నెలవు లేక ‘కాలుకాలిన పిల్లిలా’ తిరిగిన పులి
మూడు రాష్ట్రాల్లో 300 కిలో మీటర్లు ప్రయాణించి అంతా హడలి పోయేలా చేసింది.;
ఉండే ప్రాంతం వదిలి వేరొక ప్రాంతానికి వెళ్లినప్పుడు కొత్తదనం వింతగా ఉంటుంది. అక్కడి వారు తెలియదు. ఎవరిని పలకరించాలో తెలియదు. ఎటు పోవాలో తెలియదు, ఎటు వైపు ఏమి ఉంటుందో తెలియదు. మెల్లగా ఆ ప్రాంత మంతా కొంతకాలం తిరిగితే కాని అక్కడి పరిస్థితులు, వాతావరణం అర్థం కాదు. కొత్తదనంలోకి ఇమిడి పోతే సరి. లేదంట ఉనికి దర్భరమవుతుంది. ఇది మనుషుల విషయంలో.. మరి జంతువుల విషయంలో ఎలా ఉంటుంది? వాటికి కూడా ప్రాంతీయత స్థానికత ఉంటాయి. గూడు చెదిరినపుడో, ప్రమాదం ముంచుకొచ్చినపుడో , ఎవరో తరిమేసినపుడో కొత్త ప్రాంతానికి వెళితే ఎలా ఉంటుందనేదే ఈ కథ సారాంశం.
మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వు ఫారెస్ట్. అక్కడ ఉన్న రెండు ఆడ పులులను ఓడిశా కు తరలించాలని అధికారులు అనుకున్నారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో పులుల సంఖ్య తక్కువగా ఉంది. అక్కడ వదిలితే పులుల సంఖ్య పెరుగుతుందని వైల్డ్ లైఫ్ అధికారులు భావించారు. వీటి వయస్సు మూడు సంవత్సరాలు. ఒకదానిపేరు జీనత్, మరో దానిపేరు యుమున. 2024 నవంబరు 14న ఈ రెండు పులులను తరలించారు. పులులను పది రోజుల పాటు సాఫ్ట్ ఎన్ కోజర్ (గతంలో ఈ పులులు ఉన్న ప్రాంతం మాదిరి ఏర్పాటు చేసిన స్థలం)లో ఉంచి నవంబరు 24న సిమిలీపాల్ కోర్ ఏరియాలోకి వదిలారు. అక్కడ 11 రోజుల పాటు ఉన్న ఆ పులుల్లో ఒక పులికి ఆ ప్రాంతం కొత్త చేసింది. ఆహారం ఏ ప్రాంతంలో ఉంటుందో సక్రమంగా అర్థం కాలేదు. అడవి పూర్తిగా కొత్తగా ఉంది.
జీనత్ అనే పులి ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లింది. అడవుల్లో నడుచుకుంటూ వెళ్లిపోతూనే ఉంది. జీనత్ సిమిలీపాల్ కోర్ ఏరియాను దాటినట్లు వైల్డ్ లైఫ్ అధికారులకు అర్థమైంది. ఈ పులికి శరీరంలో రేడియో కాలర్ అమర్చారు. తాను ఉండాల్సిన అడవి కోర్ ఏరియా దాటి ప్రయాణం చేస్తోందని రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా తెలుసుకున్న అధికారులు వెంటనే జీనత్ ను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు పులి వెళుతున్న ప్రాంతాలకు ముందుగానే వెళ్లి ఆ ప్రాంతాల్లో లైలాన్ ఉచ్చులు వేసి మత్తు ఇంజక్షన్ బాణాలు కూడా అమర్చారు. అయినా వాటిని తప్పించుకుంటూ ఒడిశా నుంచి ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ బెంగాల్ అడవుల్లోకి వెళ్లింది. దండకారణ్య ప్రాంతం నుంచి అది ప్రయాణం చేయడం వల్ల వైల్డ్ లైఫ్ అధికారులకు కష్టాలు తప్పలేదు. పైగా కొన్ని చోట్ల రేడియో కాలర్ సిగ్నల్స్ బలహీనంగా ఉండటం వల్ల కూడా సరిగ్గా ఏప్రాంతంలో ఉందో కూడా అర్థం కాని పరిస్థితి అధికారులకు ఏర్పడింది.
పులి ప్రయాణిస్తున్న సమయంలో సరిగ్గా ఆహారం తీసుకోలేదు. ఏవో చిన్న జంతువులను తిన్నట్లు అధికారులు గుర్తించారు. అయినా పులి చాలా యాక్టివ్ గా ఉంది. పశ్చిమ బెంగాల్ అడవుల్లో సుమారు 100 కిలో మీటర్ల ప్రయాణించింది. అది ప్రయాణిస్తున్న ప్రాంతాల్లో అక్కడక్కడ గ్రామాలు కనిపించాయి. గ్రామాల వారికి పులి కనిపించడంతో హడలిపోయారు. పశ్చిమ బెంగాల్ లోని ఝార్ గ్రామ్ గ్రామంలో స్థానికులు హడలి పోయారు. ఆ ఊరు చుట్టుపక్కల ఒక రోజంతా ఉన్నట్లు అధికారులకు సమాచారం ఉంది. అక్కడి నుంచి బంకుర జిల్లాలోకి పులి ప్రవేశించింది. ఈ జిల్లాలో కూడా దట్టమైన అడవులు ఉన్నందున అడవులను ఆనుకుని ఉన్న గోసైంధిహి అనే గ్రామం వద్ద మత్తు బాణాలు వదిలి పులిని వైల్డ్ లైఫ్ సిబ్బంది పట్టుకున్నారు. డిసెంబరు 8 నుంచి దీని ప్రయాణం మొదలై 2025 జనవరి 2న ముగిసింది. అంటే 21 రోజుల పాటు తాను నడుస్తూనే ఉంది. ఒక్క చోట పూర్తిగా పడుకున్న దాఖలాలు కూడా లేవు. రేడియో కాలర్ వల్ల ఎక్కడ ఎంతసేపు ఆగిందనేది కూడా అధికారులు గుర్తిస్తారు.
మూడు రాష్ట్రాలకు చెందిన అధికారులతో పాటు తెలంగాణ, ఏపీ అధికారుల సహకారం కూడా వైల్డ్ లైఫ్ వారు తీసుకున్నారు. జీనత్ పులిని పట్టుకున్నారని తెలియగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైల్డ్ లైఫ్ అధికారులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘ట్రాన్స్ లొకేషన్ షాక్’ కు గురై పులి సిమిలీపాల్ ప్రాంతం నుంచి బయటకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఆడపులి కావడం వల్ల మగతోడు కోసం కూడా వెళ్లి ఉండొచ్చనే అనుమానం కూడా కొందరు అధికారుల్లో ఉంది. దీనితో పాటు ఇదే వయసు ఉన్న మరో పులి యమున కూడా ఉన్నందున మగపులి తోడుకోసమే అయితే రెండూ కలిసి వెళ్లేవని, కేవలం కొత్త ప్రాంతం కావడం వల్ల మాత్రమే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయి దిక్కుతోచక, ఎటు వెళ్లాలో అర్థం కాక ఈ విధంగా ప్రయాణం చేసిందని అధికారులు తెలిపారు.
పులి సహజంగా ఒక టెరిటరీని ఏర్పాటు చేసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ టెరిటరీలో మాత్రమే ఉంటుంది. అది తిరిగే ప్రాంతంలో చెట్లకు, మట్టి గడ్డలకు కాలి గోళ్లతో గీకి మూత్ర విసర్జన చేస్తుంది. అలాగే మలం కూడా విసర్జిస్తుంది. వేరే పులి ఈ ప్రాంతంలోకి రావాలంటే ఈ టెరిటరీని దాటి రావాల్సి ఉంటుంది. మరొక పులి తాను ఉంటున్న ప్రాంతంలోకి వచ్చిందంటే రెండు పులుల మధ్య భీకర పోరు జరుగుతుంది. ఓడిన పులి ఆ ప్రాంతం నుంచి వెళ్లి మరొక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటుంది. అందువల్ల ఒకటి ఏర్పాటు చేసుకున్న టెరిటరీలోకి మరొక పులి రాదు. పులులు ఒంటరిగా ఉండటానికి ఎక్కవ ప్రాధాన్యత ఇస్తాయి.
మేటింగ్ సమయంలో మాత్రమే మగ, ఆడ పులులు కలుస్తాయి. పిల్లలను ప్రసవించిన తరువాత అవి వేటాడటం నేర్చుకునే వరకు తల్లి పులితో పాటు పులి పిల్లలు తిరుగుతాయి. ఎప్పుడైతే వేటాడటం పిల్లలు ప్రారంభిస్తాయో అప్పుడు అవి వేరుగా ఉండేందుకు ఇష్టపడతాయి. మరొక ప్రాంతాన్ని వెతుక్కుంటూ ఆ చిన్న పులులు వెళతాయి. సింహాల మాదిరి పులులు గుంపులుగా ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అప్పుడప్పుడు వేటాడే సమయంలో ఆడ, మగ పులులు కలిస్తే కలిసి వేటాడతాయి. కేవలం మాంసాహార జంతువులు కాబట్టి చిన్న జంతువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలను పులులు ఎంచుకుంటాయి. దట్టమైన, పొందలు, చల్లగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటాయి. చెట్లు ఈజీగా ఎక్కుతాయి. ఒక చెట్టు పై నుంచి మరో చెట్టు పైకి కూడా ఈజీగా దూకుతాయి.
గతంలో వన్యప్రాణి శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ గా పనిచేసిన తులసీరావు మాట్లాడుతూ పులులు ఎక్కువగా ఉండే ప్రాంతం పచ్చగా ఉంటుందని, చిన్న జంతువులు కూడా ఎక్కువగా ఉంటాయని, నల్లమలలో పులులు ఉండే ప్రాంతం దట్టమైన అడవిగా ఉంటుందని తెలిపారు. కొత్త ప్రాంతం కావడం వల్లనే పులి వేరే ప్రాంతానికి వెళ్లిందని, పులులు నివసించే ప్రాంతాలు ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిదని అన్నారు. పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణుల ద్వారా ఎక్కువగా సాధ్యమవుతుందన్నారు.