తుది శ్వాస విడిచే వరకు విలువలు వీడని ‘మానికొండ’
ప్రపంచానికి తెలియని గొప్ప జర్నలిస్టు మానికొండ చలపతిరావు. దేశ ప్రధానులు సైతం ఆయన సూచనల కోసం ఎదురు చూశారు.;
విలువలు, విశ్వసనీయత జర్నలిజానికి రెండు కళ్లు. అటువంటి జర్నలిజానికి బీజాలు వేసిన వ్యక్తి మానికొండ చలపతిరావు అని కుడా చైర్మన్ సోమిశెట్టీ వెంకటేశ్వర్లు అన్నారు. నేటి తరం జర్నలిస్టులు మానికొండ మార్గాన్ని కొంతైనా అనుసరించాలని కోరారు. గురువారం సాయంత్రం కర్నూలు నగరంలోని లలిత కళాసమితిలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రచయిత సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య రాసిన ’భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన ‘ది ఫెడరల్’ ఆంగ్ల పత్రిక సంపాదకులు జింకా నాగరాజు మాట్లాడుతూ భారతీయ జర్నలిజంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర మానికొండ చలపతిరావుదని అన్నారు. మానికొండ చలపతిరావు చరిత్రను ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ నిర్మాణంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనదన్నారు. జర్నలిజంలో సరికొత్త పాఠం ఆయన చరిత్ర అన్నారు. పుస్తకాన్ని గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర కల్కూర ఆవిష్కరించారు.