వాత కూడా సదరు నేరస్తుడు పోలీసులకు లొంగి పోకుండా పోలీసు కళ్లు కప్పి తప్పించుకునేందుకు తిరుగుతూ ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించే నేరస్తులను పట్టుకునేందుకు వారిపైన ఈ నోటీసులు జారీ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అన్ని ఇమ్మిగ్రేషన్ చెక్ పోయింట్‌లకు ఈ నోటీసులను సర్వ్ చేస్తారు. ఇతర దేశాలకు వెళ్లే మార్గాలైన సీ పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల మార్గాలకు సంబంధించిన చెక్ పాయింట్లకు దీనిని చేర వేస్తారు. దీనిలో సదరు నేరస్తునికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఆ నేరస్తుడిని పట్టుకునేందుకు సులువుగా ఉంటుంది.
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీని కోసం ఒక ప్రత్యేక ఫార్మేట్‌ను తయారు చేశారు. అందులో పేర్కొన్న ప్రకారం నేరస్తుడి వివరాలన్నింటిని పొందుపరచి దానిని చెక్ పోయింట్లకు చేర వేస్తారు. సెంట్రల్ లెవల్లో డిప్యూటీ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ స్టేట్ లెవల్లో, జిల్లా స్థాయిలో జిల్లా ఎస్పీలకు ఈ నోటీసులు జారీ చేసే అధికారం ఉంటుంది. వీరితో పాటు నార్కోటిక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగాల అధికారులు కూడా ఈ నోటీసులను జారీ చేసే అధికారం ఉంటుంది. ఈ సర్క్యులర్ వాలిడిటీ దాదాపు ఏడాది పాటు ఉంటుంది. ఏడాది వరకు ఇది అమల్లో ఉన్నట్లు లెక్క. అప్పటికీ సదరు నేరస్తుడు పట్టుబడక పోతే మరో ఏడాది పాటు దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది.
పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన వారిపై ఈ నోటీసులు జారీ చేస్తారు. నీరబ్ మోడీ, లలిత్ మోడీ, చందాకొచ్చార్, విజయ్ మాల్యాలపైన కూడా ఈ నోటీసులు జారీ చేశారు. తాజాగా మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డిపైన ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 2024 ఎన్నికల సందర్భంగా పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వసం చేసి నేరాలకు పాల్పడ్డాడు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకొన్నారు. విదేశాలకు పారిపోయేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే అనుమానవం వ్యక్తం చేస్తూ అన్ని చెక్ పాయింట్లకు ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.