మోదీ మైకు ఫెయిల్ అయితే పోలీసులపై ఫిర్యాదు ఎందుకు?

ప్రజాగళంలో పోలీసుల తీరుపై నాదెండ్ల మనోహర్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Update: 2024-03-18 09:06 GMT
Source: Twitter

చిలకలూరి పేట బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పలువురు సభికులు లైటింగ్ టవర్లు ఎక్కిన ఘటన సభలో కీలకంగా మారింది. ఆ సమయంలో వారిని దించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ చెప్పినా పోలీసుల అంతగా స్పందించలేదు. ఈ అంశంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో పోలీసుల వ్యవహారం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. కేవలం లైటింగ్ టవర్ల విషయంలోనే కాదని సభకు విచ్చేసిన వారిని నియంత్రించడంలో కూడా పోలీసులు సరైన రీతిలో చర్యలు తీసుకోలేదని అన్నారాయన. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన తన అనుమానాలను వ్యక్తం చేశారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్ పాసులను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు నాదెండ్ల మనోహర్.


నాలుగేళ్ల కృషికి వచ్చిన ఫలితం

నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ చేస్తున్న కృషికి నిన్నటి సభతో ఫలితం దక్కిందని అన్నారు నాదెండ్ల మనోహర్. ‘‘త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు పవన్ కల్యాణ్. టీడీపీ-జనసేన-బీజేపీ కలయిక రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంది. వైసీపీ పాల్పడిన అవినీతిని ప్రధాని మోడీ.. రాష్ట్ర ప్రజల ముందుంచారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తాం. పోలీసుల నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. పలుసార్లు మైక్ కట్ అవడం అందులో ఒకటి. పోలీసుల వ్యవహారంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం. పొత్తు వల్ల ఎన్నికల సీటు దక్కని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాం. ఎవరూ టికెట్ రాలేదని నిరాశ చెందొద్దు. అందరికీ న్యాయం తప్పకుండా చేస్తాం’’అని చెప్పారాయన.

అవన్నీ అసత్య ప్రచారాలే

బొప్పూడిలో ఏర్పాటు చేసిన ‘ప్రజాగళం’ సభ పూర్తి వైఫల్యంగా నిలిచిందని జోరుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని నాదేండ్ల స్పష్టం చేశారు. తమ సభను చూసి కడుపు మండిన వారే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తమ సభను చెడగొడ్డటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సభ అద్భుతంగా జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభలో అగ్రనేతల ప్రసంగాలకు అద్భుతమైన స్పందన లభించిందని, వైసీపీ రాక్షస పాలనను పవన్, చంద్రబాబు ఎండట్టారని తెలిపారాయన.


Tags:    

Similar News