ఎమ్మెల్యే గోపిరెడ్డి నన్ను చంపేస్తాడన్నా! జగనన్నా కాపాడాన్నా...

అత్యంత సౌమ్యుడు, నిదానస్తుడు, అందరికీ తల్లో నాలుకలా ఉంటాడనుకునే పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసలు రూపం ఇదా..

Update: 2024-01-24 10:56 GMT
MLA Dr Gopireddy

అత్యంత సౌమ్యుడు, నిదానస్తుడు, అందరికీ తల్లో నాలుకలా ఉంటాడనుకునే పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివాదాల సుడిలో ఇరుక్కుపోయారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్న గోపిరెడ్డిపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదై ఉండగా ఇప్పుడు సరికొత్తగా భూ కబ్జా కేసు నమోదు కానుంది. ఎమ్మెల్యే గోపిరెడ్డితో ప్రాణహాని ఉందంటూ ఆయన సొంతపార్టీ కార్యకర్తే ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వేధింపుల నుంచి తనను కాపాడాలని, తన భూమి ఆక్రమణ కాకుండా రక్షించాలని ఆ పార్టీకే చెందిన కార్యకర్త ఏడుస్తూ వీడియో పెట్టారు.


నన్ను చంపేస్తారేమో జగన్...

వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వేధింపుల నుంచి తనను కాపాడాలని ఆ పార్టీకే చెందిన ఓ కార్యకర్త కోరారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన గుణపాటి వెంకటేశ్వరరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. ఆ వీడియోలో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. సెల్ఫీ వీడియోలో వెంకటేశ్వరరెడ్డి తెలిపిన ప్రకారం.. ‘‘కొంతకాలం క్రితం నర్సింగపాడు నుంచి వచ్చి నరసరావుపేటలో స్థిరపడ్డాం. రావిపాడు రోడ్డులో పొలం కొనుక్కుని భార్యతో కలిసి జీవిస్తున్నా. వైకాపా కార్యకర్తగా కొనసాగుతున్నా. ఇటీవల ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేక వర్గాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తాడేపల్లికి పిలిచారు. ఎమ్మెల్యే వల్ల ఏమైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలన్నారు. గోపిరెడ్డి అవినీతి గురించి ఫిర్యాదు చేశా”నని గుణపాటి చెబుతూ ఇక అప్పటి నుంచి గోపిరెడ్డి వేధింపులు ప్రారంభం అయ్యాయన్నారు.

“నరసరావుపేటలో 2015లో 41 సెంట్ల పొలం కొనుగోలు చేశా. ఆ పొలం తనకు ఇవ్వమని ఎమ్మెల్యే ఎంతోకాలం నుంచి నన్ను వేధిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మా ఇంటికి ఆయన అనుచరులు కొంతమంది వచ్చి దాడి చేశారు. నాకు, నా కుటుంబానికి శ్రీనివాసరెడ్డితో ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌, విజయసాయిరెడ్డి కల్పించుకుని కాపాడాలి. లేదంటే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాను’’ గుణపాటి అని హెచ్చరించారు.

ఎవరీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి?

రెండు సార్లు ఎమ్మెల్యే, మంచి హస్తవాసి ఉన్న డాక్టరు గోపిరెడ్డి. 1962 ఆగస్టు 12న పుట్టిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ కోడెల శివప్రసాద రావును ఓడించిన వ్యక్తి. ఉమ్మడి గుంటూరు జిల్లా బుచ్చిపాపనపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి సొంతూళ్లోనే ప్రాధమిక విద్యను, కోరుకొండ సైనిక్ స్కూలులో హైస్కూలు విద్యను పూర్తి చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన గోపిరెడ్డి కర్నాటకలోని మణిపాల్ మహే యూనివర్శిటీలో ఎంఎస్ ఆర్థోపెడిక్ చేశారు. గోపిరెడ్డి నరసరావుపేటలో ప్రముఖ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. తండ్రి వెంకటేశ్వరరెడ్డి ఆస్పత్రి నిర్వహణ చూస్తుంటారు. శ్రీనివాసరెడ్డి భార్య సుష్మిత.

నాలుగు కేసులు నమోదు..

2014లో వైసీపీ తరఫున నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో రెండోసారి గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినా సామాజిక వర్గాల సమతూకంలో ఆయన వెనుకబడిపోయారు. ఆ అసంతృప్తి ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ఈనేపథ్యంలో ఆయనపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. మూడు నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఈ ఆరోపణలు రావడం సంచలనం కలిగించింది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమోనని కూడా కొందరు అనుమానిస్తున్నారు.

Live Updates
Tags:    

Similar News