ఎన్‌డిఎ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ఎన్‌డిఎ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఏమిటది? ఎందుకు కొత్త ట్రెండ్‌ తీసుకొచ్చింది?

Update: 2024-07-31 10:26 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ప్రభుత్వాలను చూసి ఉంటారు. ప్రస్తుత పాలన గత ప్రభుత్వాలకంటే భిన్నంగా సాగుతోంది. అందుకు ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం కావడం. కూటమిలో జనసేన పార్టీ, బిజెపిలు ఉండటం వల్ల అందరికీ సమానమైన ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. టీడీపీ తరువాత అధిక సీట్లు సాధించిన (పోటీ చేసిన అన్ని సీట్లలోనూ గెలుపు) జనసేన పార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు. అటు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌కు ప్రధానమైన విద్య, ఐటీ శాఖలు ఇచ్చారు. వీరిద్దరూ ప్రజల నుంచి అర్జీలు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటున్నారు. వారికి అందుబాటులోకి వచ్చిన జనం అర్జీ ఇస్తే తీసుకోవడమే కాకుండా అర్జీపై స్పందించి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారాన్ని చూపిస్తున్నారు.

వారం వారం సీఎం టీడీపీ ఆఫీస్‌కు..
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఈ రకమైన ట్రెండ్‌ ఫాలో కావడం తప్పలేదు. ఆయన ఇంకో అడుగు ముందుకు వేశారు. నేను ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో ఉంటానని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వందల సంఖ్యలో వస్తున్న అర్జీలు తీసుకుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్థిక పరమైన అంశంతో ముడిపడిన సమస్య కాకుంటే అక్కడికక్కడే పరిష్కారం అవడం పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రభుత్వానికి పార్టీని అనుసంధానం చేయాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అందుకే పింఛన్‌లు పంపిణీ సందర్భంలో సచివాలయం స్థాయిలోని కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. కొందరు పార్టీ కార్యకర్తలు తమ చేతుల మీదుగానే డబ్బులు పింఛన్‌ దారులకు అందిస్తున్నారు.
నిత్యం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రులు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఒక మంత్రి ఎప్పుడూ ఉంటున్నారు. వారు చెప్పిన సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేపట్టాలి. నెల ముందు నుంచే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రూపొందించి పార్టీ గ్రూపులో షేర్‌ చేస్తున్నారు. వారంలో ఒకసారి సీఎం చంద్రబాబు అందుబాటులో ఉంటున్నారు. అప్పుడప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్‌ ఉంటున్నారు. పార్టీ ప్రభుత్వం వేరు కాదని, పార్టీ నాయకులే ప్రజా ప్రతినిధులైనందున అందుకు సంబంధించి ఒక లైజనింగ్‌ వ్యవస్థను పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ప్రకటించారు.
డిప్యూటీ సీఎం స్పాట్‌ డెషెషన్స్‌
ఉప ముఖ్యమంత్రి కె పవన్‌ కళ్యాణ్‌ అప్పుడప్పుడు ఏదో ఒక సమయంలో మంగళగిరిలోని జనసేన పార్టీ స్టేట్‌ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్నారు. అక్కడికి వచ్చిన ప్రజల వద్దకే వచ్చి అర్జీలు తీసుకోవడంతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న డార్మెట్రీలోనో, కారు వద్దనో కూర్చుని లేదా నిలబడి అర్జీలు తీసుకుని చదువుతున్నారు. ఒక్కో అర్జీని తీసుకుని చదివి ఆ తరువాత నిర్ణయం తీసుకోవడం విశేషం. విజయవాడకు చెందిన ఒక మహిళ తన కుమార్తెను ప్రేమ పేరుతో ఒక యువకుడు తీసుకుపోయాడని చెబితే ఆ యువతి, యువకుడిని వారం రోజుల్లో విజయవాడకు పోలీసులతో పిలిపించారు. వారు జమ్ముకాశ్మీర్‌లో దొరికారు తనను బలవంతంగా యువకుడు తీసుకుపోయినట్లు యువతి చెప్పింది. తిరుపతి పట్టణానికి చెందిన కొందరు వృద్ధులు, యువతులు తాము తమ వీధిలో తిరగలేక పోతున్నామని, కొందరు జులాయిలు తమను ఆటపట్టిస్తూ జడలు లాగుతూ హేళన చేస్తున్నారని వాపోతూ పవన్‌ కళ్యాణ్‌కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని ఫొటోలు కూడా వారు పంపించారు. అర్జీని అందుకున్న పవన్‌ కళ్యాణ్‌ తిరుపతి ఎస్పీతో మాట్లాడారు. రౌడీయిజం సహించేందుకు వీలు లేదని, వారందరినీ పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించాలని ఆదేశించారు. దీంతో వెంటనే పోలీసులను ఆ వీధిలోకి పంపించి అక్కడి వారితో మాట్లాడి తగు చర్యలు తీసుకున్నారు తిరుపతి ఎస్‌పీ. ఇదంతా ఒక గంటలో జరిగింది.
ఎన్‌డీఏ పాలనలో అర్జీలపై చర్చ
ప్రస్తుత పాలనలో అర్జీదారులకు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎంలే స్పందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ ఆనందం వెల్లివిరిస్తోంది. ఎప్పుడూ లేనిది తమ అర్జీలు తీసుకుని సమస్యను వింటున్నారని, ఇది తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఇక జనసేనాని స్పందనపై ఎంతో మంది మంచిగా స్పందిస్తున్నారు.
గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్యో, కిరణ్‌కుమార్‌రెడ్డిలు కొందరి నుంచి అర్జీలు తీసుకునే వారని, ప్రతి రోజూ ఉదయం బయటకు వెళ్లే సమయంలో వైఎస్‌ఆర్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారి నుంచి అర్జీలు తీసుకునే వారని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైఎస్సార్‌కు అర్జీ ఇచ్చారంటే తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇలా పాలన గతంలో సాగింది. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రజల వద్దకే పాలకులు వెళుతున్నారు. అది కూడా సీఎం, మంత్రులు కావడం విశేషం.ఎన్‌డిఎ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌
Tags:    

Similar News