న్యూ ఇయర్‌ వేడుకల్లో అశ్లీలత ఉండొద్దు..విశాఖ పోలీసుల ఆదేశాలు

కొత్త సంవత్సరం వేడుకలపై విశాఖపట్నం పోలీసులు స్పందించారు. క్లబ్ లు, పబ్ లకు మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Update: 2024-12-26 15:48 GMT

విశాఖపట్నంలో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాలంటే పోలీసుల అనుమతులు తప్పనిసరి. క్లబ్‌లు, పబ్‌లు, హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకునేందుకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. ఈ వేడుకల కోసం విశాఖపట్నం పోలీసు కమిషనరేట్‌లో ముందుస్తు అనుమతులకు దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుంది. పోలీసులు అనుమతులు ఇచ్చిన తర్వాతనే న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవలసి ఉంటుంది. ఏపీ పబ్లిక్‌ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్ట్‌ 2013 ప్రకారం వేడుకలు జరిపే చోట ప్రవేశ ద్వారం, వెలుపలికి వెళ్లే చోట్లల్లో సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కెమేరాల్లో వీడియో రికార్డింగ్‌ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. పార్కింగ్‌ ప్రదేశాల్లోను రికార్డింగ్‌ సౌకర్యం ఉన్న సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలి. ఈవెంట్‌కు సంబంధించి కళాకారులు ధరించే దుస్తులు, చేసే డాన్సులు, మాటలు, పాటలు అన్నీ సమాజం పరంగా మంచిని సూచించే విధంగా ఉండాలి. ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా ఉండాలి. డీజేల వంటి సౌండ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేయకుండా శబ్ధం 45 డిసెబెల్స్‌కు మించకుండా ఉండాలి. విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌ జంక్షన్, ఆర్కే బీచ్, భీమిలి, గాజువాక, పెందుర్తి వంటి ప్రాంతాల్లో షీ టీమ్స్‌ అందుబాటులో ఉంటాయి. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే వారిని సంప్రదించొచ్చు. డిసెంబరు 31 నుంచి 2025 జనవరి 1 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News