అక్షర క్రమంలో కాకుండా ముందుగానే జగన్‌కు అవకాశం

మంత్రుల తర్వాత జగన్‌ ప్రమాణ స్వీకారానికి అంగీకరించిన సీఎం చంద్రబాబు. జగన్‌ వాహనం లోపలికి వచ్చే విధంగా వెసులుబాటు కల్పించిన సీఎం చంద్రబాబు.

Byline :  The Federal
Update: 2024-06-21 09:06 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు కల్పించారు. అసెంబ్లీ ఆవరణంలోకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాహనాన్ని అనుమతించడంతో పాటు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి కూడా మినహాయింపు కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రుల తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. వైఎస్‌ జగన్‌ మాజీ ముఖ్మమంత్రి అయినప్పటికీ, ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉండటంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడంతో పులివెందుల ఎమ్మెల్యేగానే ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్‌కు తక్కిన ఎమ్మెల్యేల కంటే ముందుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వెసులుబాటు కల్పించారు.

శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తున్న సీనియర్‌ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలుత సీఎం చంద్రబాబు నాయుడు చేత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. తర్వాత జనసేన అధినేత, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, శ్రాస్త సాంకేతిక శాఖల మంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పేర్ల వరస క్రమంలో మొదట హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత ప్రమాణ స్వీకారం చేయగా వరుస క్రమం ప్రకారం మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్థనరెడ్డి, సవిత, గుమ్మిడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, ఎన్‌ఎండీ ఫరూక్, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌ యాదవ్, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్‌ తదితరులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. ఆయన తర్వాత ఇతర సభ్యులు పేర్ల వరుస క్రమం ప్రకారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే అంతకుముందు ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార సమయానికి ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. ఐదు నిముషాలు సమయం ఉండటంతో సభలో ఆఖరు వరుసలో కూర్చున్నారు. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన పెద్దిరెడ్డి తదితర సభ్యులు ఉన్నారు. ప్రమాణ స్వీకారం సమయంలో పేరు పిలవగానే సభకు, సభ్యులందరికీ దండం పెడుతూ నేరుగ పోడియం వద్దకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబుకు కూడా నమస్కరించారు. ప్రతిగా సీఎం చంద్రబాబు కూడ జగన్‌కు ప్రతి నమస్కారం చేశారు. అనంతరం సభలో కూర్చోకుండా అందరికి దండం పెడుతూ బయటకు వెళ్లి పోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ చాంబర్‌లోకి వెళ్లి కొద్ది సేపు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లి పోయారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో తొలుత వైఎస్‌ జగన్‌మోహన్‌ అనే నేను అని పలికి తర్వాత తేరుకొని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అను నేను అని పలికి సవరించుకున్నారు.
అంతకు ముందు అసెంబ్లీకి చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ ప్రధాన గేటు నుంచి కాకుండా వెనుక గేటు నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. జగన్‌ కాన్వాయ్‌ని కాకుండా తన వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలోని సీడీ యాక్సెస్‌ రోడ్డు గుండా మందడం మీదుగా అసెంబ్లీకి చేరుకునే వారు. ఈ సారి ఆయన రూట్‌ మార్చారు. అమరావతి రైతులు ఆందోళనలు, నిరసనలు తెలుపుతారని భావించిన జగన్‌ తన రూటు మార్చినట్లు సమాచారం. అయితే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిముషాల అనంతరం సభలోపలికి వెళ్లారు. అక్షర క్రమంలో కాకుండా మంత్రుల తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలని, జగన్‌మోహన్‌రెడ్డి వాహనానికి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ సభ్యులు కోరగా అందుకు కూడా సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఇదే విషయాన్ని సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మీడియాకు వెల్లడించారు.
Tags:    

Similar News