బుడమేరు కట్ట మళ్ళీ తెగిందంటూ ప్రచారం.. జగన్‌ను టార్గెట్ చేసిన మంత్రులు
బుడమేరు కట్ట మళ్ళీ తెగిదందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ రెండు రోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది.
బుడమేరు కట్ట మళ్ళీ తెగిదందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ రెండు రోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది. బుడమేరుకు మళ్ళీ గండి పడటంతో మరోసారి విజయవాడ మళ్ళీ జలమయం కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలని కూడా ఈ ప్రచారంలో ఉంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. బుడమేరుకు గండి పడటం ఏంటో అర్థంకాని అధికారులు.. వెంటనే పోలీసుల జోక్యం కోరారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బుడమేరుకు మళ్ళీ పడిందన్న గండి గురించి విచారణ చేపట్టారు. అటువంటిది ఏమీ లేదని తేలడంతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తేలిపారు. ఈ మేరకు సమాచారాన్ని మైకులు పెట్టుకుని మరీ పోలీసులు వీధివీధి తిరిగి చెప్తున్నారు. బుడమేరు కట్ట అంతా బాగానే ఉందని, రెండు మూడురోజులుగా వస్తున్న గండి వర్తాల్లో ఎటువంటి వాస్తవం లేదని పోలీసులు చెప్తున్నారు. ‘‘బుడమేరుకు ఎటువంటి గండి పడలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటిది ఏమైనా జరిగితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది’’ అని అధికారులు వెల్లడించారు. తాజాగా ఈ అంశంపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా స్పందించారు. ఈ వార్తలన్నీ కేవలం రూమర్లేనని స్పష్టం చేశారు. వాటిలో ఎటువంటి వాస్తవం లేదన్నారు.
అదంతా అబద్ధమే
‘‘నగరంలోని పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడమేరు వరద వస్తుందనేది రూమర్ మాత్రమే. న్యూ ఆర్ఆర్ పేట, జక్కంపూడి కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో వరద వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. ఆ వార్తలన్నీ, ప్రచారం అంతా అబద్ధమే. ఈ అంశంపై వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర, ఈఎన్‌సీ గోపాల కృస్ణారెడ్డితో ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడాను. వారిచ్చిన సమాచారం మేరకు బుడమేరు కట్ట తెగిందన్న వార్తల్లో వాస్తవం లేదు. కొందరు కావాలనే ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విజయవాడ భద్రంగా ఉంది’’ అని చెప్పారాయన. కాగా ఈ ప్రచారాలకు వైసీపీ నేతలు, వైసీపీ అధినేత జగనే కారణమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఎక్కడైనా సాయం చేశారా: వీరాంజనేయ స్వామి
కొందరు బుడమేరు కట్ట కొట్టుకుపోయిందంటూ ప్రజలను భయపెట్టేలా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ప్రచారాల వెనక జగన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ‘‘విజయవాడలో వరద బాధితుల పరిస్థితులు మెరుగయ్యాయి. ఒక సీఎంగా వరద బాధితుల కోసం నాలుగు గంటలపాటు జేసీబీలో ప్రయాణించిన వ్యక్తి మా ముఖ్యమంత్రే. వరదలు ముంచెత్తిన సమయంలో మాజీ సీఎం జగన్.. ఎక్కడికైనా వెళ్లి ఒక్క వరద బాధితుడికైనా సహాయం అనేది చేశారా? టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు ఎంత సాయం చేసిందో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు విపక్షం మాత్రం నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం.. తమకు సొంత పేపరు, మీడియా ఉంది కదా ఏది పడితే అది రాసేస్తున్నారు. వాళ్లు ఐదేళ్లు అధికారంలో ఉండి వాళ్ళు రాష్ట్రాన్ని ఆడుకున్నారు. వాళ్ల హయాంలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కానీ, ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ ఒక్క పోస్ట్ పెట్టినా అరెస్ట్‌లు చేశారు’’ అని గుర్తు చేశారు.
‘‘జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన బాధ్యతల్లో ఒక్కదాన్ని కూడా సరికి నిర్వర్తించలేదు. వాటన్నింటిని ప్రజలు గమనించే ఎన్నికల్లో తమ తీర్పునిచ్చారు. జగన్ చేసిన తప్పులకు సంబంధించే కొందరు వైసీపీ నేతలు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. ఏ కేసు తప్పుడు కేసు కాదు. అన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. అక్రమాలు ఎక్కడా జరగలేదు. వాళ్లు చేసిన తప్పుల వల్లే విజయవాడకు ఇంతటి వరద వచ్చింది. ఈ వరదలకు మొత్తం వైసీపీ ప్రభుత్వమే కారణం. ఇప్పుడు కూడా వాళ్లే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఒక అసమర్థ వ్యక్తం: మంత్రి సత్యకుమార్
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి బీజేపీ నేత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ అంతటి అసమర్థ వ్యక్తి అసలు సీఎం ఎలా అయ్యారో కూడా తనకు అర్థం కావట్లేదంటూ విమర్శలు గుప్పించారు. ‘‘ఏపీలో గతంలోని వైసీపీ సర్కార్ 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించింది. నాలుగేళ్లు అయినా ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయలేదు. గతేడాది రాజమహేంద్రవరంలో కళాశాల నిర్మాణం పూర్తికాకుండా ప్రారంభించేశారు. వారి చేతకానితనం వల్లే ప్రస్తుతం రెండో సంవత్సరం విద్యార్థులకు గదులు లేక తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. పులివెందుల వైద్య కళాశాలలో 48 శాతం వైద్య సిబ్బంది లేరు. ఇలా అయితే విద్యార్థులను ఎక్కడ చదివించాలి జగన్.. షెడ్ల కిందనా? గదులు ఏర్పాటు చేసినా.. పాఠాలు చెప్పేవారెవరు? మీరు చెప్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? అసత్యాలు ప్రచారం చేస్తున్నారే ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకే పరిమితం చేశారు. ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా మారండి’’ అని సత్యకుమార్ సూచించారు.