సీఎంగా విశాఖలోనే ప్రమాణం చేస్తానంటున్న జగన్..

ఆంధ్రా రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి తన పరమాణ స్వీకారం విశాఖలోనే జరుగుతుందని తేల్చి చెప్పారు. రాజధాని విషయంలో సీఎం జగన్ పట్టుదల.

Update: 2024-03-05 10:37 GMT
విశాఖ పర్యటనలో ప్రసంగిస్తున్న సీఎం జగన్

తంగేటి నానాజీ, విశాఖపట్నం



సీఎం జగన్ ఎట్టకేలకు తేల్చేసినట్టేనా, ఏపీ రాజధాని ఏదో చెప్పినట్టేనా? మందీ మార్భలంతో వైసీపీ ప్రభుత్వం తరలివస్తున్నట్టేనా? అంటే అవుననే సమాధానమే వచ్చింది సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడుస్తున్నా ఏపీ రాజధాని అంటే ఏదీ అనే దానికి జవాబు చెప్పడానికి వెనకాముందవుతున్న ప్రజానీకానికి స్పష్టత వచ్చినట్టేనని వైసీపీ నేతలు సంబరపడుతుంటే అదంతా సులువేం కాదని వైరి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు వీలు లేదంటూ రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినప్పటికీ... జగన్ సర్కారు మాత్రం మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ వ్యవహారం కోర్టుకి చేరింది. తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ మళ్లీ ఫ్యూచర్ రాజధాని విశాఖ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్లలో కానీ రాజధాని ఫ్యూచర్లో అవుతుందా....

విశాఖను పరిపాలక రాజధాని చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతోనే ఉన్నారని ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా... పార్లమెంటు అమరావతే రాజధాని అని స్పష్టం చేసినా.. విశాఖ నుంచి పాలన సాగిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ విశాఖే నా రాజధాని అంటూ వ్యాఖ్యలు చేశారు."వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పాలన సాగిస్తా...మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తా...విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటా అంటూ విజన్ విశాఖ_ ఫ్యూచర్ వైజాగ్ పేరిట విశాఖలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలు సదస్సులో కుండబద్దలు కొట్టారు.




 


బెంగళూరు కంటే విశాఖపట్నమే రైటు..
విశాఖలో జరిగిన విజన్ విశాఖ ఫ్యూచర్ వైజాగ్ పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపై వరాలు కురిపించారు."హైదరాబాద్ కంటే భిన్నంగా వైజాగ్ అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయాం. అభివృద్ధిలో విశాఖ నగరం దూసు కెళ్తాంది. సువిశాల సాగర తీరంలో ఎన్నో పోర్ట్లు అభివృద్ధి పరిచాం. బెంగళూరు కంటే వైజాగ్ లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి.విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా మారుస్తాం’ అన్నారు సీఎం.

ఇప్పుడు గుర్తుకువచ్చిందా జగన్?
జగన్ ప్రసంగం ముగిసీ ముగియక మునుపే విపక్షాలు సీఎంపై విరుచుకుపడ్డాయి. విజన్ విశాఖ- ఫ్యూచర్ వైజాగ్, పారిశ్రామికవేత్తల సదస్సులు ఇప్పుడు గుర్తుకువచ్చాయా అంటూ విమర్శనాస్త్రాలు సంధించాయి. వైసీపీ సర్కార్ కు ఐదేళ్లలో గుర్తురాని విజన్ ఎన్నికల ముందు గుర్తొచ్చిందా అంటూ ఎద్దేవా చేశాయి. ఉత్తరాంధ్ర పై ముఖ్యమంత్రి జగన్ సవత తల్లి ప్రేమ వలకబోస్తున్నారంటూ ఉత్తరాంధ్ర సీనియర్ నేత జనసేన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ అంటే ఇది ఎన్నికల స్టంటని టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు అన్నారు.
"విశాఖను దోచుకోవడం తప్ప అభివృద్ధి పరచడం కూడా ఈ ప్రభుత్వానికి వచ్చా... వైసీపీ నేతల దోపిడీపై మేము న్యాయపోరాటానికి వెళ్తున్నాం... ఇప్పుడు సడన్ గా పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించి విశాఖను అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు... ఇది ఎన్నికల స్టంట్ గా జనసేన భావిస్తుంది" అన్నారు కొణతాల రామకృష్ణ. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా రాజధాని ఏదో తేలడానికి మరో 40,50 రోజులు ఆగాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి అటు అమరావతి ఇటు విశాఖపట్నం ప్యూచర్ ఆధారపడి ఉంటుందనేది సత్యం.


Tags:    

Similar News