అసభ్య ప్రవర్తన.. జోతిష్యుడి హత్య
తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుణ్ణి ఓ వ్యక్తి అంతమొందించి, ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు.;
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని ఓ సామెత.. జనానికి శుభాలు చెప్పే జ్యోతిష్కుడొకరు తన జాతకాన్ని చూసుకోవడంలో పొరబడినట్టున్నారు. అనుచిత ప్రవర్తనతో హత్యకు గురయ్యాడు. ఆ విషయం ఆయన జాతకంలో ఉందో లేదో గాని చావు మాత్రం దారుణంగా ఉంది. తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుణ్ణి ఓ వ్యక్తి అంతమొందించి, ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. డిటెక్టివ్ స్టోరీని మించిపోయేలా ఉన్న ఈ కథనమేమిటో చదవండి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి మండలంలో నేర్లవలస అనే గ్రామం ఉంది. ఆ ఊరికి చెందిన చిన్నారావు, మౌనిక దంపతులు ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో నివాసముంటున్నారు. ఈ మధ్య వారికేదో సమస్యలు వచ్చాయి. ఎక్కడ తిరిగినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. దీంతో ఎవరో వారికో సలహా ఇచ్చారు. అప్పన్న జ్యోతిషుడు ఉన్నాడని, ఆయన ఏమి చెబితే అది జరుగుతుందని చెప్పారు. దాంతో ఈ దంపతులు ఈ 50 ఏళ్ల అప్పన్న(50)ను సంప్రదించారు. ముందు మాట్లాడుకున్నట్టే ధర నిర్ణయమైంది. ఆయన ఇంటికి వచ్చిపోయేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 7న పూజల కోసం ఆయన్ను ఇంటికి పిలిపించారు. జ్యోతిష్యుడు వచ్చినపుడు మౌనిక ఒక్కరే ఇంట్లో ఉన్నారు. భర్త వేరే పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన జ్యోతిష్యుడు ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో అతను అప్పన్నను అంతమొందించాలని ప్రణాళిక వేశాడు. ఈ నెల 9న సాయంత్రం.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని పూజలు చేయాలని చిన్నారావు అప్పన్నను కోరాడు. ద్విచక్రవాహనంపై నేర్లవలస తీసుకెళ్తున్నట్లు నమ్మబలికాడు. బోయపాలెం- కాపులుప్పాడ మార్గంలోని కల్లివానిపాలెం గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆపి చాకుతో అప్పన్నను పొడిచి చంపాడు. ఈ క్రమంలో తన చేతికి గాయమవడంతో 10వ తేదీన కేజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నాడు. తర్వాత రోజు దంపతులిద్దరూ.. జ్యోతిషుడి మృతదేహం వద్దకు వెళ్లి శవంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. ఇంతవరకు వాళ్లు అనుకున్నట్టే జరిగినా ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. పూర్తిగా కాలిపోతుందనుకున్న బాడీ పూర్తిగా కాలలేదు. ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద పోలీసులు ఓ అస్థిపంజరాన్ని గుర్తించారు. తీగలాగితే డొంక కదిలింది. చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి పోలీసు స్టేషన్ కి తీసుకువచ్చి విచారించారు. అప్పడు అసలు విషయం బయటపడింది. ఇద్దర్నీ ఫిబ్రవరి 21న అరెస్టు చేసి జైలుకి తరలించారు.