మన్ననలు పొందుతున్న మునగ ప్రయోగం

పౌష్టిక విలువలు, ఔషద గుణాలు పుష్కలంగా ఉన్న మునగ ప్రయోగం అంగన్‌ వాడీ కేంద్రాల్లో చేపట్టారు.

Update: 2024-08-04 06:53 GMT


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో మునగ ప్రయోగం అందరి మన్ననలు పొందుతోంది. మునగకు సంబంధించిన ఆహార పదార్థాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించడం ద్వారా రక్త హీనత సమస్యలను, పౌష్టికాహార లోపాన్ని అధికమించేందుకు ఉపయోగపడుతుందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో తొలి సారిగా ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ మునగ ప్రయోగం చేపట్టారు. గత రెండేళ్లుగా దీనిని అమలు చేస్తున్నారు. నాటి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలలో రక్త హీనతను, పౌష్టిక ఆహార లోపాన్ని అధికమించేందుకు ఏమి చేస్తే బాగుంటుందని నిపుణులతో చర్చించిన అనంతరం మునగ వైపు మొగ్గు చూపారు. జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో మునగ చెట్టును పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మెనూలో మునగ ఆకు, మునగ కాయలను విధిగా చేర్చుతూ ఆహార పదార్థాలను అందించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. వారంలో కనీసం రెండు, మూడు పర్యాయాలైన మునగ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందిని ఆదేశించారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో మునగ వినియోగం విరివిగా పెరిగింది.

Delete Edit

జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో మునగ చెట్టును నాటడంపై ఐసీడీఎస్‌ అధికారులు దృష్టి సారించారు. ఎన్జీఆర్‌ జిల్లాలో మొత్తం 1475 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 582 ప్రభుత్వ భవనాలు కాగా, తక్కిన 892 సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి కేంద్రంలో కనీసం ఒక మునగ చెట్టు పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు. అర్బన్‌ ఏరియాలోని సెంటర్లలో పెంచడం కాస్త ఇబ్బందిగా మారింది. సరిపడిన మేరకు స్థలం అందుబాటులో లేక పోవడంతో ఇది తలెత్తింది. అయినా విజయవాడ నగరంలోని మాచవరం వంటి కొన్ని ప్రాంతాల్లో కుండీల్లోనే మునగను పెంచే ప్రయత్నాలు చేపట్టారు.

Delete Edit

అయితే డిసెంబరు, జనవరి, ఏప్రిల్, మే నెలలో కురిసిన వర్షాలు, వీచిన ఈదుర గాలులకు కొన్ని ప్రాంతాల్లో మునగ చెట్లు పడిపోయాయి. కొన్ని చోట్ల విరిగి పోగా, మరి కొన్ని చోట్ల నేలకొరిగాయి. దీంతో వీటిని తిరిగి నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం వర్షా కాలం సీజన్‌ కావడం, చెట్లు పెరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో ప్రతి సెంటర్‌లోను మునగను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్టీఆర్‌ జిల్లాకు నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన గుమ్మళ్ళ సృజన కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రెండు దఫాలుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మునగ చెట్ల పెంపకం, ఆహార పదార్థాల్లో మునగను విధిగా చేర్చడంపైన ఐసీడీఎస్, విద్యా శాఖ, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇది వరకు మాదిరిగానే మునగకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆదేశించారు.

Delete Edit

అన్ని ఆకు కూరల కంటే మునగ ఆకులో విశేషమైన గుణాలను కలిగి ఉంటుంది. పౌష్టిక గుణాలతో పాటు ఔషద గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి విశిష్టమైన స్థానం ఉంది. మునగను అమృతంలా భావిస్తారు. 300 రోగాలను నయం చేస్తుందని ఒక ప్రతీతి కూడా ఉంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ను కూడా క్రమబద్దం చేస్తుంది. మునగ ఆకులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం విరివిగా ఉంటాయి. ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ ఎ, సీ, బీ కాంప్లెక్స్, బీటా–కెరోటీన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్‌లు పుష్కలంగానే ఉంటాయి. వీటితో పాటుగా 40 కంటె ఎక్కువ రకాలైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఐసీడీఎస్‌ ఎన్టీఆర్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ జి ఉమాదేవి తెలిపారు.

ఇన్ని పౌష్టిక విలువలు, ఔషద గుణాలు కలిగిన మునగ పదార్థాలను తీసుకోవడం వల్ల బాలింతలు, గర్బిణీలు, చిన్నారులలో రక్త హీనత, పౌష్టికాహార లోపాన్ని అధికమించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అందుకే దీనిని తమ కేంద్రాల్లో పెంచుతున్నట్లు ఐసీడీఎస్‌ ఎన్టీఆర్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ జి ఉమాదేవి తెలిపారు. కొన్ని కేంద్రాల్లో మునగ పౌడర్‌ను కూడా తయారు చేసి అందస్తున్నట్లు చెప్పారు. మునగను అంగన్‌వాడీల్లో వినియోగం మొదలు పెట్టిన తర్వాత తల్లులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల్లో ఎంతో మెరుగుదల కనిపించిందని తెలిపారు. తాము తరచుగా నిర్వహించే హిమోగ్లిబిన్ శాతం, బరువు, పెరుగుదల వంటి పరీక్షల్లో అధిక శాతం మందిలో మెరుగుదల కనిపించినట్లు ఉమాదేవి చెప్పారు.
మునగతో చాక్లెట్లను కూడా తయారు చేసారని, వీటిని హెల్త్‌ ప్రోగామ్స్‌లో వీటిని కూడా ప్రదర్శనల్లో పెట్టారని, వీటికి మంచి స్పందన లభించిందని, గతేడాది మైలవరంలో దీనిని చేపట్టారని వివరించారు. మునగ ఆకు నుంచి జూస్‌ తీసి, దానిని కాస్త బాయిల్‌ చేసి, నువ్వులు వంటి పౌష్టిక విలువలు కలిగిన విత్తనాలను కలిపి చాక్లెట్ల వంటి రుచికరమైన రెస్పీని తయారు చేశారని తెలిపారు. ఇలాంటవన్నీ తిరిగి తయారు చేయించి, అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని ఉమాదేవి తెలిపారు.
Tags:    

Similar News