మహానంది నుంచి అహోబిలం... నల్లమల యాత్ర

ఆలయం చుట్టూ నిర్వహణా నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది. అయితే, అదొక చిన్న లోపాలుగానే చూస్తే అద్భుతమైన పకృతి సౌందర్యం ఎటు చూచినా ఆశ్చర్యపరుస్తుంది.

Update: 2024-09-11 10:09 GMT

మహానందిలో నల్ల,తెల్ల నందీశ్వరులుఅహోబిలంకు కొంచెం ధైర్యం, కొంచెం అనుమానంతోనే బయలుదేరాను. ఎక్కగలనా? లేదా? పడి కాళ్లు చేతులు విరకొట్టుకుంటే మళ్లీ యాత్రలకు వెళ్ళలేనన్న భయం ఉంది. కొండలు గుట్టలు ఎక్కిన అలవాటు ఉంది. ఐజ్వాల్ పీక్ హైట్ ఎక్కిన ధైర్యం ఉంది. పకృతి అంటే ఇష్టం ఉంది. అక్కడి ప్రజల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. వీటన్నిటి ముందు ఆ భయం ఎగిరిపోయింది. గుంటూరు ట్రిక్కింగ్ కింగ్స్ బాధ్యుడు పుల్లారావుగారు కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆరోగ్యం గురించి షుగర్ గురించి అడిగారు. ఏమైంది ఎక్కగలిపితే ఎక్కుతా? లేనప్పుడు ఆగిపోతా అన్నాను. అయినా సిక్స్టీ ప్లస్ లాగా ఉండను అన్నాను. సరే రమ్మన్నారు.




 గుంటూరులో 23..8..24న 11 గంటలకు ట్రైన్ ఎక్కాం. బండి ఆగుతూ, వేగంఅందుకుంటూ దిగుమెట్టకు వెళ్ళాం. ఆ చీకటిలో దిగుమెట్ట దాటిన తర్వాత సొరంగం నుండి వెళుతుంది రైలుబండి. టన్నెల్ టన్నల్ అంటు ఆస్వాదించాం. మాలో ఎవరో అద్భుతమైన ఫోటో తీశారు. ఇక్కడ నుండి నల్లమల్ల, ఆస్వాదించడం రెండు ప్రారంభమైనాయి. రైలు దిగిన దగ్గర నుండి వ్యానులోకి ఎక్కేదాకా అందరిని పరిశీస్తూ, వాళ్ళ చతుర్లను, దారంతా తెలతెలవారుతున్న ప్రకృతి సౌందర్యాన్ని టీవీ యాడ్ లాగ తల బయటపెట్టి ఆస్వాదిస్తున్న. 

వ్యాన్ దిగగానే లోపల కోనేరు ఉంది అక్కడికి వెళ్తారా? లేకపోతే రూమ్ కి వెళ్లి రెడీ అయి వస్తారా అని టీం లీడర్ అన్నారు. కోనేరు అంటే అన్ని గుళ్ళలో లాగా మురికి మురికి గా ఉంటుందని, నేను ఇద్దరమ్మాయిలు రూమ్ కి వెళ్లి వస్తామన్నాం. అయితే ఇక్కడ ఓ చిన్న పొరపాటు జరిగింది. 15 ఏళ్లుగా పిల్లలకు, బ్రహ్మ విష్ణు రుద్ర గుండాల గురించి పాఠాలు చెబుతూ, వాటిని చూడాలని దిగి నీటిలో విహరించాలని కలలు కన్నాను. వీటి గురించి అడగకుండా (గుడి బయట ఎక్కడో ఒక నదిలా ప్రవహిస్తాయనుకొన్నాను.) ఉదయాన్నే గుడిలో ఒత్తిడి తక్కువగా ఉంటదని హడావుడిగా రెడీ అయ్యి వచ్చాము. గుడి అంతా తిరిగి బయటికి వచ్చే ముందు అక్కడున్న ఓ ఉద్యోగిని వాటి గురించి అడిగితే అవే అన్నాడు.


మహానంది లో నంది


అప్పుడు అయ్యో! ఇన్ని రోజుల నుంచి ఈ గుండాల కోసమే కదా! చూడాలనుకున్నదని చాలా నీరసపడ్డాను. ప్రధాన గుడిలో ప్రవేశించగానే (స్నానాలు చేస్తూ, బట్టలు జాడిస్తూ ఉన్న రెండు కోనేరులు చూసి అమ్మో! ఈ కోనేరులో చేయకపోవడమే మంచిదనుకున్నాం.) ఎడమవైపు బ్రహ్మగుండం కుడివైపు విష్ణుగుండాలు ఉన్నాయి ఇంకొద్దిగా లోపలికి వెళితే, రుద్రగుండం ఇంకొంచెం లోతుగా ఉంది. మళ్లీ లోపలికి వెళ్లి గుండాల్లో కాళ్లు పెట్టి, పరిశీలించి నీరు ప్రవహిస్తున్నట్లుగా, ఆ నీటిలో వేసిన నాణేలు స్పష్టంగా కనిపించడం చూసి, నీటిలో మునగనందుకు మరీ బాధపడ్డాను. మా వజ్రేస్వరి  ఫోన్ చేసి కోనేరు ఎలా ఉందని అడిగినా బాగాలేదు రూమ్ లోనే స్నానాలు చేసి రండని చెప్పాను. ఇలా చెప్పినందుకు బయటికి వచ్చిన తర్వాత, వాటి గురించి నాకు తెలియదని సారీ చెప్పాను. ఈ గుండాల గురించి ఎందుకు ఇంత విపులంగా చెప్తున్నానంటే మరొకరు వాటి గురించి తెలుసుకుంటారని.

ఈ రెండు గుండాలు దూర దూరంగా ఉండటంతో గుడి ఎంట్రన్స్ లో కుడి మగవారికి ఎడమ ఆడవారికి ఏర్పాటు చేశారు. చిన్నగానే ఉన్నవి. బట్టలవి మార్చుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి. కాకపోతే మన వారికి శుభ్రంగా ఉంచడం కన్నా బట్టలు జాడించడం ముఖ్యం అనుకుంటారు. అయితే ఈ నీళ్లు స్టాగ్నెట్ కాకుండా ప్రవహిస్తూ ఉన్నాయి. కనుక శుభ్రంగా తేటగా ఉన్నాయి. పురాతన గుండాలు ఎక్కడున్నాయని ఎంక్వయిరీ మొదలు పెట్టాను. (మొత్తం ఐదు గుండాలు ఉండెవంట.) గుడి బయట ఉన్నాయన్నారు "కాళీప్రసాద్ ను" తోడు తీసుకుని గుడి ప్రహరీ చుట్టూ ఎంక్వయిరీ చేస్తూ బ్రహ్మ విష్ణుగుండాలను చూసాము. ఆ నీళ్లు, చుట్టూ వాతావరణం చాలా మురికిగా ఉంది. బాటిల్స్ చెత్తతో ఉన్నాయి. ఇవి పురాతన గుండాలు. అడుగు అడుగున నిర్లక్ష్యమే కనిపిస్తుంది. 




నల్లమల్ల కొండల్లో పకృతి సౌందర్యంలో వెలిసిన శైవ క్షేత్రం ఇది. ఆలయం చుట్టూ 9 నదులు ఉన్నాయి. రెండు మహానందిలోనే ఉన్నాయి. గుడిలో ఉన్న నంది క్రింద నుంచే ఊరుతున్న వూటలు ప్రవహించి మహానంది పొలాలన్నిటిని సస్యశ్యామలం చేస్తున్నాయి. గుడి చరిత్ర, నిజ నిజాలు జోలికి పోను. ఇక్కడ శివలింగం, భూమికి మూరేడు ఎత్తున, కుడివైపున ఆవుగిట్ట లాగా తొక్కినట్లు కనిపిస్తుంది. పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని చాణక్యరాజులు ఏడో శతాబ్దంలో నిర్మించారట. శిల్పాలను రససిద్ధుడనే శిల్పి చెక్కినట్లుగా ఆధారాలను బట్టి తెలుస్తుంది.


 గుడిలోని, కామేశ్వరి అమ్మవారి గుడి 16 స్తంభాల మీద, ఒకదాని మీద ఉన్న శిల్ప సంపద మరొక దాని మీద లేదు. రాతి కప్పు మీద వేరు వేరు శిల్పo ఉంది. మధ్యలో నాలుగు స్తంభాల పైన ఉన్న కప్పు అద్భుతమైన శిల్పసంపదతో ఉంది. సరస్వతి వీణ వాయిస్తున్న విగ్రహం, నగిశీలు అలనాటి శిల్పుల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.

ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవుల శిల్పాలు, వారు ప్రతిష్టించిన విగ్రహాలున్నాయి. నాగ శివలింగం చెట్టు, పువ్వులు తమాషాగా బాగున్నాయి. దేవగన్నేరు మరికొన్ని మొక్కలు కళకళలాడుతున్నాయి. వినాయక నందీశ్వర ఆలయంలో వినాయక విగ్రహం వెనుక పాము పడగా పైన శివుడు ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకత ఇది. దేవస్థానం వారు పెట్టిన ప్రసాదం చాలా బాగుంది. గోశాలలో మిగతా చోట్లలా బక్క చిక్కకుండా, "గోవులకు పెట్టే ప్రసాదం" (మెతకట్ట 20 రూపాయలు) భక్తుల నమ్మకంతో ఆవులు కళకళలాడుతున్నాయి. ఇది నాకు చాలా చాలా నచ్చింది.




 కోదండ రామస్వామి, అభయ ఆంజనేయ స్వామి, శనీశ్వరుడు పూజలకు వివిధ రేట్లు ఉన్నాయి. గోపూజ..150రు. 1950..53 ప్రాంతంలో గుడి చుట్టూ ప్రధాన నిర్మాణాలు జరిగాయట. అయితే గుడిలో భక్తి కన్న అశ్రద్ధ, నిర్లక్ష్యం, డిమాండింగు స్పష్టంగా ఫ్యూన్ నించి పూజారి వరకు కనిపిస్తున్నది. భక్తి కన్న పూజల పేరుతో భక్తులను దండుకోవడం కనిపిస్తున్నది. ఇవి చిన్నచిన్న లోపాలుగానే చూడాలి. ఈ లోపాలకన్నా అద్భుతమైన పకృతి సౌందర్యం ఎటు చూచినా.




తెలతెలవారకట్ల ఈ పకృతి సౌందర్య ప్రేమలో పడిపోయాను. చుట్టూ ఆకుపచ్చటి కొండలు, లేలేత ముబ్బులు, ఆ మబ్బుల్లో నుంచి తొంగి చూస్తున్న బాల సూర్యుడు. మహానంది నుండి దారంతా పచ్చటి వరచేలు. వాటి నుండి వచ్చే చల్లటి పైరగాలి. మా దగ్గర మహానంది అరటి పండ్లు అంటూ అమ్ముతారు. అరటి తోటలు ఎలా ఉంటాయో చూద్దామని వ్యాన్ కిటికీలోనుంచి కనుచూపుమేరా కళ్లింత చేసుకుని కరువు తీరా చూస్తున్నాను. తోటలు పెద్దగా కనిపించలేదు. కానీ లేత పచ్చటి లేత వరిచేలు అంత మంటూ లేకుండా కనుచూపుమేరా కనిపించాయి. పంటకాలవులు కనిపించకుండా ఈ పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయొనని బాగ ఆశ్చర్యం వేసింది.

 ఎగువ అహోబిలం ఎక్కబోయే ముందుగా గుంటూరు ట్రెక్కింగ్ గ్రూప్ గురించి ఓ మాట చెప్పకుండా ఉండలేను. ప్రకృతి, ఆధ్యాత్మికత, శిల్పము కన్నా అందరూ కలిసి ఉన్నారా? సంతోషంగా ప్రయాణం సాగిందా? ఎంత సంతోషాన్ని అనుభవించారు? అవి పొందిన దాన్నిబట్టి మన ముందు ప్రయాణాలు ఉంటాయి. అలాంటి స్పూర్తినిచ్చింది ఈ గ్రూపు. గ్రూపులో ఉన్న వాళ్ళందరూ ఇరవై 35 ఏళ్ల వాళ్లే. (బయటనుంచి వెళ్లిన మేము తప్ప). అందరం వయసెను మర్చిపోయి ఎంజాయ్ చేసాము పెళ్లి కానీ పిల్లలు వాళ్ళ జుట్ల మీద, బట్ట తలల మీద,పెళ్ళిళ్ళ మీద కూడా జోకులేసుకున్నారు. అబ్బో! అమ్మాయిలు బాగా డబ్బులు ఉంటే చేసుకుంటారులే మేడం అన్నారు నేను నవ్వుతున్నానని.





 అఖిల్, సృజన, మహేష్ లు వర్షం పడి మొకాటి లోతు బురద గుంటలలో ఇరుకైన అడవి మార్గాన జీబ్ లో ఎనిమిది కి.మీ. పొడవునా ఎంత అడ్వెంచర్ చేశారు. ఎంత అల్లరి చేశారు. వాళ్లతో పాటు మిగిలిన మేము కూడా. వాళ్ళ అడ్వెంచర్స్ ను ఆనందాన్ని మేము అనుభవించాం. చెప్పాలంటే ఇది నిజమైన అడ్వెంచర్. అల్లరే కాదు దానికి మించి బాధ్యతగాను ఉన్నారు. మా పుల్లారావు గారు అయితే చాలా ప్రశాంతంగా అడవి క్లినరగా (కనబడిన కాగితాన్ని బాటిల్స్ ను బ్యాగులో వేసుకుంటూ) హెల్పర్ గా (బయట వాళ్లకు కూడా మంచినీళ్లు పెయిన్ బాంబ్స్ ఇస్తూ) ఉన్నాడో! కోపం వచ్చినప్పుడు ఉగ్రనరసింహుడు లాగా కేకలు వేశాడు. టీం పట్ల చాలా బాధ్యతగా ఉన్నాడు. ఒక్క మాట అని ఇంతనా?

అహోబిలం..

నవనారాసింహ క్షేత్రాలు కర్నూలు జిల్లా నంద్యాలకు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుండి చిత్తూరు వరకు వ్యాపించిన నల్లమల్ల అడవులలో సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ప్రకృతి సౌందర్యంతో మనోహరంగా ఉంది. ఎక్కువ ఆహోబిలం, దిగువ ఆహోబిలం అను రెండు భాగాలుగా ఉన్నది. ఎగువ అహోబిలంలో.. 1.జ్వాల 2. ఉగ్ర 3. మాలోల 4. వరాహ 5. భార్గవ 6. పావన

దిగువ అహోబిలంలో...7. కారంజ 8. యోగానంద 9. చత్రవట నరసింహా ఆలయాలు ఉన్నాయి. తొమ్మిది నరసింహారూపాలు తొమ్మిది గ్రహాలకు అధిపతులట. ఈ చరిత్రలన్నీ అందరికీ తెలిసినవే. కానీ, కారంజ ఏమిటి అంటే? కారంజ చెట్టు కింద నరసింహ అని పంతులుగారు చరిత్ర చెప్పాడు. ఆ చెట్టు ఏది అని అడిగితే గానుగ చెట్టు చూపించారు. ఇది కాదు అనుకున్నాము. యోగానంద ఎమిటి? అని అడిగితే పంతులుగారు, ప్రహ్లాదునికి విద్య చెబుతున్నప్పుడు కాళ్లు భూమిని తాకకూడదని పాము తలపై ఆసన రూపంలో ఉండి చెప్పాడట. ఈయన గారికి చాలా కోపమట. బోధిస్తున్నప్పుడు ప్రహ్లాదునిపై ఏమన్నా కోపం చేస్తాడేమో అని భయం కొద్ది లక్ష్మీదేవి (ఆమెకు కూడా భయమట) నరసింహుడికి కనపడకుండా ఎదురుగా ఉన్న మారేడు చెట్టును ఆవహించేదట.


ఉగ్రనరసింహ ఆలయ శిల్పకళ.


 


లక్ష్మీదేవిని చూస్తూ సంతోష పడుతూ ప్రహ్లాదునికి ప్రశాంతంగా విద్యను బోధ చేశాడట. కథకన్నా పిల్లల పట్ల లక్ష్మీదేవి ప్రేమ నాకు చాలా నచ్చింది. హిరణ్యక్షణ ని వధ తర్వాత ప్రహ్లాదుడు ఏమయ్యాడు అనే డౌటు ఉండేది నాకు.అది తీరిపోయింది. చత్రవట అంటే గొడుగు లాంటి మర్రి చెట్టు కింద నరసింహా స్వామి స్వయంభుగా వెలిశాడట. అహోబిలం అంతా పకృతి సౌందర్యంలో నల్లమల్ల అందాలలో ట్రెక్కింగ్ పాయింట్ గా సాహస, సౌందర్య విహారయాత్రగా ఉంది. ప్రధానమైన గుడి ఉగ్రలక్ష్మీ నరసింహ ఆలయం. ఈ ఆలయం 30 అడుగుల ఎత్తులో 1001 సంభాల మీద ఉన్నదట. 120 స్తంభాల వరకు లెక్కించాను. అన్ని లేవు అని మా గైడు అఖిల్ ని అడిగితే మీరు నిల్చున్న స్తంభాలే లెక్కించారు. పైకప్పులోవి లెక్కించలేదు అన్నాడు. నిజమే నేను లెక్కించలేదు. ఈ స్తంభాలన్నిటిలోనూ అద్భుతమైన శిల్ప సంపద ఉంది. 30 అడుగులు ఎత్తున అద్భుతంగా చెక్కిన తలుపులున్నాయి. కాకపోతే ఇవి పురాతనమైనవి కావు. 

 



 గుడి వెనక 66 స్తంభాల కాలక్షేపమఠం చుట్టూ గ్రిల్స్ తో చాలాపెద్దగా ఉంది. అహోబిలం మొదటి పీఠాధిపతి అయిన "ఆదివన్ శతగోపన్" భక్తులతో కాలక్షేపం చేసిన పెద్ద మండపం. నిరుపయోగంగా ఉంది. దీన్ని శుభ్రపరిచి ఉపయోగిస్తే భక్తులకు చాలా ఉపయోగపడుతుంది.

గుడి ముందు 16 స్తంభాలపై దాదాపు 6 అడుగుల ఎత్తులో కళ్యాణ మండపం ఉంది. 16 స్తంభాలు, మెట్లుతో సహా అద్భుతమైనశిల్పముంది.




 మధ్యలో ఉన్న నాలుగు స్తంభాల మీద గుమ్మటం లాగా ఉన్న పైకప్పులో శిల్ప సంపదను చూసి ఆనందించాల్సిందే. గుడి లోపల అంతా నీట్ గా ఉంది. కాని గుడి వెనక, గుడి ముందు, గుడి పక్కన అంతా అశ్రద్ధ, నిర్లక్ష్యం, అశుభ్రత. ఇది కాపాడుకోవాల్సిన చారిత్రిక శిల్ప సంపద. గుడికి కొద్దిగా క్రింద రెండు సత్రాలు, బ్రాహ్మణ వైశ్య ఉచిత భోజనాలు, పక్కన హోటల్, కూల్డ్రింక్స్ వాటర్ బాటిల్స్ చిరుతిళ్లు అమ్మే షాప్. ఆ ఉచిత భోజనాలే లేకపోతే ఆ కొండల్లో ఇంకెంత ఇబ్బందులు పడాల్సి వచ్చేదో! ఆ హోటలు ఇంకెంత బిజినెస్ లో ఉండేదో? ఉచిత భోజనాలలో ఇంకొంచెం శ్రద్ధ, ప్రేమ ఉంటే బాగుండేదనుకున్నాము.

జ్వాలనరసింహ స్టంభం ఎక్కే దారి అంతా ఎక్కే కొద్ది,చుట్టూ పచ్చడి కొండలు మమ్మల్ని రా రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్లున్నాయి. ఎక్కిన తర్వాత పైనుంచి కనపడే లోయలు, ఎండలేని చల్లటి వాతావరణం గొడుగు పట్టినట్లు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇంజామరలు పెట్టి వీస్తున్నట్లు, అచ్చమైన ఆక్సిజన్ తో నిండు గాలి. "మలయ మారుతం" (ఉదయాన్నే పాడుకునే అహ్లధకరమైన రాగం)లా చెట్ల మధ్య నుండి వచ్చే గాలి శబ్దం. స్టంభం చేరకుండానే, కొట్టే గంట ప్రకృతి సవ్వడిలాగా మన చెవులకు, చుట్టూ కనుచూపుమేరా ఎత్తయిన పచ్చటి కొండలు, లోతైన లోయలు నయనాలకు దిగిరానియనంత మనో ఉల్లాసాన్ని ఇచ్చాయి. కాకపోతే టైం అవుతుండటంతో ఇరుకైన మార్గంలో వేనక వచ్చేవారి ఒత్తిడితో ఆ ప్రకృతి నుండి బలవంతంగా కదిలాము. ఈ స్తంభం మాత్రం చెక్కిందే. ఉలిగీతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రకృతిని ఆస్వాదించాలంటే అహోబిలం వెళ్లాల్సిందే. కొంచెం కష్టపడితే, కొంచెం సపోర్ట్ ఇస్తే ఎక్కేయగలం. ఈ సపోర్టు జి.టి. కే వారు ఫుల్ గా ఇచ్చారు. వారు వీరు అని కాకుండా ఎక్కే వాళ్ళు దిగేవాళ్లు ఎవరికి సపోర్ట్ అవసరమైన ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి ఇచ్చారు. ఇది అహోబిలం ఇచ్చిన ఓ ఐక్యతారాగం.


అహోబిల గ్రూపు


ఎక్కలేనివారు నాలుగు వేల రూ.తో మాలోల నరసింహ ఆలయం వరకు సవారిలో వేళ్ళ తారు. సవారికుర్చీ, కట్టెలు, తాళ్లు చెన్నై నుంచి తెప్పిస్తారట. 7000 అవుతుందట. మూడు సంవత్సరాల వరకు పనిచేస్తాయట, రోజుకు ఒకటి, బాగా రద్దీగా ఉంటే రెండు సవారీలు చేస్తామని సవారీ విజయ్ చెప్పాడు. నలుగురు మనుషులు సవారిని మోస్తారు.




 అడివి ఎంత అందంగా ఉందో, నడిచే దారంతా వాటర్, కూల్ డ్రింక్ బాటిల్స్, చిరుతిళ్ళ కవర్లు మస్తుగా ఉన్నాయి. ఇవి కొండపై భూమిలో కలవవు. వర్షాలకు కొట్టుకొచ్చి నీళ్లలో కలుస్తాయి. చెన్నైలో ఓ పార్కులో చిరుతిళ్ళ ప్యాకెట్లు కట్ చేసి న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. వాటర్ బాటిల్స్ గేట్లోనే తీసేసుకుంటున్నారు. ఇలా చేయగలిగితే అహోబిల కొండలన్నీ అతి సుందరంగా ఉండవా? ఇది చాలా చిన్న పని. బోర్డులు, కొంతమంది ఉద్యోగులు ఉంటే. మా లీడర్ స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకురండని మరిమరి చెప్పాడు.

ఎక్కడానికి వీలుగా అక్కడక్కడ తాళ్లు కట్టడం కచ్చితంగా అభినందించాల్సినదే. అయితే ఈ తాళ్లు పొడవుగా దూర దూరంగా కాకుండా, దూరాన్ని తగ్గిస్తూ పక్కనున్న చెట్లకు మెలకలేసి కడితే ఈ తాళ్లు 100% సపోర్టుగా ఉంటాయి. ఇది ఏ ట్రిక్oగ్ గ్రూప్ వాళ్ళయినా చేయగలిగితే ఎంత బాగుండు. చెట్ల వేర్లు ఉన్నచోట పట్టుకొని ఎక్కడానికి అద్భుతంగా ఉన్నాయి. పై రెండు చేయగలిగితే టెక్కీంగ్ లన్ని ప్రకృతి సౌందర్యాలుగా, సందర్శన ప్రాంతాలుగా అభివృద్ధి చెందవా!

అహోబిలంలో అతిపెద్ద దేవాలయం లక్ష్మినరసింహ ఆలయం. పంతులుగారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి, విగ్రహ ప్రతిష్ట చేశాడని కలియుగం నుంచి ఉన్నదని చెప్పాడు.కాని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడట. ఈ గుడి చూడటానికి ఓపూటంతా పట్టొచ్చు. గుడిలో, చుట్టుపక్కల దాదాపు 300 స్తంభాల వరకు లెక్క పెట్టగలిగాను.అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. ప్రతి స్తంభం పైన ఊహించలేనంత శిల్పం ఉంది. దేనికదే ప్రత్యేకతగా ఉన్నది.




సైనిక విన్యాసాలు, నాట్య భంగిమలు, పొగలు చిమ్ముతున్న డ్రాగన్లు మీద స్వారీ, ఏనుగులు, తీగలు,లథలు, 9 నారసింహ రూపాలు, (గుడిలో కన్నా స్పష్టంగా కనిపిస్తున్నాయి) వాత్యాయన కామ సూత్రాలు గుర్తుతెచ్చే శృంగార శిల్పాలతో పాటు (మంటపము వెలుపల అడుగుభాగమున చిన్నవిగా ఉండటం వలన ప్రత్యేకమైన రంగులు వేశారు. చిన్న శిల్పాలు చూపరులు, పరిశీలనగా చూడరనేమోనని?కావచ్చు.) విసర్జన తరువాత శుభ్రపరుచుకునే శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ శిల్పాలు చూస్తున్నప్పుడు "తాపీ ధర్మారావు గారి దేవాలయాలపై బూతు బొమ్మలు గుర్తొచ్చింది" దీనిని బూతుగా చూడొద్దు. సైన్స్ చెప్పడమే శిల్పుల ఉద్దేశం అనుకుంటాను.ప్రతి స్టంభoలొ కొద్దిగా ఖాళీఉన్న దాని మీద చెవి ఆనించి,వేలితో తడితే సంగీత శబ్దాలు వినిపించాయి. ఎ టెక్నాలజీ, గ్రాఫిక్స్ లేని కాలంలో అంతటి శిల్పం చెక్కడము మామూలు విషయం కాదు. శిల్పుల నైపుణ్యానికి సజీవ రూపాలు. గుడి కూడా విశాలంగా, ప్రశాంతంగా నిశ్శబ్దంగా చుట్టూ ఎత్తైన ప్రాకారంతో ఉంది. ఈ గుడిని చూడడానికైనా అహోబిలం వేళ్ళాల్సిందే.




మా అమ్మ రాజుల సొమ్ము రాళ్లపాలు అనేది. మాకు కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత రాజుల సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము రాళ్లపాలు అనేవాళ్ళం. జరిగిపోయిన సొమ్ము ఆనాటి ప్రజలలో కొంతమందికి భృతిని, ఆనాటి ఈనాటి ప్రజలకు విజ్ఞాన వినోదాన్ని, చరిత్రకు ఆధారాలను ఇస్తున్నాయి. గుళ్ళల్లో ఉన్న శాసనాలు, శిల్పాలు వలన చరిత్రలో కొంత భాగం లభిస్తుంది.



ఉగ్ర స్తంభంపై జెండా ఎగరేసిన 10 ఎళ్ళ మోని. టీం లో అతి చిన్న సభ్యుడు


ఈ శిల్ప సంపదను రక్షిస్తూ ప్రచారం చేస్తే ముందు తరాల వారికి ఆహ్లాదకరమైన ప్రకృతి, శిల్ప సంపదను అందించగలము. ఈ రకంగా ఎవరు ఆలోచించాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? మనిషి ప్రకృతిలో భాగమే. ప్రకృతి లేనిదే మనిషి లేడు. ఎవరికి వారే ఈ ప్రశ్నలు వేసుకుని ప్రకృతి, శిల్ప సంపదను కాపాడుకుందాం. ప్రకృతిని విధ్వంసం చేసుకుంటూ వెళితే భవిష్యత్తులో (ఇప్పుడు నీళ్లను కొనుక్కున్నట్లు) ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వస్తుందేమో?


మనం దేనిని అభివృద్ధి చేయాలి? మూఢమైనా భక్తిని అభివృద్ధి చేసి కుల, మానవత్వం లేని సమాజాన్నా? లేక ప్రకృతి సంపదను, అటవీ సంపదను అభివృద్ధి చేసి మానవాళికి కార్బన్డయాక్సైడ్ లేని ఆక్సిజన్ ను అందించే అడవులను కొండలనా? నల్లమల్లను అభివృద్ధి చేద్దాం. ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుదాం. ట్రెక్కింగ్ పాయింట్గా సుందరంగా, లాభదాయకంగా అభివృద్ధి చేద్దాం. భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందిద్దాం.




Tags:    

Similar News