DRUGS | 'మత్తు' కోసం కొత్తదారులు... 'బానిస'ల మెదళ్లు పాదరసమే..
యువకుల మాటలు విని ఆశ్చర్యపోయిన తిరుపతి పోలీసులు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-23 10:00 GMT
మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై నిఘా ఎక్కువైంది. మత్తు పదార్థాలకు బానిసగా మారిన మైనర్లు రూటు మార్చారు. దీనివల్ల మాదకద్రవ్యాలకు బానిస అయిన వారి ఆలోచనలు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. తిరుపతిలో యువకులు, పిల్లలు కిక్కు (Kick ) కోసం ఎంచుకున్న మార్గం అనేక ప్రశ్నలు తెరమీదకు తెచ్చింది.
"మాత్రలు (tablets) కరిగించి ఇంజెక్షన్లుగా తీసుకుంటున్న కొత్తకోణం" బయటపడింది.
ఆ సమయంలో వారి చేష్టలు కూడా సైకోలను తలపించాయి. ఈ సంఘటన ద్వారా మత్తుకు అలవాటు పడిన వారి మెదడు పాదరసంలా పనిచేస్తుందననే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఇంకొన్నిజాగ్రత్తలతో పాటు సవాళ్లను కూడా తెరపైకి తెచ్చిందనడంలో సందేహం లేదు. ఈ తరహాలో మత్తు ఎక్కించుకోవడం ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
"పిల్లలు కావడం వల్ల వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. తల్లిదండ్రులను కూడా పిలిపించి హెచ్చరించి పంపించాం" అని తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు చెప్పారు.
"కేసులు నమోదు చేయకుండా వదిలినా, నిఘా మాత్రం ఉంటుంది" అని సీఐ చిన్న గోవిందు స్పష్టం చేశారు.
తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో కొన్ని రోజుల కిందట యువకులు మత్తు ఇంజక్షన్లు వాడుతున్న వీడియో వైరల్ అయింది. స్పందించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు సిబ్బందితో ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రదేశంలో నిఘా ఉంచడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
"మాదకద్రవ్యాల విక్రేతలపై నిఘా ఉంది. మత్తు పదార్థాలు వాడే వారిని కట్టడి చేయడానికి డ్రోన్ నిఘా పెట్టాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెబుతున్నారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో...
తిరుపతి నగరంలో నిర్మానుష్య ప్రాంతాలను అడ్డగా చేసుకొని యువతకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న విషయం కూడా బయటపడింది. గంజాయి విక్రేతలకు మత్తుకుబానిసలైన వారు పెట్టుబడిగా మారారు. పాడుబడిన భవనాలను యువత అడ్డగా మార్చుకుంది. ఇక్కడికి ఎవరూ రాలేనుకున్నారేమో నలుగురు ఇంజెక్షన్లు వేసుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికారు.
ఎలాగంటే..
తిరుపతి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈగల్ టీం ఏర్పాటయింది. ఆకాశంలోకి డ్రోన్ పంపించడం ద్వారా చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏమి జరుగుతుందనే విషయం పసిగడుతున్నారు. ఈ తరహా ఆపరేషన్లో తిరుపతి రూరల్ (ముత్యాల రెడ్డి పల్లి) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రదేశంలో మత్తు ఇంజెక్షన్లు వేసుకుంటున్న పిల్లలు కనిపించారు.
"ఇద్దరు పిల్లలు కూర్చుని ఉన్నారు. ఇంజెక్షన్ తీసుకున్న ఓ పిల్లాడు ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు. మరొక బాలుడు ఇంజెక్షన్ వేసుకోవడానికి కొద్ది సేపటి ముందు చప్పట్లు కొడుతూ, ఆనందంతో ఊగిపోవడం డ్రోన్ కెమెరాలో కనిపించింది"
అక్కడికి చేరుకున్న ఈగల్ టీం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు వాడిన ఇంజెక్షన్లు, సిరంజీలు స్వాధీనం చేసుకుని ఎంఆర్.పల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు.
పిల్లలు ఇద్దరు వేసుకున్న ఇంజెక్షన్లను తెలిసుకున్న పోలీసులు నిర్ఘాంతపోయారు.
"మెడికల్ షాప్ లో మాత్రలు కొంటున్నాం. వాటిని నీటిలో కరిగిస్తున్నాం. ద్రవంగా మార్చి సిరంజిలో నింపి చేతి నరాలకు ఎక్కించుకున్నాం" అని పిల్లలు ఇద్దరూ చెప్పడంలో పోలీసులు ఆశ్చర్యపోయారు. ముత్యాలరెడ్డిపల్లె సీఐ చిన్న గోవిందు కూడా 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి అదే విషయం స్పష్టం చేశారు. వారి తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి, పంపించాం అని ఆయన స్పష్టం చేశారు.
మెడికల్ షాపుల్లో మత్తు మందులు, మాత్రలు డాక్టర్ సిఫారసు లేకుండా విక్రయించేందుకు ఆస్కారం లేదు. ప్రిస్కిప్షన్ కచ్చితంగా ఉండాలి. కానీ ఆ పిల్లలు ఏతరహా మాత్రలు వాడారనే విషయం పోలీసులు వాకబు చేయలేదు. మాత్రలు ఎక్కడ కొన్నారనే విషయం కూడా తెలుసుకోకుండా పంపించామని చెబుతున్నారు.
ఇది ప్రమాదకరం
మాత్రలు నీళ్లలో కలిపి ఇంజెక్షన్ గా తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరం అని కడప జిల్లా చిట్వేలిలోని మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ దొండ్లవాగు చంద్రశేఖర్ చెబుతున్నారు. ఇది ప్రాణాంతకం కూడా అని ఆయన అంటున్నారు.
డాక్టర్ డీ. చంద్రశేఖర్ ఏమంటున్నారంటే..
" ఈ తరహా మాత్రలను ట్రాక్లినైజర్స్ అంటారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కూడా నేను ఈ తరహా మాత్రలు సిఫారసే చేయను. ఈ మాత్ర వేసుకోవడం వల్ల మైండ్ రెస్ట్ కోరుకుంటుంది. ఆపరేషన్లు, ఇతర అత్యవసర సమయాల్లో మాత్రమే డాక్లర్లు సెడెషన్ మందులు సిఫారసు చేస్తారు. అవి గ్రామీణ ప్రాంతాల్లో దొరకవు. ఆ తరహా మాత్రలు, యాంపిల్స్ విక్రయించాలంటే మెడికల్ షాప్ నిర్వాహకులు పకడ్బందీగా రికార్డులు నిర్వహించాల్సి ఉంటుంది" అని చంద్రశేఖర్ వివరించారు.
డ్రోన్ నిఘా ఉంది..
మత్తు ఇంజక్షన్లు తీసుకుంటున్న వారి కోసం స్పెషల్ ఈగల్ ( Eagle )టీంలతో నిఘా పెట్టామని తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవింద్ తెలిపారు. బైరాగిపట్టెడ సమీపంలోని లింగేశ్వరనగర్ వద్ద చెట్ల పొదల్లో నలుగురు యువకులు మత్తు ఇంజక్షన్ తీసుకుంటున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించామని ఆయన తెలిపారు.
"యువకులకు పోలీసు వారు కౌన్సిలింగ్ ఇవ్వడం తోపాటు, వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించాం. మత్తు ఇంజక్షన్ల వల్ల జరిగే పరిణామాలను వివరించాం" అని సీఐ చిన్న గోవిందు తెలిపారు.
"తల్లితండ్రుల అనుమతితో ఆ యువకులను వైద్యుల సూచనల మేరకు రిహబిలేషన్ సెంటర్ కు పంపి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం" అని సీఐ చెప్పారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.