మంత్రి గుమ్మనూరు గుడ్ బై చెబుతారా? గుంజాటనలో గుమ్మనూరు జయరాం!!
ఆరు నెలలు నన్ను వదిలిపెడితే తెలుగుదేశం కథేంటో చూస్తానన్న మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ అధినేత జగన్ కు గుడ్ బై చెబుతారా..;
మంత్రి గుమ్మనూరు జయరామ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ రెండింటిలో ఏ పార్టీలో చేరాలనేదానిపై సందిగ్ధంలో ఉన్నారు జయరామ్. ఇన్‌చార్జ్‌ల మార్పుల ప్రక్రియంలో మంత్రి జయరామ్ స్థానం మారిపోయింది. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కర్నూల్ లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జయరామ్ వైసీపీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ఆయన అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు.
కాంగ్రెస్ వైపే జయరామ్ చూపు..
కాంగ్రెస్ వైపే జయరామ్ చూపు ఉన్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో జయరామ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, మంత్రి నాగేంద్రతో జయరామ్ సంప్రదింపులు జరుపుతున్నారని.. ఆయన చేరికకు అధిస్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గుమ్మనూరి జయరామ్‌కు కర్నూల్ జిల్లా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.
బోయ సామాజిక వర్గానికి కాంగ్రెస్ వల..
రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉండే వాల్మీకి సామాజికవర్గాంలో బలం పెంచుకునేందుకు గుమ్మనూరి జయరామ్ చేరిక సహకరిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరామ్ ఐదుసీట్లు అడుగుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానాల్లో ఐదు సీట్లు కావాలని జయరామ్ అడుగుతున్నారు.
తెలుగుదేశం నుంచే ప్రస్థానం...
గునూరు జయరాం అసలు పేరు పెంచికలపాడు జయరాం. 1968 అక్టోబర్ 16న కర్నూలు జిల్లా గుమ్మనూరు గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు పెంచికలపాడు బసప్ప, శారదమ్మ. బళ్లారిలోని మున్పిపల్ బాయ్ హైస్కూలులో చదివారు. కన్నడం బాగా వచ్చు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1989లో రేణుకను వివాహం చేసుకున్నారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
గుమ్మునూరు జయరాం రాజకీయ ప్రస్థానం నిజానికి తెలుగుదేశం నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రముఖ నటుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీలో చేరారు. జయరాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధిశిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుమ్మునూరు జయరాం 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆయన 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యాం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2011లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లోకి అడుగు పెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధిశిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి అయ్యారు.