చెంపదెబ్బలే కాదు చిత్రాతో పెళ్లంటూ కేసులేసిందీ తెనాలి 'కుర్రాళ్లే'

నటుడు చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమాలో 'మీది తెనాలే, మాది తెనాలే' అనే డైలాగ్ ను ఎంతగా వాడేస్తున్నామో గుర్తిందిగా..ఇప్పుడు అదేస్థాయిలో తెనాలి పేరు మార్మోగుతోంది

Update: 2024-05-17 05:09 GMT

ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమాలో 'మీది తెనాలే, మాది తెనాలే' అనే డైలాగ్ ను ఎంతగా వాడేస్తున్నామో గుర్తిందిగా.. ఇప్పుడు అదేస్థాయిలో తెనాలి పేరు యావత్ దేశమంతటా మార్మోగుతోంది. ఎలక్షన్ స్టేటస్ అని గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కొట్టడంతోనే మనకు.. 'ఆ చెంపా ఈ చెంపా చెళ్లుమనిపించే' వీడియో ఒకటి దర్శనం ఇస్తోంది. మే 13న తెనాలిలో ఓ పోలింగ్ బూత్ లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ప్రతి చోటా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా చాలామంది మందిలో తెనాలిలో గతంలో జరిగిన ఇటువంటి ఫన్నీ దృశ్యాలు, కేసులు గుర్తుచేసుకుంటున్నారు.

గుంటూరు జిల్లా తెనాలి దక్షిణ భారత దేశంలోనే ఓ విశిష్ట పట్టణం. కృష్ణా నది ఈ పట్టణంలో మూడు కాలువలుగా చీలి ప్రవహిస్తుంది. గొప్ప చారిత్రక, వ్యవసాయ, సాంస్కృతిక, సాహిత్య వారసత్వానికి ప్రతీక. చాలా మంది ప్రసిద్ధ కవులు, కళాకారులు, పండితులు, నటులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలకు నిలయం. కృష్ణా నది డెల్టా ప్రాంతంలోని పంచవటి పుణ్యక్షేత్రాలలో 'ఆంధ్రా ప్యారిస్' తెనాలి ఒకటి.
మన తెనాలి రామకృష్ణునితో మొదలు..
చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన కవి “గార్లపాటి రామ పండితుడు” ఎలియాస్ తెనాలి రామకృష్ణుడు “శ్రీకృష్ణ దేవరాయలు” ఆస్థానంలోని ఎనిమిది మంది అష్టదిగ్గజాలలో ఒకరు. రాజుల్ని రంగల్ని కించిత్ తల్లకిందులు చేసే తెలివి తేటలున్న మహాకవి.
1890లో కెప్టెన్ అలెగ్జాండర్ వోర్ తెనాలి తాలూకాలో కాలువలు, ఆనకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వారు.
1930లలో ప్రసిద్ధ రచయిత “ చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు” తెనాలిని “ఆంధ్రా ప్యారిస్”గా నామకరణం చేసిన వారు.
1942 ఆగస్టు 12న తెనాలిలో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఏడుగురు సమరయోధులు బలిదానం చేసి చరిత్రకెక్కారు. ఆనాడే తెనాలి ప్రపంచ చరిత్ర పటంలోకి ఎక్కింది. నాటి బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ దృష్టిని ఆకర్షించింది.
ఆంధ్రా ప్యారిస్.. అనేక ఉద్యమాలు..
ఆంధ్రా ప్యారిస్ అనేక చారిత్రక సంఘాలకు నాయకత్వం వహించింది. అనేక సామాజిక, విప్లవాత్మక సంఘటనలకు నిర్లక్ష్యం వహించింది. 1920లో బ్రాహ్మణేతర ఉద్యమం (సూర్యదేవర రాఘవయ్య చౌదరి), 1940లో హేతువాద ఉద్యమం (కవిరాజు శ్రీ త్రిపురనేని), 1950లో రాడికల్ హ్యూమనిస్ట్ మూవ్‌మెంట్, (ఎం.ఎన్. రాయ్) లాంటి మహత్తర ఉద్యమాలకు పుట్టిల్లు.
ఇక రాజకీయాలకు తెనాలి చాలా చైతన్యాత్మక కేంద్రం. అందుకే ఆంధ్ర రాజకీయాల్లో తెనాలి స్థానం ప్రత్యేకమైంది. అందుకే దీన్ని ఆంధ్ర డౌనింగ్ స్ట్రీట్‌ అంటుంటారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో..
స్వాతంత్ర్య ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన నన్నపనేని వెంకట్రావు, ఆలపాటి వెంకటరామయ్య, మాజీ న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు, సినీనటుడు ఘట్టమనేని కృష్ణ, మాజీ ముఖ్యమంత్రులు నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్య, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లాంటి వారెందరో ఈ ప్రాంతానికి చెందిన వారే.
అనేక వివాదాలకూ కేంద్రమే...
ఈ చరిత్రంతా ఒక ఎత్తయితే మరోవైపు అనేక వివాదాలూ తెనాలితో ముడిపడి ఉన్నాయి. కేఏ అబ్బాస్ దర్శకత్వం వహించిన 'ది నక్సలైట్స్' సినిమాను గుంటూరులో కాకుండా తెనాలిలో ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడంపై పెద్ద వివాదమే నడిచింది.
చిత్రా రామచంద్రన్ వ్యవహారం..
అప్పుడెప్పుడో ఐఎఎస్ అధికారి చిత్రా రామచంద్రన్ తెనాలి ఆర్డీవోగా ఉన్నారు. అప్పుడో ఆకతాయి.. చిత్రా రామచంద్రన్ తాను పెళ్లి చేసుకున్నామని పేపర్లలో ప్రకటనలు, కరపత్రాలు పంచి వివాదం సృష్టించారు. ఆమెతో ఎటువంటి ముఖపరిచయం కూడా ఈ ఆకతాయి మాటల్ని పట్టించుకోకుండా పోలీసులు నాలుగు చీవాట్లు పెట్టి వదిలేశారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా పరిగణించి విడిచిపెట్టారు. అయితే అతగాడు ఆమె తన భార్యేనంటూ కోర్టుకెళ్లి నానా హంగామా చేశారు. కోర్టు ఈ కేసును మొగ్గలోనే తుంచివేయడంతో ఆ పిచ్చి వ్యవహారం అంతటితో ముగిసింది.
ప్రియాంకా గాంధీ ముచ్చట...
నీళ్లనుంచి పెట్రోల్ తీస్తానంటూ రామర్ పిళ్లై హడావిడి చేస్తున్న రోజుల్లో తెనాలి యువకుడొకరు ఇంకో వివాదానికి తెర లేపాడు. రాజీవ్, సోనియా గాంధీల ముద్దుల కుమార్తె ప్రియాంకా గాంధీ, తాను ప్రేమించుకున్నామంటూ మీడియాకు మేత వేశాడు. అది కొంతకాలం అలా సాగి చివరకు పోలీసుల రంగం ప్రవేశంతో ముగిసింది. ఇవన్నీ నవ్వులాటలకు బాగానే ఉన్నాయి.
నాదెండ్ల భాస్కరరావు వ్యవహారం...
సీరియస్ వ్యవహారాలలో నాదెండ్ల భాస్కరరావుది ఒకటి. తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల ఎన్టీరామారావు మంత్రివర్గంలో కీలకమైన వ్యక్తి. ఎన్టీఆర్ విదేశాలలో ఉన్న సమయంలో రాష్ట్ర గవర్నర్ రామ్ లాల్ తో కలిసి కుట్రపన్ని ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. శాసనసభలో బలాన్ని నిరూపించుకోవడంతో విఫలం కావడంతో నాదెండ్ల భాస్కరరావు రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా తెనాలి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.
ఇకనిప్పుడు, తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలింగ్ సందర్భంగా మే 13న ఆయన క్యూలో నిలబడిన ఓ ఇంజినీర్ ఓటరును చెంపదెబ్బ కొట్టడం, దానికి ఆ ఓటరు తిరిగి కొట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది. ప్రాంతీయ మొదలు జాతీయ, అంతర్జాతీయ ఛానళ్ల వరకు ఈ వీడియోను ప్రసారం చేయడం క్షణాల్లో జరిగిపోయింది. ఇప్పుడిదో పెద్ద వ్యవహారంగా మారింది. దానిపై ఖండనమండనలు మొదలయ్యాయి. చివరకు ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోవడం, దానికి మళ్లీ ఆ ఓటరు కౌంటరు ఇవ్వడం, వివిధ పార్టీల నేతల వ్యాఖ్యానాలతో తెనాలి మరోసారి దేశపుటల్లోకి ఎక్కింది.
Tags:    

Similar News