వైఎస్‌ఆర్‌సీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా

2023 వరకు వరకు టీడీపీలోనే ఉన్నారు. సీటు రాదని వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. తాజాగా వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.

Update: 2024-11-23 08:51 GMT

గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీకి కష్టాలు మొదలయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని భావించిన చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, పోతుల సునీత, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ వంటి పలువురు నేతలు వైఎస్‌ఆర్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా మరి కొందరు ఎమ్మెల్సీలు అదే బాటలో నడుస్తున్నారు. టీడీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా మరో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా టీడీపీ బాట పట్టనున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఆయన వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసినట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. తన ఎమ్మెల్సీ పదవితో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజుకు పంపారు.

జయమంగళ తొలుత తెలుగుదేశం పార్టీకి చెందిన నేత. 2005లో కైకలూరు జడ్పీటీసీగా ప్రస్తానం ప్రారంభించారు. తర్వాత అదే పార్టీ నుంచే ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. కైకలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన 2009లో గెలుపొందారు. 2014లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా వెంకటరమణకు సీటు దక్క లేదు. ఆయనకు బదులుగా బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌కు దక్కింది. 2019లో టీడీపీ నుంచి కైకలూరు అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్‌ఆర్‌సీపీ నేత దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. తర్వాత 2024 ఎన్నికల్లో సీటు దక్కదని భావించిన జయమంగళ వెంకటరమణ ఆ ఎన్నికలకు ముందు 2023లో వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏట ఎమ్మెల్యే కోటా కింద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News