గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు

సచివాలయం పరిధిలో ప్రస్తుతం ఉన్న వెయ్యి కుటుంబాలకు బదులు ఇకపై 2,500 కుటుంబాలు పైన ఉంటాయి.;

Update: 2025-01-17 05:35 GMT

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేయనున్నారు. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా సర్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా... చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల 4 నుంచి ఆరుగురితో సచివాలయాలు పనిచేస్తున్నాయి.

ఇకపై కనీసం 2,500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం

2,500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2,500 నుంచి 3,500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు. 3,501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే 2,500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 2,500 నుంచి 3,500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 3,500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6,054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రికి అధికారులు సమర్పించారు.

మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు

రేషనలైజేషన్‌లో భాగంగా మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్‌గా సచివాలయాలను విభజించాలనే ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ వస్తారు. అలాగే వార్డు సెక్రటేరియట్‌లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.

టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఎఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు.

గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు

గ్రామాల్లో ఒకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరి ద్వారా ఎఐ, డ్రోన్ వంటి సకొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో టెక్నాలజీ పరంగా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో సాంకేతికంగా అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం అధికారులకు సూచించారు. కొత్త విధానం అమలు పరిస్తే 15 వేల మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారని అధికారులు చెబుతున్నారు.

తన ఫొటో లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని సీఎం ఆదేశం

సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించవద్దని సీఎం స్పషమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చారు. సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని సీఎం ఆదేశించారు. పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నాటికి పూర్తి చెయ్యాలన్నారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వ్యక్తుల గురించి సర్వే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం వద్ద ప్రజల సమాచారం ఉండాలి..

ప్రజల సమాచారం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సమాచారం లేని ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే పక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చెయ్యనున్నారు. వెంటనే ఈ పనిని మొదలు పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కనీసం 2,500 జనాభాకు లేదా 5 కిలో మీటర్ల పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీలలో అవసరం అయితే అదనంగా సచివాలయాలు పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఉన్నవారిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.

రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాలుగా...

గ్రామ, వార్డు సచివాలయాలు రియల్‌టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలని సిఎం అధికారులకు సూచించారు. సచివాలయాల పనితీరు అంచనా వేసి ఆ సచివాలయాల్లో పనిచేసే వారికి తగిన విధంగా బహుమతి ఇవ్వనున్నారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ విభాగానికి అధిపతిగా ఉంటారు. సచివాలయాలు నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి, విలువ జోడింపు వంటి వాటికి కేంద్రంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్య నిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 20, 2025 నాటికి గృహాలన్నీ జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News