వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల పరిస్థితి అర్థంకాని అయోమయ స్థితిలో ఉంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా రద్దు చేస్తారా అనేది అర్థంకాక వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Update: 2024-08-05 14:50 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల పరిస్థితి అర్థంకాని అయోమయ స్థితిలో ఉంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా రద్దు చేస్తారా అనేది అర్థంకాక వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ప్రచారంలో.. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారి జీతాలను రూ.10వేలు చేస్తామని హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ అంశంపై పెదవి విప్పలేదు. ఎక్కడా చర్చల్లో కూడా ఈ అంశం వచ్చిన దాఖలాలు లేవు. దానికి తోడు ఇప్పటికే రెండు నెలల పింఛన్‌లను కూడా ప్రభుత్వ అధికారుల చేతే ఇప్పించేయడంతో వాలంటర్ల టెన్షన్ మరింత అధికమైంది. అయితే ఇటీవల వాలంటీర్లందరినీ కూడా గ్రామ సేవకులుగా గుర్తించాలని ప్రభుత్వం యోచిస్తుందన్న ప్రచారంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో వాలంటీర్లకు వ్యతిరేకంగా కూటమి సర్కార్ ముంద కొత్త డిమాండ్ వచ్చింది.

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది. దీంతో వాలంటీర్లలో భయాందోళనలు కట్టలు తెంచుకున్నాయి. ఏం చేయాలో అర్థంకాక అనేక ప్రాంతాల్లో నిరసనలకు కూడా దిగారు. కానీ వాలంటీర్ వ్యవస్థపై స్పష్టత లేదు. అయితే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన చేశారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉంది. వాలంటీర్లు నిశ్చింతగా ఉండొచ్చు’’ అని చెప్పారు. కానీ వాలంటీర్ వ్యవస్థ భవితవ్యంపై ఉత్కంఠ వీడలేదు. తాజాగా ఈరోజు మరోసారి వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ ఆలోచనను ఆయన బహిర్గతం చేశారు.

‘‘ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీ అమలుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని, తొలగించాలని ప్రభుత్వం ముందు డిమాండ్ ఉందని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దు. వాలంటీర్లకు వారి భవిష్యత్ పట్ల అపోహలొద్దు. భయపడాల్సిన పనిలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేయాలన్న ఉద్దేశంతో కొందరు ఈ తప్పుడు ప్రాచారాలు చేస్తున్నారు. వారి చర్యలను ఉపేక్షించేది లేదు. వాలంటీర్ వ్యవస్థను రాజకీయ లబ్ది కోసం వినియోగించుకున్నది వైసీపీ పాలకులే. ఏడాది కాలంగా వాలంటీర్ల సేవలను రెన్యూవల్ చేయకుండా దగా చేసింది వైసీపీ ప్రభుత్వమే. వాలంటీర్ల భవిష్యత్‌ను దెబ్బ కొట్టడానికి నిరాధార, అసత్య ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మొద్దు. అతి త్వరలోనే వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రకటిస్తాం’’ అని మరోసారి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News