జనసేనలో ‘నారసింహ వారాహి గణం’
జనసేన పార్టీలో కొత్త శాఖ ఏర్పాటవుతోంది. నారసింహ వారాహి గణం పేరుతో ఈ శాఖను ప్రారంభిస్తున్నట్లు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యణ్ ప్రకటించారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-11-02 10:50 GMT
సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను. పార్టీలో ‘నారసింహ వారాహి గణం’ విభాగం ఏర్పాటు చేస్తానని డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తాను. నా మతాన్ని ఆరాధిస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టించాయి. నేను సచ్చీలతతో నమ్మే మతాన్ని ఎవరైనా తప్పు పడితే నేను మాట్లాడటం కూడా తప్పవుతుందా? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఆడబిడ్డలు ఆలయాల్లోకి వెళ్లే సమయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిపై ఆలయ అధికారులు దృష్టి సారించాలి. వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదరు కాకుండా చూడాలంటూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంటు, ముట్టు అనేవి ఆడవారికి సహజం. ఆ సమయాల్లో వారు ఆలయ ప్రవేశం చేయరు. వాటికి ఆలయ అధికారులు ఏమి చేస్తారు. అవి కూడా తెలియని వారు నాయకులుగా ఎలా చలామణి అవుతున్నారని నాస్తిక సమాజ నాయకులు వెంకట సుబ్బయ్య అనటం పలువురిని ఆలోచింప చేసింది. నేను నమ్మే ధర్మం పట్ల నిర్భయంగా మాట్లాడతాను. దానికి విఘాతం కలిగితే నేను స్పదించడం కనీస ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని పలువురు రాజకీయ మేధావులు ఆక్షేపిస్తున్నారు.
కుల, మత రహితర రాజ్యాంగాన్ని పాలకులే అనుసరించకుంటే ఇక రాజ్యాంగం ఎందుకనే ప్రశ్నను వారు లేవ దీశారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను నమ్మిన హిందూత్వ ధర్మం, హిందూత్వ వాదం గురించి తన వరకు ఉంచుకుంటే మంచిదని, హిందువులందరికీ దీనిని రుద్దాలని ప్రయత్నిస్తే తప్పకుండా ప్రతిఘటన ఎదురవుతుందని రాజ్యాంగ సాధికారతను కోరుకునే వారు హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ఊరుకోలేం, అక్కడి హిందువులు ఊచకోతకు గురవుతుంటే స్పందించ వద్దంటే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ వేదికపై ప్రశ్నించారు. దీనిని పలువురు తప్పు పడుతున్నారు. పైగా బంగ్లాదేశ్ విషయాలు మాట్లాడుతూ సనాతన ధర్మానికి విఘాతం కలిగితే ప్రతి హిందువూ స్పందించాలని, సనాతన ధర్మాన్ని తిడుతూ సోషల్ మీడియాలో మాట్లాడే వారి నోర్లు మూయించాలనే పిలుపును పలువురు తప్పు పడుతున్నారు. సనాతన ధర్మం మీవరకు మంచిది. అది ఎంతో మందికి మంచిది కాకపోవచ్చు. వారి అభిప్రాయాన్ని కాదనే హక్కు పవన్ కళ్యాణ్‌కు ఎవరు ఇచ్చారంటూ పలువురు మండి పడుతున్నారు.
ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఇప్పుడు హాట్ టాపిక్‌గా సనాతన ధర్మం, హిందూత్వ వాద దర్మం గురించి ప్రస్తావిస్తున్నారు. దీనిని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా పాలన సాగించలేని వారు పాలకులుగా అర్హులు కాదనే విషయం పలువురు అంబేద్కరిస్టుల నుంచి వెలువడుతున్న మాట. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దీపం – 2 పథకం ప్రారంభోత్సవ సభ సందర్భంగా ఈ వ్యాఖ్యలు ఆయన చేశారు.