అంబేద్కర్ విషయంలో మోదీ సర్కార్ సెల్ఫ్ గోల్?

కేంద్రంలోని ఎన్డీఏ అంబేద్కర్ విషయంలో అడ్డంగా దొరికి పోయింది. తమను తాము సమర్థించుకునేందుకు కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతోంది.

Update: 2024-12-20 13:44 GMT

భారత పార్లమెంట్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపాయి. అంబేద్కరిస్ట్ లు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను అవమానించే స్థాయికి బిజెపి పోయిందంటే భవిష్యత్ లో భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు చేస్తున్న కుట్రలో భాగమేనని వామపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ వాదులంతా బిజెపి ఆలోచనలు, విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్ర పక్ష పార్టీలను వ్యతిరేకిస్తూ సభలు, సమావేశాలు, ఆందోళనలు జరిగాయి. ఎన్డీఏ కూటమి ఉన్న రాష్ట్రాల్లో అంబేద్కర్ ను ఆరాధించే వారు జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి పూలమాలలు వేయడంతో పాటు అంబేద్కర్ కు జేజేలు పలుకుతూ బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పార్లమెంట్ లో జమిలి ఎన్నికల బిల్లు వీగిపోయింది. దీంతో జమిలీ ఎన్నికల బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం వేసింది. ఈ అంశంపై చర్చ జరిగే సమయంలో హోం మంత్రి అమిత్ షా నోరు పారేసుకున్నారు. అంబేద్కర్... అంబేద్కర్... అంబేద్కర్... అని ఇన్నిసార్లు జపించే బదులు... అన్ని సార్లు దేవుడి పేరు జపిస్తే ఏడు జన్మలకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో పార్లమెంట్ లో మాటల మంటలు చెలరేగాయి. పదేళ్లుగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పార్లమెంట్ లో ఉన్న రాహుల్ కు, ఇండియా కూటమికి మంచి ఆయుధం లభించింది. దేవుడి పేరు చెప్పి అంబేద్కర్ ను అవమానించారంటూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత హోదాలో ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి ఊపిరి సలపకుండా చేసింది.

దీంతో సహనం కోల్పోయిన బిజెపి నేతలు ఒకరి తరువాత ఒకరు విరుచుకు పడ్డారు. ఒకసారి అంబేద్కర్ ను అవమానించిన తరువాత దానిని సరిదిద్దుకునే విధంగా అమిత్ షా ప్రసంగించినా దానిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ ఒకటికి మూడు సార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. అయినా మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు కూడా ఆందోళనలు వెళ్లాయి. బిజెపి తనను తాను సమర్థించుకునేందుకు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇండియా కూటమి ఎంపీలను పార్లమెంట్ లోకి రాకుండా అడ్డుకోవడం చర్చగా మారింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల ధాటికి బిజెపి కూటమి తట్టుకోలేక పోతోందని అర్థమవుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించాల్సి వచ్చిందంటే మొత్తం బిజెపి కూటమి సెల్ఫ్ గోల్ లో పడిందనే చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. బిజెపి వారు రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నారంటే తప్పును సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లేనని ప్రచారం సాగుతోంది. గౌతమ్ అదాని వ్యాపార లావాదేవీలలో లంచాలు ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నారని అమరికా దర్యాప్తు సంస్థ తేలుస్తూ అక్కడి కోర్టుకు వివరాలు అందించడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందని, వెంటనే అదానీపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుబట్టింది. ఒకవైపు అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తుండగా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లో మరింత దుమారం లేపాయి.

అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలపై పార్లమెంట్ లోపల, బయట ఇండియా కూటమి నిరసనలు చేపట్టింది. భారత రాజ్యాంగ నిర్మాతను అవమాన కరంగా మాట్లాడిన అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కూటమి పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బయట నుంచి ఎంపీలు పార్లమెంట్ లోపలికి వచ్చే ద్వారం వద్ద మెట్లపై బిజెపి, దాని మిత్ర పక్ష ఎంపీలు కూర్చొని కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని బిజెపి కూటమి వారు నిరసనకు దిగారు. బుధవారం పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను అవమానించింది అమిత్ షా అన్న విషయం మరిచిపోయారా? సెల్ఫ్ గోల్ ప్రమోషన్ కోసం ఇలా ఎందుకు చేస్తున్నారు. మమ్మల్ని లోపలికి వెళ్లనీయండి అంటూ మెట్లపై అడ్డంగా కూర్చొన్న బిజెపి కూటమి ఎంపీలను ముందుగా రాహుల్ గాంధీతో పాటు మిగిలిన ఇండియా కూటమి ఎంపీలు అడిగారు. వారు అడ్డంగా కూర్చుని మెట్లపై నుంచి లేవకుండా నినాదాలు చేస్తుండటంతో కాంగ్రెస్ కూటమి వారు కూడా నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది.

ఈ తోపులాటలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కిందపడిపోయారు. రాహుల్ గాంధీ కూడా వెనక్కి పడిపోయారు. ఇరు వర్గాల ఎంపీలు తోపులాడుకోవడంతో శబరితో పాటు బిజెపికి చెందిన మరో ఎంపీ తలకు గాయాలయ్యాయి. దీంతో గొడవ ముదిరి పాకాన పడింది. తనను కూడా నెట్టి కింద పడేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తన బాధను వ్యక్తం చేశారు. ఇరు వర్గాల ఎంపీలు పార్లమెంట్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. పార్లమెంట్ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ ఖడ్ లకు ఇరు వర్గాల ఎంపీలు ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానిస్తూ బిజెపి వారు మాట్లాడింది కాక పార్లమెంట్ భవనంలోకి రాహుల్ గాంధీ తో పాటు కూటమి ఎంపీలను లోపలికి పోకుండా అడ్డుకున్నారంటే రాహుల్ గాంధీని చూసి బిజెపి వారు భయపడుతున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఖర్గే, రాహుల్ కాంబినేషన్ బాగా కుదరటంతో బిజెపి కూటమిని పార్లమెంట్ లో ఇండియా కూటమి గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. అంబేద్కర్ ను అవమానించడమంటే కోన్ని కోట్ల మంది బలహీన వర్గాల వారిని అవమానించడమేననే, రాజ్యాంగాన్ని అవమానించడమేననే వాదన ప్రజల్లోకి వేగంగా దూసుకుపోయింది. పదేళ్ల తరువాత మరో ఐదు సంవత్సరాలు బిజెపి కూటమికి అధికారం ఇచ్చిన ప్రజలు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఎక్కువ సమయం లౌకిక వ్యవస్థను బిజెపి వారు అవమానిస్తున్నారనే వాదన ఇండియా కూటమి నుంచి ఎక్కువైంది. దీంతో బిజెపి దిక్కుతోచని స్థితికి వెళ్లాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News