కాంగ్రెస్‌లో నూతనోత్తేజం

ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్‌ షర్మిల పదవీ బాధ్యతలు విజయవాడలో స్వీకరిస్తారు.

Byline :  The Federal
Update: 2024-01-20 05:36 GMT
YS Sharmila, APCC President,

కాంగ్రెస్‌ పార్టీలో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ నిస్తేజంగా ఉందని చెప్పొచ్చు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌ను ఆంధ్రరాష్ట్ర ప్రజలు దగ్గరికి చేరనివ్వలేదు. ఇప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు చేపడుతున్నారు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నిలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలు పెట్టాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించాయి. సభలు నిర్వహిస్తున్నాయి.

రేపు షర్మిల బాధ్యతల స్వీకరణ
ఆదివారం వైఎస్‌ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద సాయంత్రం నివాళులర్పించి రాత్రికి అక్కడే ఉంటారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి భారీ ర్యాలీగా విజయవాడ వస్తారు. బందర్‌రోడ్డులోని ఆహ్వానం కళ్యాణ మండపంలో ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్‌ నాయకులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు బాథ్యతలు తీసుకున్న తరువాత కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రరత్న భవన్‌ చేరుకుంటారు. ముఖ్యనాయకులను పరిచయం చేసుకుని తన కార్యక్రమాలను మొదలు పెడతారు. కార్యక్రమానికి కేంద్ర నాయకులు హాజరు కానున్నారు.
గత ఎన్నికల్లో 1.7శాతం ఓటింగ్‌
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు 1.7శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. షర్మిల ఈ ఓటింగ్‌ శాతాన్ని పెంచడంతో పాటు సీట్లు సంపాదించగలదనే ఆలోచనలో కాంగ్రెస్‌ నాయకత్వం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలోని అధికార పార్టీ విధానాలను ప్రశ్నించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటి వరకు జగన్‌ విధానాలను పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. షర్మిల పిసీసీ బాధ్యతలు స్వీకరించి తప్పకుండా ప్రభుత్వ విధానాలపై దూకుడు పెంచి మాట్లాడుతుందనే నమ్మకం కాంగ్రెస్‌ వాదుల్లో ఉంది.
కమ్యూనిస్టులతోనూ చర్చలు
త్వరలోనే రాష్ట్రంలోని సీపీఐ, సీపీఎంలతో కాంగ్రెస్‌ పార్టీ చర్చలు జరపనున్నారు. ఇండియా కూటమిలో వారు భాగస్వాములైనందున ఎన్నికల ప్రచారంలో వారి భాగస్వామ్యం ఎకువగా కాంగ్రెస్‌ పార్టీ ఆశిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం బాగా సాగాలంటే కమ్యూనిస్టుల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో అవసరం అవుతుందని కాంగ్రెస్‌ వారు చెబుతున్నారు. అందుకే ముందుగా వారితో కూడా మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తారని కాంగ్రెస్‌ ముఖ్యనాయకుడు ఒకరు వెల్లడించారు.
Tags:    

Similar News