ఇడుపులపాయ ఎస్టేట్‌లో మీడియా కింత చోటే లేదా జగన్!

కడప జిల్లా ఇడుపులపాయ ఎస్టేట్‌లోకి మీడియాను అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-03-16 08:16 GMT
Source: Twitter

ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్




తిరుపతి: ఇడుపులపాయ ఎస్టేట్.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఓ మానస పుత్రిక. తన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఒక ఉద్యానవనం. ప్రస్తుతం ఈ ప్రదేశంలో నిషేధ ఆజ్ఞలు అమలవుతున్నాయి. దివంగత సీఎం వైఎస్ఆర్ ఉన్నప్పటికీ ఇప్పటి వాతావరణానికి బేరీజు వేసుకోవడానికి కూడా ఏమాత్రం ఆస్కారం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇడుపులపాయ దరిదాపుల్లోకి కూడా మీడియాను అనుమతించడం లేదు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా పాసులు ఇవ్వడం లేదు. అనామక నాయకులకు ఎలా పాసులు ఇస్తున్నారని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చెప్పే మాట ఒకటే "స్థలాభావం వల్ల మీడియాను అనుమతించడం లేదు" అని. వందలు.. వేలు కాదు లక్షలాది మంది జనం కూర్చోవడానికి అనుకూలంగా ఉన్న ఈ ప్రదేశంలోకి... నాయకులను అనుమతిస్తున్నారు. మేము ఏం పాపం చేశామని మమ్మల్ని అడ్డుకుంటున్నారని జర్నలిస్టులు, మీడియా నిలదీస్తోంది.


అసలు విషయంలోకి వస్తే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబీకులు ఒక సెంటిమెంట్ పాటిస్తారు. దివంగత నేత వైఎస్ఆర్‌కు ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే చేపట్టదలచిన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆ కోవలోనే.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్ పార్టీ ప్రారంభించడానికి, 2014 ఎన్నికల శంఖారావం పూరించడానికి ముందు తన తండ్రి సమాధి వద్ద కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు దారులు పార్టీ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారందరూ కూడా వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించారు.


ఇప్పుడు పరిస్థితి ఏంటి?


ఇప్పుడు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ.. అభ్యర్థుల ప్రకటనకు ఇడుపులపాయ ఎస్టేట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యథావిధిగా ఎంచుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడి నుంచే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. గత ఎన్నికల్లో దళిత నాయకుడైన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఎన్నికలకు కూడా అభ్యర్థుల ప్రకటన కోసం ఎంపీ నందిగం సురేష్, బీసీ నాయకుడు, మంత్రి కృష్ణ దాస్‌తో పాటు వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులందరూ ఇడుపులపాయకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా సిద్ధం చేసిన జాబితా మేరకు పాసులు ఉన్న వారిని మాత్రమే ఇడుపులపాయ అతిథి గృహంలోకి అనుమతిస్తున్నారు.



మీడియాకు నిరాకరణ


అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విశేషాలను కవర్ చేయడం ద్వారా ప్రజలకు సమాచారం చేరవేయాలని చూసే జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు. ముఖ్యమంత్రి వెంట వచ్చే ఫోటోగ్రాఫర్ మాత్రమే కవర్ చేస్తారని కడప జిల్లా డీపీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.


ఐదేళ్లుగా ఇదే తంతు..


వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత.. ఐదేళ్ల నుంచి ఆంక్షలు చక్రంలో ఇడుపులపాయ ఉందని స్థానికుల సమాచారం. మీడియాను దరిదాపుల్లో కూడా అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. "వ్యతిరేక వార్తలు రాస్తున్నారని. అందుకే అనుమతించడం లేదని" కొందరు అధికారులు అంటున్నట్లు మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. "ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే ఈ పరిస్థితి ఏర్పడింది" అని ఓ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామ సుబ్బారెడ్డి.. ‘ది ఫెడరల్ ప్రతినిధి’కి చెప్పారు. కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు వద్ద కూడా ఇదే చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. స్థలాభావం వల్లే మీడియాను అనుమతించడం లేదని ఆయన చెబుతున్నారు. కొందరికి మాత్రం పాసులు జారీ చేస్తున్నారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ పరిస్థితి వల్ల మీడియా తన పాత్ర నిర్వహించడంలో ఆంక్షలకు గురికాక తప్పడం లేదని రామసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.




 



Tags:    

Similar News