అమ్మయ్యా, గండం గడిచింది, అంతర్వేది వద్ద తుపాను తీరాన్ని దాటింది!

అనేక మలుపులు తిరుగుతూ సాగిన మొంథా తుపాను ఎట్టకేలకు అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని దాటింది. అయినప్పటికీ మరో నాలుగు గంటలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

Update: 2025-10-28 17:42 GMT
హడలెత్తింతిన మొంథా తుపాను తీరాన్ని దాటింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడ నుంచి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కరస్పాంటెండెంట్ జీపీ వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం ప్రకారం కాకినాడ వద్ద సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ హార్బర్ మూతపడింది. ఇప్పుడిప్పుడే పెనుగాలులతో కూడిన వర్షం మొదలైంది.

తుపాను తీరాన్ని దాటినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుఫాన్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మొంథా తుఫాన్‍పై మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు సూచనలు చేస్తున్నారు. ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలని సీఎం సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు..

తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై రకరకాల మలుపుతిరుగుతూ వచ్చింది మొంథా.. చివరకు ఊహించిన దానికి కాస్తంత ఎడంగా అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని దాటింది. ప్రభుత్వ ప్రచారం ఫలితంగా ఎక్కడా ఎటువంటి ప్రాణహానీ జరుగలేదు. ఆస్తి నష్టం కూడా ఇంకా నమోదు కాలేదు. మరో నాలుగైదు గంటలు దాటితే వాస్తవ పరిస్థితి తెలిసే అవకాశం ఉంది.
తీరాన్ని దాటిన తర్వాత బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ పత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి.ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అంతకుముందు ఏం జరిగిందంటే..
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుపాన్ వేగంగా తీరానికి చేరుకుంటోంది. వాతావరణశాఖ తాజా సమాచారం ప్రకారం, గడిచిన గంటలో ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలింది. తుపాన్ మచిలీపట్నం నుంచి 70 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 150 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ లెక్కన చూస్తే తుపాను బందరు (మచిలీపట్నం) వద్ద తీరాన్ని తాకవచ్చునని భావించారు.
అనధికార అంచనా ప్రకారం, తుపాన్ ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో మచిలీపట్నం సమీప తీరాన్ని తాకే అవకాశం ఉందని భావించినా చివరకు అంతర్వేది పాలెం వద్దనే తీరాన్ని దాటింది.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీరానికి దగ్గరగా రాగానే తుపాన్ తీవ్రత మరింత పెరగనుంది.
వచ్చే 24 గంటల్లో గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొండప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారి జగన్నాథకుమార్ తెలిపారు.
హెచ్చరికలు జారీ
కాకినాడ పోర్టు వద్ద 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం, గంగవరం: 9వ నంబర్ హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం: 8వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. వాతావరణశాఖ తెలిపిన ప్రకారం, తుపాన్ తీరం దాటే సమయంలో సుమారు గంటన్నరపాటు అత్యధిక ప్రభావం ఉంటుంది.
Tags:    

Similar News