సోషల్‌ మీడియాలో విష సంస్కృతిని నివారించేందుకు చర్యలు పట్టాలి

డా పివి రమేష్‌ ఐఎఎస్, రిటైర్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పూర్వపు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి

Update: 2024-11-14 13:37 GMT

సోషల్‌ మీడియాలో విష సంస్కృతిని నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు పట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పూర్వపు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి డా పివి రమేష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేడు సోషల్‌ మీడియాలో నెలకొని ఉన్న విష సంస్కృతిపై సీఎం చొరవ తీసుకుని అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులతో చర్చలు జరపాలని పేర్కొన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో గురువారం ‘సోషల్‌ మీడియాలో విష సంస్కృతి’ అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. దీనికి పివి రమేష్‌ ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు.

భారతదేశానికి స్వాతంత్య్ర రథ సారధిగా ఉన్న గాంధీజీ పట్ల నవభారత నిర్మాతగా ప్రథమ ప్రధానిగా కృషి చేసిన నెహ్రూ పట్ల సోషల్‌ మీడియాలో అసభ్య పదజాలాలతో, వ్యక్తిగత దూషణలతో పోస్టులు పెడుతున్నా ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయకపోవడం దురదృష్ట కరమన్నారు. పిల్లలపై సోషల్‌ మీడియా ప్రభావాన్ని నివారించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్లకే ఇంటర్నెట్‌ వాడకాన్ని పరిమితం చేయాలన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగాన్ని అడ్డుకోవాలన్నారు. సోషల్‌ మీడియా దుష్ప్రవాలపై చర్చలు జరగాలన్నారు. వీటిపైన ప్రజలను జాగృతం చేయాలని కోరారు.
కొందరు స్వార్ధపరులు సోషల్‌ మీడియాలో కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారన్నారు. యువత అంతర్జాలానికి వ్యసన పరునిగా మారుతూ ఉత్పాదక శక్తిని కోల్పోతున్నారని అన్నారు. మత్తు పదార్థాల వ్యసనం కన్నా స్మార్ట్‌ ఫోన్‌ వాడకం మరింత ప్రమాదకరమన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ సోషల్‌ మీడియా ద్వారా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు జరగాలి, కానీ వ్యక్తిగత విమర్శలు అసభ్య పదజాలం అవాస్తవాలను ప్రచారం చేయరాదన్నారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తున్నవారు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న సోషల్‌ మీడియాలో విష సంస్కృతిని ఆపాలన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు.
చర్చా గోష్టికి అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, సోషల్‌ మీడియాని పట్టిపీడిస్తున్న విష సంస్కృతిని ఏరి పారేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పాలనకు స్వస్తిపలికి, రాజ్యాంగ బద్ధ పాలన చేపట్టాలని, సోషల్‌ మీడియాలో ఎవరు తప్పు చేసినా రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, లోపాలను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ఫేస్‌ బుక్‌ ను, 250 కోట్ల మంది యూట్యూబ్‌ను, 278 కోట్ల మంది వాట్సాప్‌ ను, 200 కోట్ల మంది ఇన్‌ స్ట్రాగామ్‌ను వినియోగిస్తున్నారని వివరించారు. ప్రపంచ జనాభాలో 60 శాతం మంది సోషల్‌ మీడియాను వినియోగించుకుంటున్నారని, సగటున 22 శాతం సమయాన్ని సోషల్‌ మీడియాలో గడుపుతున్నారని సోదా హరణంగా తెలిపారు. అధికార పార్టీ శాసన సభ్యులు, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి వందలాది ప్రత్యర్థి పార్టీల యువతపై కేసులు బనాయించారని, గత ఐదు నెలలుగా కూటమిలో భాగస్వామ్యులైన యువత అనేక సందర్భాలలో పరుష పదజాలతో, బూతులతో, సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఏ ఒక్కరిని అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.
ప్రముఖ విద్యావేత్త ప్రొ డిఏఆర్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడటం అనైతికమన్నారు. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రశాంత కిషోర్, వారి శిష్య బృందం దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల తరఫున విషప్రచారం చేసి రాజకీయాలను కలుషితం చేశారన్నారు. అవాస్తవాలను ప్రచారం చేసి రాజకీయాల్లో గెలుపు కోసం సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేశారని అన్నారు. చర్చా గోష్టిలో జన చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి పి శేషుబాబు, నేస్తం సహ వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, మానవత అవయవ దాన కమిటీ చైర్మన్‌ తూనుగుంట్ల సుందర రామయ్య, కోవిడ్‌ ఫైటర్స్‌ అల్లా బక్షు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముందుగా బాలల దినోత్సవాన్ని సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Tags:    

Similar News