మోంథా తుపాను కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం వద్ద తీరం తాకింది.
గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలి చివరకు కొద్ది సేపటి కిందట తీరం తాకిందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. అయితే, పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పడుతుంది. పొద్దుటి నుంచి ఎటుపోతుందో తెలియకుండా తుఫాన్ గందరగోళ పరిచింది. నిజానికి రాత్రి 9 గంటల దాకా రాత్రి 11 తర్వాతే తీరం తాకుతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే, ఉన్నట్లు అంతర్వేది పాలెం వైపు దూసుకువచ్చింది.
బాపట్ల పట్టణంలోని భావన లాడ్జి ఎదురుగా ఉన్న చెట్టు కూలడంతో భావన్నారాయణ స్వామి గుడి ప్రహరీ గోడ విరిగి పడిపోయింది
రాబోయే 8 నుంచి 10 గం. భారీ వర్షాలు, గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10CM-20CM వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. 6-7 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందన్నారు.
బుధవారం ఏం జరుగుతుంది: శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి,విశాఖ, అనకాపల్లి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 28, 2025
కాకినాడ సమీపంలో తీరం దాటునున్న
తీవ్రతుపాన్ కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురగాలులు
ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి
ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
తీవ్రతుపాన్ వల్ల కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి ఈ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
మోంథా ప్రభావం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా
శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న తొమ్మిది జిల్లాల్లో మొంథా ప్రభావం ఉంటుందని, ప్రధానంగా కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని కోస్తాంధ్ర 9 జిల్లాల తుపాను ప్రత్యేకాధికారి, రాష్ట్ర స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ చెప్పారు. 9 జిల్లాల్లో 554 క్యాంపులు ఏర్పాటు చేశామని, 31,600 మందిని తరలించామన్నారు. కోనసీమ జిల్లా వాసులు బైటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నామన్నారు. కొబ్బరి, పామ్ ట్రీలు విరిగిపడే ప్రమాదం ఉందని, కోనసీమలో పవర్ సప్లైకి విఘాతం కలిగే అవకాశం ఉందని అజయ్ జైన్ పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 18 వేల విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. కోనసీమ జిల్లా మామిడికుదురులో చెట్టుపడి 48 ఏళ్ల మహిళ దురదృష్టవశాత్తు మృత్యువాత పడిందని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన మినహా ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. మరీ అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రతి చోటా తక్షణ సహాయక బృందాలను అందుబాటులో ఉంచాం: జిల్లా కలెక్టర్
27వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు విశాఖపట్టణం జిల్లాలో 147 మి.మీ. వర్షపాతం నమోదైందని, 28వ తేదీ ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.00 గంటల వరకు 1.3 సెం.మీ. వర్షపాతం నమోదైందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారంతో పోల్చితే మంగళవారం జిల్లాలో వర్షపాతం తగ్గిందని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో జోన్ కు రెండేసి చొప్పున క్యూ.ఆర్.టి. బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలను, డ్రెయిన్లలో పూడికను తొలగిస్తున్నామని వివరించారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 8 క్యాంపుల్లో 144 మంది పునరావాసం పొందారని వివరించారు. ములగాడ, సీతకొండ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయని, ఇతర చోట్ల రాళ్లు జారాయని పేర్కొన్నారు. మేఘాద్రి గెడ్డలో 6,000 క్యూసెక్కులు ఇన్ ఫ్లో, 7,000 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందని చెప్పారు. జిల్లాలోని 14 చెరువులు ప్రమాదరకర స్థితిలో ఉన్నాయని, ప్రజలను అప్రమత్తం చేయటంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు.