‘ఏ సీఎం చేయని పని చంద్రబాబు చేశారు’.. సహాయక చర్యలపై హోం మంత్రి అనిత

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిన కారణంగా కోస్తాంధ్రా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-09-08 09:58 GMT

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిన కారణంగా కోస్తాంధ్రా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం అయిందని, వరదలను ఎదుర్కోవడానికి సన్నద్ధం అవుతోందని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విజవాడను ముంచెత్తిన వరదల విషయంలో 8 రోజులుగా ప్రజలకు ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

పగలు రాత్రి తేడా లేకుండా..

సహాయక చర్యల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదని అని అన్నారు. ‘‘రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు సహా ఏపీ మంత్రి వర్గం అంతా పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. ధరల నియంత్రణపై దృష్టి సారించాం. కూరగాయలను రాయితీపై విక్రయించేలా చర్యలు తీసుకున్నాం. శనివారం ఒక్కరోజే రాయితీకి 64 టన్నుల కూరగాయలు విక్రయం జరిగింది. ప్రజలకు పాల ప్యాకెట్లు, పండ్లు కూడా అందిస్తున్నాం’’ అని చెప్పారు.

వైసీపీ వన్నీ పులిహోర కబుర్లే

‘‘గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. అధికారంలో ఉన్నప్పుడు వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చి పచ్చి అబద్దాలు చెప్తున్నారు. కనీసం వరద ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పులిహోర ప్యాకెట్లు కూడా పంచని గత ప్రభుత్వ నాయకుడు పులిహోర కబుర్లు చెప్తున్నారు. పాస్ట్ పోర్ట్ లేక ఇంకా ఇక్కడ ఉన్నారు. లేదంటే వర్షాలు మొదలైన తెల్లారే లండన్ వెళ్లిపోయి ఉండేవారు’’ అని చురకలంటించారు. విజయవాడ కలెక్టరేట్‌లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏ ముఖ్యమంత్రి చేయలేదు..

‘‘వరదలు ముంచెత్తిన రోజు నుంచి ప్రజలకు సహాయక చర్యలు అందించడంపైనే సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎనిమిది రోజులుగా విజయవాడ కలెక్టరేట్‌లోనే చంద్రబాబు ఉంటూ.. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతిరోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టాలను స్వయంగా ఆలకిస్తున్నారు. ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేయలేదు. చంద్రబాబు ఒక్కరే తాను తిన్నా తినకపోయినా ప్రజలకు రెండు పూటలా ఆహారం అందాలని ఆలోచించే నేత. ప్రతి ఒక్కరికీ సహాయం అందాలని సీఎం పరితపించారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంతలా పర్యటించలేదు. తన వయసు, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వరద నీటిలో దిగి మరీ పర్యటించారు చంద్రబాబు. దాదాపు రెండు గంటల పాటు వరదనీటిలో ఉన్నారు’’ అని చెప్పారు.

తాగునీటికి ప్రత్యేక ట్యాంకర్లు

‘‘వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి తాగునీరు అందించడానికి ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాదాపు 236 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. ఈ ట్యాంకర్లు ఈరోజు మధ్యాహ్నం వరకు 177 ట్రిప్పులు వేశాయి. శనివారం ఒక్కరోజు తాగునీరు అందించడానికి వాటర్ ట్యాంకర్లు 2090 ట్రిప్పులు తిరిగాయి. అంతేకాకుండా వరదల సమయంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ రేషన్ అందించాం. 60 వేల మందికి పైగా రేషన్ అందించాం. ఫైర్ ఇంజన్లు పెట్టి ప్రజల ఇళ్లను శుభ్రం చేయిస్తున్నాం. రోజుకు 200 ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. ఈ సంఖ్యను 400 పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు.

గణేష్ మండపాలకు నో బిల్స్

‘‘2022 లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించి ఓ జీవో వచ్చింది. మేము ఆ జీవోలో ఉన్న విషయాన్ని చెప్పామంతే. ఆ జీవోలో ఉన్న అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. గణేష్ మండపాల అనుమతులకు ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ గణేష్ మండపాలకు సింగిల్ విండో విధానంలోనే అనుమలుతు ఇచ్చాం. సీఎం ఆదేశాలను పది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాం. ఆదేశాల ప్రకారమే గణేష్ మండపాలకు సంబంధించి ఎక్కడా కూడా రూపాయి కూడా వసూలు చేయడం లేదు. మైక్ పర్మిషన్‌కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి’’ అని వివరించారు.

Tags:    

Similar News