TRAGEDY| అమలాపురం అమ్మాయి.. విశాఖ అబ్బాయి.. గాజువాకలో ఆత్మహత్య!
ఇదేం ప్రేమ.. ఇవేం చావులు.. కొన్నాళ్లుగా ప్రేమ.. మరికాసేపు షికారు.. ఇంతలోనే బలవన్మరణం.. ప్రేమంటే నూరేళ్ల పంట అనే తీరు మారిందా?
By : The Federal
Update: 2024-12-04 06:15 GMT
ఇదేం ప్రేమ.. ఇవేం చావులు.. కొన్నాళ్లుగా ప్రేమ.. మరికాసేపు షికారు.. ఇంతలోనే బలవన్మరణం.. ప్రేమంటే నూరేళ్ల పంట అనే తీరు మారిందా? కన్నవాళ్లకు కడుపు కోత మిగిల్చిన మరో విషాద సంఘటన విశాఖపట్నంలో జరిగింది.
అమలాపురం అమ్మాయి, విశాఖ అబ్బాయి. అమ్మాయి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. అబ్బాయి విశాఖపట్నంలో వ్యాపారం. అరకు పోయారు. కలిసి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో విశాఖపట్నం వచ్చారు. గొడవ పడ్డారు. మూడంతస్తుల భవనం పై నుంచి దూకి చచ్చిపోయారు. ఈ విషయం తెలిసి వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
విశాఖలో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఓ యువతీ యువకుడు మూడంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు విశాఖపట్నంలోని వెంకటేశ్వర కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో అద్దెకు ఉంటూ షీలానగర్‌లో కేటరింగ్ నిర్వహిస్తున్నారు. అమలాపురానికి చెందిన నూకల సాయి సుస్మిత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆమె అప్పుడప్పుడూ దుర్గారావు నివాసానికి వచ్చి వెళ్తుంటుంది. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఆమె హైదరాబాద్ లోనే ఉందనుకుంటున్నారు.
డిసెంబర్ 3వ తేదీ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత దుర్గారావు, సుశ్మిత ఓ భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇద్దరు ఆదివారం అరకు వెళ్లారు. ఆ తర్వాత విశాఖ వచ్చారు. ఇంట్లో మద్యం తాగారు. గాజు గ్లాసులు, ఖాళీ సీసాలు అక్కడ కనిపిస్తున్నాయి. టీవీ రిమోట్ పగిలిపోయి ఉంది. అంటే వీళ్లిద్దరూ గొడవపడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఇద్దరూ కలిసి భవనం పైకి వెళ్లారు. మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు.
ప్రేమజంట ఆత్మహత్యతో వెంకటేశ్వర కాలనీలో కలకలం రేగింది. వీరి మృతి పట్ల పలువురు చిలవలు పలవలుగా మాట్లాడారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సుస్మిత తరచూ విశాఖ వస్తున్నట్లు చెప్పారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, భార్యాభర్తలనుకున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరూ ఓ మాట అనుకునే దూకేశారా లేక మరేదైనా జరిగిందా అనేది విచారణలో తేలాల్సి ఉంది.
అమలాపురం విద్యుత్‌నగర్‌కు చెందిన పల్లంరాజు దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాయి సుస్మిత. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంది. తమకు చేదోడువాదోడుగా ఉంటున్న సుస్మిత మరణం వారిని ఎంతో బాధించింది.
అమలాపురం శ్రీరామపురం ప్రాంతానికి చెందిన పిల్లి శ్రీనివాసరావు (రంగా)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తండ్రి వద్దే ఉంటున్నాడు. రెండో కుమారుడు దుర్గారావు ఇంటర్ వరకు చదివాడు. విశాఖలోనే ఏడాది నుంచి తన తండ్రి పేరుమీద కోనసీమ రుచులతో ‘రంగ క్యాటరింగ్, కుకింగ్’ నడుపుతున్నాడు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చి సరదాగా గడుపుదామని అన్నాడని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని శ్రీనివాసరావు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గాజువాక సీఐ పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గారావు, సుష్మిత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఈ ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయని తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్రమనస్తాపానికి గురైన ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.