వేగం పెంచిన పారిశుద్ధ్యం.. టూ వీలర్‌పై మంత్రి పర్యటన

విజయవాడలో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. రెట్టించిన వేగంతో పారిశుద్ధ్య పనులను జరుగుతున్నాయి.

Update: 2024-09-08 11:14 GMT

విజయవాడలో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. రెట్టించిన వేగంతో పారిశుద్ధ్య పనులను జరుగుతున్నాయి. సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో వరద 2 అడుగుల మేర తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అలానే ఉంది. బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడటంతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. కానీ వరద ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనుల వేగం పెంచారు. పూడిక, చెత్త, మట్టిని తొలగించేస్తున్నారు. వరద ప్రభావిత బాధితులకు ప్రభుత్వం నిత్యావసర సరుకుల కిట్‌లను అందిస్తోంది. సీఎం సహాయనిధికి భారీ విరాళాలు అందుతున్న క్రమంలో ప్రజలకు సహాయక చర్యలు అందించే విషయంలో రాజీకి తావు లేకుండా చూస్తోంది. ఇప్పటికే పాలు, పండ్లతో పాటు కూరగాయల్ని కూడా రాయితీలకు అందిస్తున్నారు. మరోవైపు కృష్ణా నదికి వరద ఉద్ధృతిని పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది.

ప్రకాశం బ్యారేజీ డేంజర్ బెల్స్

ప్రకాశం బ్యారేజీ దగ్గర మరికాసేపట్లో తొలి ప్రమాద ఘంటిక మోగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బ్యారేజీకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులుగా నమోదైనట్లు వారు తెలిపారు. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్‌ఫ్లో 2.86 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3.09 లక్సల క్యూసెక్కులు నమోదైంది. పులిచింత దగ్గర కూడా ఇన్‌ఫ్లో కన్నా ఔట్ ఫ్లో అధికంగా ఉంది. వర్షాలు, వరదల నేపథ్యంలో వాగులు, వంకలు ఇంకా పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, వీలైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.




 

టూవీలర్‌పై మంత్రి పర్యటన

వరదల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. టూవీలర్‌, త్రీవీలర్ ఇలా అందుబాటులో ఉన్న వాహనంపై విజయవాడలో పర్యటిస్తున్నారు. చిట్టినగర్, బుడమేరు ముందు ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బైక్‌పై వీధివీధికి వెళ్లి అక్కడ బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాల కిట్‌ల పంపిణీని పరిశీలించారు. అందరికీ ప్రభుత్వం అందిస్తున్నవన్నీ అందుతున్నాయా లేదా అని కనుక్కున్నారు. అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలని ప్రజలకు తెలిపారు. దాంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీధులు, ఇళ్లలో పేరుకుపోయిన బురదను ఫైరింజన్ల సహాయంతో శుభ్రం చేయాలని, ఇందులో వేగం పెంచాలని అచ్చెన్నాయుడు సూచించారు. అంతేకాకుండా మళ్ళీ వర్షాలు పడుతున్న క్రమంలో ముంపు ప్రాంత ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచి వాటిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Tags:    

Similar News