మాజీ ఎంపీ కిడ్నాప్ కేసు నిందితుడున్న జైల్లోకి ఫోన్లు ఎలా వచ్చాయ్?
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న హేమంత్‌కుమార్ ఉన్న గదికి సమీపంలో ఇవి దొరికాయి.;
By : The Federal
Update: 2025-01-01 06:11 GMT
విశాఖపట్నంసెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లు దొరకడం కలకలం రేపుతోంది. జైల్లోని ఓ బ్యారక్ వద్ద భూమిలో పాతిపెట్టిన ఈ ఫోన్లు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారన్నది చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో నిందితునిగా ఉన్న రౌడీ షీటర్ కోలా హేమంత్ కుమార్ ఉన్న ఖైదుకొట్టు సమీపంలో ఇవి దొరకడంతో సంచలనం సృష్టిస్తోంది. పెన్నా బ్యారక్ సమీపంలో పూల కుండీల వద్ద డిసెంబర్ 31న జైలు అధికారులు వీటిని గుర్తించారు.
రెండు సెల్ ఫోన్లు, ఒక బ్యాటరీ, ఒక పవర్ బ్యాంకును ఓ పూలకుండి సమీపంలో భూమిలో పాతిపెట్టిన వాటిని అధికారులు బయటకు తీశారు. ఫోన్లు ఉన్న కవరును బయటకు తీశామని జైలు సూపర్వైజర్ ఎం.మహేష్‌బాబు చెప్పారు. అయితే దొరికిన సెల్‌ఫోన్లలో సిమ్‌కార్డుల్లేవు. ఈ సిమ్‌కార్డులు ఎక్కడ దాచారో పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. అవి బయటపడితే కాల్ లిస్టు ఆధారంగా ఎవరు ఎవరితో మాట్లాడారనే విషయాలు వెలుగులోకి వస్తాయి. విషయాన్ని జైళ్లశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి సూచనతో ఆరిలోవ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు ప్రాధాన్యత ఉన్నది కావడంతో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ నేరుగా రంగంలోకి దిగారు. సెల్‌ఫోన్లు దొరికిన సమీప బ్యారక్‌లోనే రౌడీ షీటర్ కోలా హేమంత్‌కుమార్ ఖైదీగా ఉన్నారు. ఈ సెల్‌ఫోన్లతో హేమంత్‌కుమార్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్నీ ఆరా తీస్తున్నారు. బ్యారక్‌లో ఉన్న ఖైదీలను జైలు అధికారులు విచారిస్తున్నారు.
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న హేమంత్‌కుమార్ ఉన్న గదికి సమీపంలో ఇవి దొరికాయి. హేమంత్ కుమార్ ఓ హత్య కేసులో ప్రస్తుతం కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఫోన్లు హేమంత్ గదికి సమీపంలో దొరకడంతో ఈఫోన్లకి ఆయనకి ఏమైనా సంబంధం ఉండి ఉండవచ్చా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఆ ఇద్దరు ఎవరు?
ప్రస్తుతం పూలకుండీల కింద ఫోన్లు దొరికిన ప్రాంతంలోనే గత నెల 28న అనుమానంగా కనిపించిన ఇద్దరు వార్డర్లను జైలు అధికారులు తనిఖీ చేశారు. అలా తనిఖీలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు, సహచర సిబ్బందితో కలిసి ఆందోళనకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా 37 మంది వార్డర్లను జైలు అధికారులు బదిలీ చేశారు. ఎక్కడైతే అనుమానం వచ్చిందో,అదే పెన్నా బ్యారక్ సమీపంలో మళ్లీ నిశితంగా జైలు అధికారులు పరిశీలించారు. అక్కడే సెల్‌ఫోన్ల బాగోతం వెలుగు చూడడంతో వార్డర్ల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం ఓ ఫార్మసిస్ట్ క్యారేజీ బాక్సులో గంజాయి తెస్తూ దొరికిపోయాడు. అప్పటి నుంచి రక్షణ సిబ్బంది క్యారేజీ బాక్సులను లోపలికి అనుమతించడం లేదు. దీంతో వారి ఆదాయానికి గండి పడటంతోనే తనిఖీల సమయంలో వార్డర్లు ఆందోళనకు దిగారన్న విమర్శలున్నాయి. ఇక్కడి పరిస్థితి విశ్లేషిస్తే కొందరు ఖైదీలకు సెల్‌ఫోన్లు, గంజాయి అందుబాటులో ఉంటోందని, రాచమర్యాదలు బాగానే జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడి నుంచే బయటకు ఫోన్లు చేస్తూ దర్జాగా సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వరుస సంఘటనలతో విశాఖ సెంట్రల్ జైల్లో అసలు ఏమి జరుగుతుందో అంతుబట్టకుండా ఉంది. నిందితులకు, దోషులకు ఎవరైనా అధికారులు సహకరిస్తున్నారా లేక మరేదైనా వ్యవహారం నడుస్తోందా అనే దానిపై జైళ్ల అధికారులు దృష్టి సారించారు. త్వరలో ఈ విషయమై మీడియాకు అన్ని వివరాలు అందిస్తామని చెబుతున్నారు.