ఘనంగా గంధమహోత్సవం.. పాలుపంచుకున్న మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాల్లో రొట్టెల పండుగను ఎంత ఘనంగా నిర్వహిస్తారో ఈ పండుగలో భాగమైన గంధమహోత్సవాన్ని అంతకుమించి ఘనంగా నిర్వహిస్తారు.

Update: 2024-07-20 05:25 GMT

నెల్లూరు జిల్లాల్లో రొట్టెల పండుగను ఎంత ఘనంగా నిర్వహిస్తారో ఈ పండుగలో భాగమైన గంధమహోత్సవాన్ని అంతకుమించి ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నిన్న నెల్లూరు బారాషాహీద్ దర్గా గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రొట్టెల పండగలో అత్యంత ప్రధాన ఘట్టమైన ఈ మహోత్సవాన్ని తిలకించడానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ గంధ మహోత్సవంలో భాగంగా అమీనియా మసీదు నుంచి 12 బిందెలలో గంధాన్ని ఊరేగింపుగా ఈద్గా వరకు తీసుకొచ్చారు. అక్కడ ఫకీర్లు ఔరా అనిపించే విన్యాసాలతో భక్తులను ఆకట్టుకున్నారు. విన్యాసాల అనంతరం గంధాన్ని దర్గాలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గంధమహోత్సవానికి విచ్చేసిన కడప పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధాన్ని బారాషాహిద్ సమాధులకు లేపనంగా వేశారు. ఈ క్రమంలో గంధాన్ని అందుకోవడానికి భక్తులు పోటీపడ్డారు.

ఈ మహోత్సవానికి ఆంధ్రపరదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. వీరికి ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు సాదర స్వాగతం పలికారు. అల్లా దయతో నెల్లూరు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా దీర్ఘాయుష్యుతో, శుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని ప్రార్థించినట్లు నారాయణ చెప్పారు. ప్రజలకు, రాష్ట్రానికి ఉన్న అన్ని సమ్యలు తీరాలని కూడా ప్రార్థించారు నారాయణ.

మతాలకు అతీతంగా నిర్వహించే ఈ పండగను తిలకించడానికి, ఇందులో భాగం కావడానికి రెండు తెలుగురాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కోరిన కోర్కెలు తీరాయని, అందుకే మళ్ళీ వచ్చామని అనేక మంది భక్తులు చెప్పారు. అంతేకాకుండా ఈ పండగకు ప్రభుత్వం చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేసిన తీరుతో గంధ మహోత్సవం వైభవంగానే కాకుండా ఎంతో అద్భుతంగా జరిగిందని అర్థమవుతోంది.

Tags:    

Similar News