ఏపీ సీఎస్ నియామకం పూర్తి.. జవహర్ రెడ్డి బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ నియామకం పూర్తయింది. అధికారులందరూ నీరభ్ కుమార్‌ నియామకాన్ని స్వాగతించారు.

Update: 2024-06-07 05:59 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ నియామకం పూర్తయింది. అధికారులందరూ నీరభ్ కుమార్‌ నియామకాన్ని స్వాగతించారు. ఈ నెలతో ప్రస్తుతం సీఎస్ జవహర్ రెడ్డి పదవీ కాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం వేట మొదలైంది. ఇందులో కొందరి పేర్లు ప్రధానంగా వినిపించాయని, వారందరి ట్రాక్ రికార్డ్, సీనియార్టీ వంటి పలు విషయాలను పరిశీలించిన తర్వాత ఈ పదవికి నీరభ్ కుమార్ పర్ఫెక్ట్ అని భావించి ఆయనను నియమించడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే నీరభ్ కుమార్.. సీఎస్‌గా ఛార్జ్ తీసుకుంటారని సమాచారం.

నీరభ్ కుమార్ నేపథ్యం

నీరభ్ కుమార్.. 1987 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన అధికారి. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2019లో తాత్కాలిక సీఎస్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. బుధవారం ఆయన ఉండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.

జవహర్ రెడ్డికి ఏమైంది..

ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో కూడా జారీ చేశారు. విదేశాలకు వెళ్లడానికి ఆయన కోరిన సెలవులు మంజూరు అయ్యాయి. ఆయన సెలవులపై వెళ్లారు. ఇటు ఆయనను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాకుండా జగన్ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి తాళం పడింది. అడిషనల్ కమాండెంట్ బెటాలియన్స్ ప్రకాష్ నేతృత్వంలో సిట్ కార్యాలయానికి తాళం వేశారు.


 



సీఎస్ బరిలో నిలబడింది వీరే..

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సీఎస్ నియామకం కోసం కొన్ని రోజుల పాటు కసరత్తులు జరిగాయి. ఆ పదవికి తగ్గా అధికారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను జల్లెడ పట్టింది. అందులో ప్రధానంగా నీరభ్ కుమార్, రజిత్ బార్గవ, ఆర్‌పీ సిసోడియా, కే విజయానంద్ పేర్లు ఉన్నాయని, వారి ట్రాక్ రికార్డ్, సీనియార్టి వంటి అంశాలను పరిశీలించిన తర్వాత నీరభ్‌కు సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్ ఖరారు అయ్యారని కూడా గురువారం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్‌లలో ప్రచారం జరిగింది. కానీ ఆయన పేరు పరిశీలకు మాత్రమే వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

Tags:    

Similar News