విద్యా వ్యవస్థకు జగన్ ఏమీ చేయలేదట
జగన్ పాఠశాలల మూసివేతకు పాల్పడ్డాడు. అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారని మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేశారు.;
By : The Federal
Update: 2025-01-29 12:45 GMT
మంత్రి నారా లోకేష్ మరో సారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనం చేశారని అన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప పాఠశాలల డెవలప్మెంట్కి జగన్ చేసిందేమీ లేదన్నారు. వందల పాఠశాలల మూసివేతకు జగన్ పాల్పడ్డాడని విమర్శలు గుప్పించారు.
ఇంకా ఏమన్నారంటే..
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడింది. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైంది. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైíసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదికలో స్పష్టంగా వెల్లడించింది. అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు పాల్పడ్డారు. అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారు. తగ్గిన హాజరు శాతం తగ్గింది. తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయి.
ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేని పరిస్థితి. విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు గత ఏడు నెలలుగా అనేక చర్యలు తీసుకున్నాను. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికాను. ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు అని పక్కా లెక్కలు తీయడం దగ్గర మొదలుపెట్టి మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయడం, విలువలతో కూడిన విద్య, విద్యార్థులను క్రీడలతో సహా ఇతర రంగాల్లో ప్రోత్సహించే గైడెన్స్ ఇవ్వడం, కనీస మౌలికవసతులు కల్పించడం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం వరకూ అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నాం. అంటూ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.