మహానంది ఆలయానికి కోట్ల విలువైన ఆస్తి రాసిచ్చిన దాత

భక్తి ఎక్కువైందా? విరక్తి చెందారా! ఓ రిటైర్డ్ లెక్చరర్ కోట్ల ఆస్తిని ఆలయానికి సమర్పించారు. పత్రాలను అధికారులకు స్వాధీనం చేశారు.

Update: 2024-10-25 11:14 GMT
కర్నూలు జిల్లా మహానందిలోని ఆలయం

రాయలసీమ ముఠాకక్షలకే నిలయం. అని చాలామంది భావిస్తారు. ఇది చారిత్రక ఆలయాలకు కూడా ప్రసిద్ధి. సెంటు స్థలం కోసం కత్తులు దువ్వే సీమలో కోట్ల రుపాయల విలువైన భూమిని భక్తితో ఓ కుటుంబం ఆలయానికి దారాదత్తం చేసింది. మహానంది ఆలయానికి ఓ రిటైర్డ్ అధ్యాపకుడు భూములతో పాటు విలువైన ఇంటి స్థలం కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ పత్రాలను మహానంది ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇవొ) శ్రీనివాసరెడ్డికి అందించారు.

"గతంలో కూడా ఆ లెక్చరర్ రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఆలయానికి కానుకగా సమర్పించారు" అని మహానంది ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్'ప్రతినిధికి స్పష్టం చేశారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా (ప్రస్తుతం నంద్యాల) పరిధిలో ఉన్న మహానందీశ్వర ఆలయానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో విశిష్ట స్థానం ఉంది. మహానంది మండలంలోని మహానందీశ్వర ఆలయం క్రీ.శ ఏడో శతాబ్దానికి చెందింది. నంద్యాల జిల్లా నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని నల్లమల కొండకు తూర్పున ఉన్న అటవీప్రాంతంలోని ఇది ఓ సుందరమైన ప్రదేశం కూడా. ప్రకృతి ఒడిలో విస్తరించి ఉన్న ఈ ఆలయం వద్ద నిరంతరాయంగా నీటి ఊట రావడం ప్రత్యేకత. స్పటిక రాయిలో ప్రవహించే స్పష్టమైన నీరు ఇక్కడ విశేషమైంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ శిల్ప సౌందర్యంతో పాటు ఆలయానికి పుష్కరిణి ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పుష్కరణలో చిన్నపాటి సూది పడినా స్పష్టంగా కనిపించే విధంగా నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో...
మహానందీశ్వర ఆలయ విశిష్టతలు, ఆధ్యాత్మికత ఆకర్షించిందేమో! లేకుంటే కుటుంబ వ్యవహారాల నేపథ్యంలో విరక్తి చెందారో తెలియదు. కానీ, రిటైర్డ్ లెక్చరర్ అయినా రాజు, శకుంతల దంపతులు రు. రెండు కోట్లకు పైగానే విలువైన 2.10 ఎకరాల సాగు భూమి, ఇంటిని ఆలయం పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ రాజు, ఆయన భార్య శకుంతల దంపతులు మహానంది శ్రీకామేశ్వరి సహిత మహానందీశ్వరస్వామి భక్తులు. దీంతో తనకు ఉన్న రు. కోట్ల విలువైన 2.10 ఎకరాల భూమి తోపాటు ఇంటి స్థలాన్ని కూడా ఆలయం పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ పత్రాలను మహానంది ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డికి అందించారు.
" గతంలో కూడా రిటైర్డ్ లెక్చరర్ రాజు రెండు ఎకరాల భూమిని ఆలయానికి రాసిచ్చారు" అని ఈఓ శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహానందీశ్వరునికి ఆస్తులు దారాదత్త చేసిన రాజును అందరూ అభినందించారు. తన సొంత ఆస్తులు ఆలయానికి కానుకగా సమర్పించిన రాజు దంపతులకు అంతకుముందు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆస్తిపత్రాలు సమర్పించిన తర్వాత ఆ దంపతులకు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. అర్చకులు అభిషేక పూజాదికాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత రాజు, శకుంతల దంపతులను ఆలయ అధికారులు ఆశీర్వాద మండపంలో సత్కరించి, ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు.
మహానంది ఆలయానికి దాతలు అందిస్తున్న సహకారంతో యాత్రికుల కోసం సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. వసతి భవనాలను నిర్మించారు. ఇక్కడ ఒక గది రు. 200కు అందుబాటులో ఉంది. రోజు మధ్యాహ్నం సుమారు 300 మందికి అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Tags:    

Similar News