మోదీకి కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ఆంధ్రుల హక్కు మీద లేదు

ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం ఉండే జేడీ(ఎస్‌)రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. ఎన్డీఏకి ఊపిరి పోసిన టీడీపీ– జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయి.

Update: 2024-12-26 12:18 GMT

ప్రధాని మోదీకి కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ఆంధ్రుల హక్కు మీద లేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే అని మండిపడ్డారు. . విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే అని మండిపడ్డారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీకి ఆంధ్రుల హక్కు మీద లేదని, విశాఖ స్టీల్‌ను దివాలా తీయించే ఎత్తుగడలు ఢిల్లీలో సాగుతూనే ఉన్నాయి. మోడీ దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను చంపేసే కుట్రలు మోదీ ప్రభుత్వం చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు.

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్‌ ప్లాంట్‌కి రూ.15వేల కోట్ల సహాయం అందించారు. స్టీల్‌ ప్లాంట్‌ను బ్రతికించారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్‌ ప్లాంట్‌కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్‌ను ఆదుకోవడానికి మనసు లేదు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం ఉండే జేడీ(ఎస్‌)రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. ఎన్డీఏకి ఊపిరి పోసిన టీడీపీ– జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయి. కూటమికి చెందిన 18 మంది ఏపీ ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనమని మండిపడ్డారు.
జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గిందని, ప్లాంట్‌ దివాళా తీసే స్థాయిలో ఉందని, కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి స్టీల్‌ ప్లాంట్‌ను ఆదుకోవాలని కార్మికులు గత 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే... మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో మిట్టల్‌ స్టీల్‌ గురించి చర్చ చేస్తున్నారు. మిట్టల్‌ పెట్టబోయే ప్లాంట్‌కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడలట. ఇదెక్కడి న్యాయం? షర్మిల ధ్వజమెత్తారు.
కర్ణాటక స్టీల్‌ ప్లాంట్‌కి రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్లే.. ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్‌ స్టీల్‌కు కేంద్రం నిధులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని వెల్లడించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో వెంటనే విలీనం చేయాలి. 7 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలి. భవిష్యత్‌లో 20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి. ఇవి సాధించడం చేతకాకపోతే వెంటనే ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేనలు తప్పుకోవాలని షర్మిల డిమాండ్‌ చేశారు.
Tags:    

Similar News