రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తుంది - పి.వి. రమేష్
దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం విపరీతంగా పెరుగుతోందని రిటైర్డ్ ఐ ఏ ఎస్ డాక్టర్ పి.వి. రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో పరిస్థితులు..
నేటి పాలకులు రాజరిక వ్యవస్థ ధోరణులను కొనసాగిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని రిటైర్డ్ ఐ. ఎ. ఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ పేర్కొన్నారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాన వక్తగా ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అనేక అంశాలు అమలుకు నోచుకోలేదని పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో అర్థం కావడం లేదన్నారు. నేటి అధికార పార్టీ నేతలు దైవాంశ సంభూతులుగా భావిస్తూ రాజ్యాంగ ధర్మాన్ని పాటించడం లేదన్నారు. దేశంలో 50 శాతం అట్టడుగు ఉన్న ప్రజల చేతుల్లో కేవలం మూడు శాతం సంపద ఉంటే అగ్రభాగాన ఉన్న ఒక్క శాతం ప్రజల చేతుల్లో 50 శాతం సంపద కేంద్రీకృతమవటం వలన ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, అదే నేటి ప్రధాన సమస్య అన్నారు.
2047 నాటికి పట్టణ జనాభా ఆంధ్రప్రదేశ్ లో 50 శాతానికి చేరుకుంటుందని అదే సమయంలో పట్టణంలో మురికి వాడలు గణనీయంగా పెరుగుతాయన్నారు. అందరికీ విద్య, వైద్యం , పౌష్టిక ఆహారం అందించడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలకు రంగులు వేస్తే, బిల్డింగులు నిర్మిస్తే మాత్రమే విద్యారంగం అభివృద్ధి కాదని ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల ను నియమించుకోవాలన్నారు.
ఏడవ తరగతి విద్యార్థులు రెండవ తరగతి పాఠాలను చదవలేని స్థితిలో ఉన్నారన్నారు. విద్యావంతులైన నేటి యువతలో మూడవ వంతు నిరుద్యోగులుగా కొనసాగుతున్నారన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ చట్టాన్ని రూపొందించాలని ,అందరికీ ఆరోగ్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వాలు స్వీకరించాలన్నారు. కర్ణాటకలో మాదిరిగా ప్రతి గ్రామంలో ఆధునిక గ్రంథాలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కులాలు , మతాలు, వర్గాలు , రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఒకే చోట చేరే సాంస్కృతిక కేంద్రాలుగా వికసించాలని కోరారు.
దేశంలో ఆంధ్ర , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక ఎన్నికల వ్యయమతుందని రాజకీయ అవినీతి గణనీయంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ రాజకీయాలలో సేవా తత్పరత తగ్గి, ధనార్జన కేంద్రాలుగా మారాయని విమర్శించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయలేదని ,పెద్ద పరిశ్రమలు రాలేదని పెట్టుబడుల ను ఆకర్షించే దిశగా అడుగులు వేయలేదన్నారు.